మూడు రాజధానుల కోసం రాజీనామా అన్నారు
మళ్లీ రాష్ట్రానికి ఒకే రాజధాని అంటూ మడతేశారు
ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత నిజమేనంటున్నారు
మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారంతో వైసీపీ నాయకత్వం పరేషాన్ అవుతోంది. జగన్ కేబినెట్ లో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన విపక్షాల విమర్శలకు బదులిచ్చే క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల మూడు రాజధానులకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి ఉత్తరాంధ్ర ఉద్యమంలో చేరతానన్న ఆయన అన్నంత పనిచేసేందుకు సిద్ధపడ్డారు. జగన్ వారించడంతో ఆగిపోయారు. అయితే అదంతా వైసీపీ మైండ్ గేమ్ లో భాగమనుకున్నారు. కానీ ఇటీవల ఆయన చేసిన మరో కామెంట్ దుమారం రేపింది. మూడు రాజధానులే ముద్దంటూ ప్రభుత్వం ముందుకెళ్తోన్న వేళ సడన్ గా ధర్మాన నాలుక మడతేశారు. రాష్ట్రానికి ఒకే రాజధాని అంటూ ప్రకటించారు. అది వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది. ఆ వేడి చల్లారకముందే ప్రభుత్వంపై మరో వివాదాస్పద కామెంట్ చేశారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తమ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవేమనని అంగీకరించిన ఆయన దానికి కారణం చెప్పారు. తాము అమలు చేస్తున్న సంస్కరణలు ప్రజలకు అర్థంకాకపోవడమే వ్యతిరేకత అనేలా చెప్పుకొచ్చారు. ఆయన ఏవిధంగా చెప్పినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఇరకాటంలో పడేసినట్లు అయ్యింది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తుంది. వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం తాము చేసిన పనులను గడపగడపకు వెళ్లి వివరిస్తోంది . ఈ సమయంలో అక్కడక్కడా ఎమ్మెల్యేలకు ఛేదు అనుభవం ఎదురవుతోంది. ప్రజలనుంచి నిరసన సెగ తగులుతోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రత్యర్థులన్నాక ఆ మాత్రం అంటారని లైట్ తీసుకుంటుంది ప్రభుత్వం. కానీ ఏకంగా ఓ సీనియర్ మంత్రే విపక్షాల మాట నిజమేనని వ్యాఖ్యానించడం వైసీపీ శ్రేణులను షాక్ కు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన సర్కార్ సంస్కరణలు ప్రజలకు అర్దం కావడం లేదన్నారు. అలాగే, రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపైనా ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. గోతులు తాము తవ్వలేదు కదా అంటూ ధర్మాన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు ప్రజా వ్యతిరేకత ఎందుకుంటుందని జగన్ అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలను మెప్పించే విధంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ వాగ్ధానాన్ని నెరవేర్చామని చెబుతున్నారు. ఈ క్రమంలో గడపగడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన మేలు గురించి ప్రజలకు వివరిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. అయితే అక్కడక్కడా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి సర్ధుకుంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే పనితీరు మెరుగుపర్చుకోవాలని ప్రజాప్రతినిథులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. సర్వే రిపోర్ట్ లు తెప్పించుకుంటున్నారు. తన పరిపాలనపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్న జగన్ 175కు 175 గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్న ధీమాతో కనిపిస్తున్నారు. అయితే ధర్మాన కామెంట్స్ అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అక్కడక్కడ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు పలు సమస్యలపై నిలదీస్తున్నారు. ఈక్రమంలోనే ధర్మాన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.