ఇంఛార్జ్ పదవి కోసం తమ్ముళ్ల ఫైట్

By KTV Telugu On 11 November, 2022
image

సత్తెనపల్లిలో సతమతమవుతోన్న టీడీపీ
మూడేళ్లుగా పార్టీని నడిపించే నాయకుడే కరువు
తారాస్థాయికి కోడెల, జీవీ వర్గాల మధ్య వర్గపోరు

పల్నాడులో గ్రూపు రాజకీయాలతో టీడీపీ సతమతమవుతోంది. సత్తెనపల్లిలో నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి కోసం రెండు వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నేతల మధ్య కుమ్ములాటలు అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. కోడెల, జీవీ వర్గాలు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీనిపై ఫోకస్ పెట్టిన అధినాయకత్వం స్థానికంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చేపట్టింది. అయితే అది కాస్త రసాభాసగా మారింది. తమ్ముళ్లు తన్నుకునే వరకు వెళ్లారు. నాలుగు మండలాలు, సత్తెనపల్లి పట్టణ అధ్యక్ష పదవితో పాటు క్లస్టర్‌ ఇంఛార్జ్‌ల నియామకం కోసం అభిప్రాయ సేకరణ జరపటానికి పార్టీ పరిశీలకుల బృందం వచ్చింది. తొలుత నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ని నియమించాలంటూ కోడెల వర్గం రచ్చరచ్చ చేసింది. తమ నాయకుడికే బాధ్యతలు అప్పగించాలంటూ శివరాం, అటు ఆంజనేయులు వర్గాలు వాదులాడుకున్నారు. ఈ సందర్భంగా తమ్ముళ్లు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

2019 ఎన్నికల్లో సత్తెనపల్లిలో టీడీపీ పరాజయం పాలైంది. టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నుంచి 20వేలకు పైగా మెజార్టీతో అంబటి రాంబాబు గెలుపొందారు. టీడీపీ ఓటమి, ఆ తర్వాత శివప్రసాదరావు మరణంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇంఛార్జ్ లేకుండా పోయారు. ఆయన వారసునిగా నియోజకవర్గంపై పట్టుకోసం కోడెల శివరాం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు సైతం నియోజకవర్గంలో ప్రభావం చూపిస్తుండడంతో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. పార్టీ పదవుల్లో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ పదవుల పంపకం కోసం వచ్చిన పరిశీలకుల సమక్షంలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. తమ నాయకుడికే ఇంఛార్జ్ పదవి ఇవ్వాలంటూ కోడెల శివరాం అనుచరులు కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి పరిశీలకులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో జీవీ బ్యాచ్ ఇంఛార్జ్ పదవి కోసం పట్టుబట్టడంతో అక్కడ ఘర్షణ తలెత్తింది.

మూడేళ్లుగా నియోజకవర్గానికి ఇంఛార్జ్ అంటూ ఎవరూ లేకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎవరి దారి వారిదే అన్నట్టుగా అక్కడ రాజకీయం నడుస్తోంది. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలను స్థానిక నేతలు వేర్వేరుగా నియమిస్తుడటంతో క్యాడర్‌ అయోమయానికి గురవుతోంది. పార్టీ బలంగా ఉన్నా నడిపించే నాయకుడు లేరని ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల అన్న క్యాంటీన్లను కూడా ముగ్గురు నేతలు వేర్వేరుగా నిర్వహించడం వివాదాలకు తావిచ్చింది. కోడెల శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులతో పాటు నాగోతు శౌరయ్య, మన్నెం శివ నాగమల్లేశ్వరరావులు ఇంఛార్జ్ పదవిని ఆశిస్తున్నారు. ఇక, అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి మంత్రి అయ్యాక నియోజకవర్గంలో మరింత దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే బలమైన నేత ఉండాలని భావిస్తున్న అధిష్టానం అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది. కోడెల శివరాం కారణంగానే గత ఎన్నికల్లో సత్తెనపల్లిని కోల్పోయామనే భావనలో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.