ఇటు సిట్‌..అటు ఈడీ.. పోటాపోటీ దర్యాప్తులు

By KTV Telugu On 17 November, 2022
image

కేసినో, ఢిల్లీ లిక్కర్ కేసుల్లో దూకుడు పెంచిన ఈడీ
ఫామ్‌హౌస్ డీలింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఇప్పటికే బీజేపీపై యుద్ధం ప్రకటించారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బీజేపీ కుట్రలను బయటపెట్టడానికి ఫామ్‌హౌస్‌ డీలింగ్‌పై అరెస్టయిన ముగ్గురు నిందితులపై సిట్‌ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ జైల్లో ఉన్నారు. ఈ మొత్తం కుట్ర వెనకాల ఎవరున్నారో తేల్చడానికి సిట్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, కొచ్చి ప్రాంతాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆధారాల కోసం వెతికారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ 21వ తేదీన విచారణకు హాజరు కావాలని తుషార్‌కు నోటీసులు జారీ చేశారు. రామచంద్ర భారతి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిల సంభాషణల్లో తుషార్ పేరు పదేపదే రావడంతో అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ డాక్టర్ కోసం సిట్ బృందం కేరళ వెళ్లింది. అయితే పోలీసులు వస్తున్నారని తెలిసి ఆ డాక్టర్ పారిపోయాడు.

తుషార్ కి రామచంద్రభారతికి ఈ డాక్టర్ మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ ఫామ్‌ హౌస్‌ కేసులో రాజ్‌భవన్‌ను కూడా లాగాలని చూశారని అన్నారు. తన వద్ద పనిచేసిన తుషార్‌కు సంబంధం ఉందని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. అయితే తాము చెప్పిన తుషార్‌ గవర్నర్ దగ్గర పనిచేసిన తుషార్‌ వేరు వేరని మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై గవర్నర్ ఎందుకు మాట్లాడారో తమకు అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పుడు సిట్‌ నోటీసులు జారీ చేసిన తుషార్‌ కేరళ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. ఇది ఇలా ఉంటే అటు అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‎కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు లింక్‎లు ఉన్నట్లు బయటపడింది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేట్ చార్టెర్డ్ విమానాల ద్వారా పెద్ద ఎత్తున ఢిల్లీకి నగదు తరలించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. చార్డర్డ్ ఫ్లైట్స్‎లో డబ్బు తరలించడం వెనక తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల ప్రమేయంపైనా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.

ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ కేసులో అప్రూవర్ గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోరా స్టేట్ మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని బీజేపీ నాయకులు ఆరోపించారు. దాంతో ఇది ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చీకోటి ప్రవీణ్‌ క్యాసినో హవాలా కేసులో విచారణ మళ్లీ మొదలైంది. తాజాగా మంత్రి తలసాని సోదరులు ఇద్దరిని విచారించింది ఈడి. ఫారిన్‌ ఎక్సెంజ్‌ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలతో తలసాని మహేశ్‌ యాదవ్‌, తలసాని ధర్మేంద్ర యాదవ్‌ ను ఈడీ అధికారులు తొమ్మిది గంటలు విచారించారు. హవాలా వ్యాపారులతో వారికి ఉన్న సంబంధాల గురించి ప‌్రశ్నించారు. ఫోన్‌ కాంటాక్ట్స్‌, వాట్సాప్‌ చాటింగ్స్, ఫ్లైట్ టికెట్స్‌, బ్యాంక్‌ ట్రాన్సాక్షన్స్‌ ఆధారంగా ఆ ఇద్దరి వద్ద సమాచారం రాబట్టారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, మెదక్‌ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవందర్‌రెడ్డికి ని కూడా విచారించారు. ఈ విధంగా ఇటు సిట్‌ అటు ఈడీ పోటాపోటీగా చేస్తున్న దర్యాప్తులు రాజకీయ నాయకులకు దడ పుట్టిస్తున్నాయి.