గ్రాండ్ ఓల్డ్ పార్టీ రూటు మార్చింది. మహాత్ముడు నేర్పిన మార్గాన్ని బాగా అర్థం చేసుకుంది. ప్రజల్లోకి వెళ్తేనే, ప్రజలతో ఉంటేనే పార్టీకి మనుగడ సాధ్యమని కాంగ్రెస్ గుర్తించింది. సగటు ఓటర్లతో తెగిపోయిన కనెక్షన్ ను పునరుద్ధరించుకునేందుకు పాదయాత్ర మార్గాన్ని ఎంచుకుంది. స్వాతంత్ర సమరంలో గాంధీజీ చేపట్టిన దండి మార్చ్ ను గుర్తు చేసుకుంటూ.. భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తారు. యువతకు పెద్ద పీట వేసే దిశగా కాంగ్రెస్ దాదాపు కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ యాత్రలో పాల్గొంటారని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూత్రప్రాయంగా వెల్లడించారు. గాంధీ జయంతి అక్టోబరు 2నే ఈ యాత్ర ప్రారంభమై ఏడాది పాటు సాగుతుందని సమాచారం. తాను కూడా యాత్రలో మమేకమై… పార్టీ సాధారణ శ్రేణులతో కలిసిపోయేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్రలో జనాన్ని కలుసుకోవడంతో పాటు… బీజేపీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వ.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రయత్నిస్తారు. ప్రజల పడుతున్న కష్టాలను తెలుసుకుని… వారికి కాంగ్రెస్ చేయగలిగిందేమిటో చెబుతారు…
పీకే లేకపోతేనేమీ…?
కాంగ్రెస్ లో చేరతారనుకున్న ప్రశాంత్ కిషోర్ ఆ పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ మనుగడకు ఎలాంటి ఢోకా లేదని ఆయన ప్రకటించారు. పీకే సూచనలను, సలహాలను మాత్రం కాంగ్రెస్ తూచ తప్పకుండా పాటిస్తోంది. ఉదయ్ పూర్ చింతన్ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నీ పీకే చేసిన సూచనలుగానే భావిస్తున్నారు. అందులో మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాంగా భావించే పాదయాత్ర కూడా ఉంది.. చింతన్ శిబిరంలో మూడు రోజుల చర్చలతో అన్ని చింతలు తీరాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీలో యూత్ ఫోర్స్
జరిగిందేదో జరిగిపోయింది.. ఇకనైనా యువతకు పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ తీర్మానించుకుంది. అన్ని విభాగాల్లో ఉన్న పదవుల్లో 50 శాతం మేర యువతకే కేటాయించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ సైతం యువజన కాంగ్రెస్ నుంచే ఎదిగారని చెబుతూ.. ఆయన మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. సీనియర్ల సేవలను మరో విధంగా వాడుకోవాలని తీర్మానించిన పార్టీ అధిష్టానం .. పదవుల్లో మాత్రం వారికి ప్రాధాన్యం తగ్గించాలని నిర్ణయించింది. ఐదేళ్లు పదవిలో ఉన్న వారు వైదొలగాల్సి ఉంటుందని, అంతగా కోరుకుంటే…మూడేళ్ల కూలింగ్ పీరియడ్ తర్వాత మళ్లీ పదవులు చేపట్టే అవకాశం ఇస్తామని పార్టీ చెబుతోంది. రాజ్యసభ సీటును పట్టుకుని వేలాడే వారికి కూడా అధిష్టానం ఝలక్ ఇచ్చింది. ఎంత పెద్దవారైనా సరే రెండు పర్యాయాలు మాత్రమే రాజ్య,సభ సభ్యత్వం తీసుకోవాలని, ఇంకా ఎన్నికల రాజకీయాల్లో ఉండాలనుకుంటే మాత్రం లోక్ సభకో, శాసనసభకో పోటీ చేయాలని నిబంధన విధించబోతోంది..
జాతీయవాదంలో హస్తం పార్టీ వెనుకబడిందా..
హిందూ జాతీయవాదాన్నే పార్టీ వాదంగా మార్చుకుని జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీని పార్టీ ఇప్పటికిప్పుడు ఎదుర్కోలేకపోతోంది. బీజేపీ చేస్తున్న ఆరోపణల దాడులను తిప్పికొట్టలేకపోతోంది. లోక్ సభ ఎన్నికలు రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నందున పార్టీని తక్షణమే మేలుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది.ఆర్టికల్ 370 లాంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ దృఢమైన వైఖరిని పాటించలేకపోయింది. అందుకే జాతీయవాదం పట్ల పార్టీ తనకున్న చిత్తశుద్ధిని నిరూపించలేకపోయింది. జాతీయ వాదం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న నినాదాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలంటే పాదయాత్ర లాంటి కార్యక్రమాలతోనే సాధ్యం.
దళితులు, ఆదివాసీలు క్రమంగా కాంగ్రెస్ కు దూరమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచించాలి.. పార్టీ పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరుగుతుందని గుర్తించాలి. కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అప్పుడే తన ఓటు బ్యాంకులేమిటో కాంగ్రెస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
బీజేపీకి ప్రాంతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కాదని, కాంగ్రెస్ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదన్న రాహుల్ గాంధీ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలి. ఆప్, తృణమూల్ లాంటి పార్టీల వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని రాహుల్ అంటున్నారు. అయితే డీఎంకే లాంటి విశ్వసనీయమైన మిత్రపక్షం విషయంలో నోరు జారకూడదని కాంగ్రెస్ గ్రహించాలి…