మొన్నటిదాకా జైలుగోడల మధ్య మగ్గాడు. పెరోల్తో మళ్లీ బాహ్యప్రపంచంలోకి వచ్చాడు. అయిపోగానే మళ్లీ జైలు జీవితమే. అయితేనేం డేరాబాబాకి ఈ మాత్రం గ్యాప్ చాలదా రఫ్పాడించడానికి. అదే చేస్తున్నాడు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్. పెరోల్‌పై బయటికొచ్చి దీపావళి పండక్కి తన మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు బాబా. పెరోల్మీదొచ్చి ఇలా హంగామా చేయొచ్చా అన్నది పక్కనపెడితే యూట్యాబ్‌లో ఆయన వీడియో రికార్డు వ్యూస్ సాధిస్తోంది. స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు డేరా బాబా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. చుట్టూ శిష్యగణం, సంపదను చూసుకుని ఒళ్లు తెలియలేదు. 2017లో రేప్ కేసులో దోషిగా తేలటంతో జైలుపాలయ్యాడు. అయితేనే ఐదేళ్లలో అయ్యగారికి ఐదుసార్లు పెరోల్ దొరికింది. ఈమధ్యే పెరోల్‌మీద బయటికొచ్చి మళ్లీ వార్తల్లోకెక్కాడు. పెరోల్లో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు దంచేస్తున్నాడీ బాబా. కొందరు బీజేపీ నేతలు కూడా ఆయన ప్రసంగాలకు తన్మయత్వంతో ఊగిపోతున్నారు. పెరోల్‌కి బలమైన కారణం ఉండాలి. డేరాబాబాకి మాత్రం ఎందుకో మినహాయింపులు దొరుకుతున్నాయన్న విమర్శలున్నాయి. కుటుంబ సభ్యులని కలవాలని, ఆశ్రమంలో ఉండదలచుకున్నానని ఆయన పెరోల్ పొందుతున్నారు. జైలు నుంచి బయటికొచ్చినప్పుడు ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఇస్తున్నారు. రేప్ కేసులో 20ఏళ్లు, జర్నలిస్టు హత్యకేసులో యావజ్జీవ జైలుశిక్షపడిన నేరస్తుడికి మన వ్యవస్థ కల్పిస్తున్న భద్రత ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.