అంతా ఒకే తానుముక్కలు. VSR బంధువు కూడా
ఢిల్లీ టూ హైదరాబాద్ వయా ఏపీ.. ఎన్ని లింకులో!
లిక్కర్‌స్కామ్ ఢిల్లీనే కాదు తెలుగురాష్ట్రాల్ని కూడా షేక్చేస్తోంది. సిసోడియా లింకు దొరికిపోవటంతో ఢిల్లీ ఆప్ సర్కారుని బుక్ చేద్దామని తీగలాగితే ఎక్కడెక్కడి డొంకో కదులుతోంది. కేసీఆర్ కూతురు పేరు కూడా కొన్నాళ్లక్రితం తెరపైకొచ్చింది. అయితే ఆమెకేమీ శ్రీముఖాలు లేకపోవటంతో గులాబీ పార్టీ ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడు మ్యాటర్ అటూఇటూ తిరిగి ఏపీకొచ్చి ఆగింది. ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు అరెస్ట్‌తో వైసీపీ ఉలిక్కిపడింది. ఇప్పటిదాకా టీడీపీ నేతలపై దుమ్మెత్తిపోసిన వైసీపీని ఈ పరిణామం ఆత్మరక్షణలో పడేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఆధారాన్నీ వదలని ఈడీ ఇప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరిలో విజయసాయిరెడ్డి సమీప బంధువు ఉండటం విశేషం. ఈడీ అరెస్ట్ చేసిన పెన్నాక శరత్‌చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయానా అన్న.
ఆయనతో పాటు తెలంగాణకు చెందిన వినయ్‌బాబు కూడా లిక్కర్ స్కామ్‌లో బుక్ అయ్యారు. శరత్ చంద్రారెడ్డి, వినయ్‌బాబు ఇద్దరూ మద్యం బిజినెస్‌లో కోట్ల టర్నోవర్ నడుపుతున్నారని ఈడీ గుర్తించింది. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్.
సెప్టెంబరు చివరివారంలోనే ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు మూడురోజులు ప్రశ్నించారు. అరబిందో గ్రూపులోని 12కంపెనీలకు ఆయన డైరెక్టర్. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి కూడా శరత్‌చంద్రారెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ని సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు కూడా చెల్లించారు. గతంలో హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. అతని ఇంటరాగేషన్‌తో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అల్లుడి అరెస్ట్‌తో ఢిల్లీ లాబీయింగ్‌లో ఆరితేరిన విజయసాయిరెడ్డికి ఇంటాబయటా కొత్త సవాలు వచ్చిపడింది.