మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద హోదాలో పనిచేసే ఒక ఉన్నతాధికారి విచక్షణ కోల్పోయి చేసిన ఒక చిల్లర పనితో అతని ఉద్యోగం ఊడిపోయిది. సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసేవారకు వెళ్లింది పరిస్థితి. ఆయన పేరు శంకర్ మిశ్రా. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అయిన వెల్స్ ఫార్గో లో వైఎస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించారు. మార్గమధ్యంలో తాగిన మత్తులో సహ ప్రయాణికురాలైన ఒక వృద్ధురాలిపై ఈయన మూత్రవిసర్జన చేశారు. నవంబరు 26న జరిగిన ఈ ఘటన జరగ్గా ఈమధ్యే వెలుగులోకి వచ్చింది. అయితే ఇంతటీ అసహ్యకరమైన చర్యకు పాల్పడిన మిశ్రా పట్ల ఎయిరిండియా ఎలాంటి చర్యలు తీసుకోకుండా పంపించివేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదే విషయంపై ఎయిరిండియా అధికారులు స్పందిస్తూ బాధితురాలు శంకర్ మిశ్రాను క్షమించినందున ఆ సమస్య అక్కడితో ముగిసినట్లు తాము భావించామని తెలిపారు. అయితే ఆ వ్యక్తి చేత క్షమాపణ చెప్పించి తాను ఒప్పుకునేలా బలవంతపెట్టారని ఆ వృద్ధురాలు ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి ముఖాన్ని తాను చూడాలని అనుకోవట్లేదని చెప్పినా ఎయిండియా సిబ్బంది పట్టించుకోలేదని అతడిని తన ముందు కూర్చోబెట్టారని అన్నారు. తన భార్య పిల్లలు ఇబ్బంది పడేలా చేయొద్దని అతడు ప్రాధేయపడ్డాడని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై విమానయాన సంస్థకు ఫిర్యాదు చేస్తే తొలుత టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామన్నారని కానీ సగం డబ్బులు మాత్రమే ఇచ్చారని చెప్పారు. మిశ్రా చేసిన నీచమైన పనిని ఎయిర్ ఇండియా లైట్ తీసుకున్నా ఆయన పనిచేస్తున్న కంపెనీ వెల్స్ ఫార్గో మాత్రం సీరియస్ గా తీసుకుంది. వైఎస్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయన్ను తొలగించింది. తమ ఉద్యోగులు ఉన్నతంగా బాధ్యతాయుతంగా హుందాగా ప్రవర్తించాలని కోరుకుంటామని కంపెనీ తెలిపింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తమను కలవరపెడుతున్నాయని పేర్కొంది. కాగా బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు శంకర్ మిశ్రాను బెంగుళూరులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.