– మూడు రాజధానులపై వైసీపీ దూకుడు
– తెరపైకి ధర్మాన రాజీనామా అంశం
– రాజీడ్రామా అంటున్న టీడీపీ, జనసేన
ఏపీలో రాజధాని, రాజీనామాల అంశం హీట్ పెంచుతోంది. మూడు రాజధానులకు మద్దతుగా ఇటీవలే విశాఖ కేంద్రంగా గర్జించిన అధికార పార్టీ నేతలు…రాజీనామా అంశం తెరపైకి తెస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని కోసం మంత్రి పదవికి రిజైన్ చేస్తానంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మాన ప్రసాదరావు..అన్నంత పని చేసేందుకు సిద్ధపడ్డారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ ముఖ్యమంత్రిని కలిసి కోరారు. అయితే, సీఎం జగన్ ధర్మానను వారించారని తెలుస్తోంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సైతం ఇటీవల రాజీనామా పేరుతో కలకలం సృష్టించారు.
మూడు రాజధానుల విషయంలో వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. ధర్మాన రాజీనామా నిర్ణయం కూడా అందులో భాగమేనని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో ఉద్యమ వేడిని పెంచడం ద్వారా బలంగా ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. తద్వారా ధర్మాన, ధర్మశ్రీ లాంటి నేతలతో రాజీనామాలు చేయించి…ప్రజాతీర్పు కోరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అప్పుడు పరిణామాలు తమకు అనుకూలిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారనే టాక్ నడుస్తోంది. ఇదంతా వైసీపీ స్కెచ్ లో భాగమంటూ ఇటీవల ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు
ధర్మాన రాజీనామా ప్రతిపాదనపై టీడీపీ, జనసేనలు మండిపడుతున్నాయి. ధర్మాన, ధర్మశ్రీ లపై భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రాజీ డ్రామా చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా ఉత్తరాంధ్రలో గొడవలకు వైసీపీ ప్లాన్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అడ్డంకులు స్పష్టిస్తోందని.. ఇప్పుడు రాజీనామా పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్వం చేస్తుందని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు.