లిక్కర్‌ స్కామ్‌.. ఢిల్లీ టూ హైదరాబాద్‌ వయా బేగంపేట్‌!

By KTV Telugu On 19 November, 2022
image

‘జెట్‌ సెట్‌ గో’కి లిక్కర్‌ స్కామ్‌తో సంబంధమేంటి?
ఆ ఎయిర్‌వేస్‌ సాక్షిగా లిక్కర్‌ స్కామ్‌ నడిచిందా?

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ని మించిపోయింది ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌. ప్రతీ ఎపిసోడ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. కొత్త కొత్త పాత్రలు తెరపైకొస్తున్నాయి. ఊహించని ట్విస్టులతో స్కామ్‌ ఇన్వెస్టిగేషన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వాన్ని షేక్‌ చేస్తున్న లిక్కర్‌స్కామ్‌లో తెలుగురాష్ట్రాలకు సంబంధించిన మరో లింక్‌ బయటపడింది.
అనధికారిక నగదు చలామణి హవాలా రూట్లో నడుస్తుంది. కానీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారమంతా హవాలో అంటే ఆకాశమార్గంలో సాగిందని ఈడీ అనుమానిస్తోంది. స్కామ్‌తో సంబంధాలున్నవాళ్ల రాకపోకలకు, క్యాష్‌ ట్రాన్సాక్షన్స్‌కు విమానాలు వాడి ఉంటారని ఈడీ వాసనపట్టింది. జెట్‌సెట్‌గో ఏవియేషన్‌పై కూపీ లాగుతోంది. ఆ విమానయాన సంస్థ ఎవరిదో కాదు ఇప్పటికే ఈడీ అరెస్ట్‌ చేసిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి భార్యది.

జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ శరత్‌ భార్య కనికారెడ్డిదేనని ఈడీ నిర్ధారించుకుంది. ఈ సంస్థ చార్టర్డ్‌ విమానాల్లోనే బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు నగదు తరలించారని ఈడీకి కొన్ని ఆధారాలు దొరికాయంటున్నారు.
సాధారణంగా ఎయిర్‌పోర్టు అంటే భద్రత, నిఘా కట్టుదిట్టంగా ఉంటుంది. తనిఖీలు లేనిదే ఏ వస్తువూ లోపలికి పోదు బయటికి రాదు. కానీ బేగంపేట విమానాశ్రయంలో పరిస్థితి వేరు. ఇక్కడ స్క్రీనింగ్ పాయింట్లు లేవని సమాచారం. వీఐపీల వాహనాలు నేరుగా రన్‌వేపై ఫ్లయిట్స్‌దాకా వెళ్లొచ్చు. ఈ వెసులుబాట్లను జెట్‌ సెట్‌ గో వాడుకున్నట్లు ఈడీ భావిస్తోంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి దీనిపై లేఖరాసింది. జెట్‌సెట్‌ గో ఏవియేషన్‌ డాక్యుమెంట్లు, సిబ్బందితో పాటు ప్యాసింజర్ల వివరాలు అందించాలని కోరింది. ఈడీ వివరాలు అడిగాక బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో నిఘా పెరిగింది. ఎగిరిపోతే ఎంత బాగుంటుందనుకున్నవాళ్లంతా ఈడీ ఆరాతో ఉలిక్కిపడుతున్నారు. ఆకాశయానం సాక్షిగా దొరికిన ఆధారాలతో తెలుగురాష్ట్రాల్లో మరికొంతమంది ఈ స్కామ్‌లో బుక్కయ్యేలా ఉన్నారు.