రవీంద్రారెడ్డి మళ్లీ యాక్టీవ్ అవుతున్నారా …. !
పార్టీ ఏదైనా…పోటీ పక్కా అంటోన్న ఫైర్ బ్రాండ్
వైసీపీపై విమర్శలతో టీడీపీలో చేరతారనే ప్రచారం
బాబు ఊ అంటారా..ఊహూ అంటారా?
ఆ ఫైర్ బ్రాండ్ నేత మళ్లీ యాక్టీవ్ అవుతున్నారా? రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ పరిస్థితుల్లో సైలెంట్ అయిపోయారు. పార్టీలు మారినా ఎక్కడా పరిస్థితులు అనుకూలించడం లేదు. పదవులు దక్కడం లేదు. అయినా ఫైరింగ్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. పార్టీ ఏదైనా వచ్చే ఎన్నికల్లో మాత్రం పక్కాగా బరిలో దిగుతానంటున్నారు. ఇంతకీ 2024లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? ఇదే అంశం ఇప్పుడు కడప జిల్లాలో హట్ టాపిక్‌గా మారింది. డీఎల్ రవీంద్రారెడ్డి ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగడించారు. ఏది మాట్లాడినా కుండబద్దలు కొడతారు. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఏకిపడేస్తుంటారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం డీఎల్‌కు పెట్టని కోట. ఇక్కడి నుంచి ఒకసారి ఇండిపెండెంట్‌గా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు మంత్రిగా పని చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో ప్రధానంగా డీఎల్ రవీంద్రారరెడ్డి వర్సెస్ రఘురామిరెడ్డి అన్నట్లుగా రాజకీయం ఎంతో కాలంగా కొనసాగుతోంది.
డైలమాలో డీఎల్..
వైఎస్ జగన్ వైసీపీ ఏర్పాటు చేసి కడప ఎంపీగా పోటీ చేసిన వేళ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు డీఎఎల్. ఇక, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న డీఎల్ నేరుగా సీఎంపై విమర్శలు చేయడం ద్వారా బర్తరఫ్ అయ్యారు. అనంతరం చోటుచేసుకున్న రాష్ట్ర విభజన పరిణామాలతో డీఎల్ రాజకీయ జీవితం డైలమాలో పడింది. పదవులకు దూరమైనా ఫైర్ బ్రాండ్ మాత్రం కంటిన్యూ అవుతోంది. విభజనానంతరం 2014లో అప్పటి టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్‌కు మద్దతు పలికారు డీఎల్. అయితే పార్టీలో చేరకపోవడంతో ఎలాంటి పదవి దక్కలేదు. అలా 2014 నుంచి పదవులకు దూరమయ్యారు మైదుకూరు ఫైర్ బ్రాండ్. 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న డీఎల్‌కు నిరాశే ఎదురైంది. చంద్రబాబు మరోమారు పుట్టా సుధాకర్ యాదవ్‌కు టిక్కెట్ ఇవ్వడంతో కలత చెందారు. చేసేదేమీ లేక గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిపోయారు. ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ సైతం డీఎల్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపునిస్తామని చెప్పారు. పార్టీ అధికారంలోకి రావడంతో ఎదో ఒక పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ నిరాశే ఎదురైంది.
టీడీపీ కాదంటే డీఎల్ దారెటు….!
డీఎల్ గత కొంత కాలంగా ప్రభుత్వం, పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేదల భూములను ఎమ్మెల్యేలే బెదిరించి రాయించుకుంటున్నారంటూ రఘురామిరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఆయన వైసిపికి దూరమైనట్లేననేది స్పష్టం కాగా 2024 ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. డీఎల్ తెలుగుదేశం వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓడిమిపాలైన పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తుతం ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల అధినేతతో ఆయన వరుస భేటీల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. పుట్టాకే చంద్రబాబు టికెట్ ఖరారు చేశారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో డిఎల్ దారెటూ అనే చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల బాబు నిర్వహించిన సర్వేలో డీఎల్ అయితే గెలుపు ఖాయమని తేలిందట. కానీ మైదుకూరులో బలమైన బీసీ అభ్యర్థిగా పుట్టా ఉండడంతో బాబు డోలాయమానంలో పడిపోయారు. డీఎల్ ఎంట్రీకి టీడీపీ అధినేత ఊ అంటారా ఊహు అంటారా ? టీడీపీ కాకపోతే జనసేన, బీజేపీ వైపు చూసే అవకాశముందా? ఇదే అంశంపై ఇప్పుడు కడప జిల్లాలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.