తెలంగాణలో 2023 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని దాదాపు అన్ని పార్టీలు నిర్ణయించాయి. టీఆర్ఎస్ ఎప్పుడూ పొత్తుల ఆలోచన చేయడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకునే వాళ్లులేరు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఆలోచనలు చేయకూడదని చింతన్ శిబిరంలో నిర్మయించుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో నేరుగా ఎవరూ పొత్తులు పెట్టుకోవడం లేదు. కానీ కొన్ని పార్టీల మధ్య అవగాహన మాత్రం ఉండే అవకాశం ఉంది.
పొత్తులను టీఆర్ఎస్ మొదటి నుంచి దూరం !
తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ సాధన లక్ష్యంతో వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర సాధన తర్వాత ఎవరితోనూ కలిసి నడవాలని అనుకోవడం లేదు. జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఒంటరి పోరు చేసింది. ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చాలా మంది టీఆర్ఎస్ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. దీంతో టీడీపీతో పొత్తు అన్న చర్చ వినిపించింది. అలాంటి అవకాశమే లేదని టీఆర్ఎస్ వర్గాలు తేల్చేస్తున్నాయి. ఉనికే లేని టీడీపీతో పొత్తు ఊహించలేని విధంగా ఉంటుందన్నారు. అయితే టీడీపీకి మద్దతుగా ఉండే కొన్ని వర్గాల అభిమానం కోసం ఎన్టీఆర్ ను పొగుడుతున్నారని అనుకోవచ్చంటున్నారు. ఇక కమ్యూనిస్టులతోనూ పొత్తులు ఉంటాయని ఓ ప్రచారం జరిగింది. కానీ అలాంటి పొత్తులకు టీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఎలా చూసినా టీఆర్ఎస్ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ కూడా పొత్తులకు దూరం !
తెలంగాణలో పొత్తుల కోసం అర్రులు చాచి చాలా సార్లు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. చాలా కలసి వస్తుందని అనుకుంది.కానీ అలాంటి అవకాశమే లేకుండా పోయింది. పైగా మైనస్ అయిందని ఫలితాలు తేల్చాయి. ఈ క్రమంలో ఈసారి ఒంటరిగా పోటీకే కాంగ్రెస్ మొగ్గు చూపుతుంది. టీడీపీతో పెట్టుకోరు.. టీఆర్ఎస్ తో పెట్టుకునే చాన్సే లేదని స్వయంగా రాహుల్ గాంధీ తేల్చారు. కమ్యూనిస్టులు దగ్గరకు వస్తారో లేదో తెలియదు . ఈ క్రమంలో పొత్తుల గురించి ఆలోచించడం వేస్ట్ అని ఒంటరిపోటీకి సిద్ధమని కాంగ్రెస్ చెబుతోంది.
బీజేపీ పెట్టుకుంటామన్న ఎవరూ రాకపోవచ్చు !
భారతీయ జనతా పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లలో డిపాజిట్ గల్లంతయింది. దీనికి కారణం పొత్తులు లేపోవడమే. టీడీపీతో పొత్తులున్నప్పుడు నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు గెలిచేవారు. పొత్తు లేకపోవడంతో ఒక్క స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పొత్తులుంటే మంచిదే అనుకుంటారు కానీ పొత్తులు పెట్టుకునే పార్టీలే లేవు. టీఆర్ఎస్ ప్రధాన శత్రువు అయింది. కమ్యూనిస్టులు దగ్గరకు రారు. టీడీపీతో పెట్టుకునే పరిస్థితి లేదు. జనసేన పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీది కూడా ఒంటరి పోరాటమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
లోపాయికారీ పొత్తులు మాత్రం ఉంటాయి !
తెలంగాణలో నేరుగా పొత్తులుండకపోవచ్చు కానీ.. లోపాయికారీ పొత్తులు అయితే ఉండటం ఖాయమని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ కోసం మజ్లిస్ సహకరిస్తుంది. ఎడెనిమిది చోట్ల తప్ప ఆ పార్టీ పోటీకి రాదు. మిగిలిన చోటల్లా టీఆర్ఎస్కు మద్దతిచ్చేలా ఒప్పందం జరుగుతుంది. ఆ ప్రకారం ఓట్ల బదిలీ జరుగుతుంది. దీనికి పొత్తు వరకూ అక్కర్లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా లోపాయికారీగా ఎవరికో ఒకరికి సహకారం అందించాల్సిందే. కమ్యూనిస్టులు… షర్మిల పార్టీ.. కేఏ పాల్ పార్టీ ఇలా అన్ని పార్టీలు.. ఇతర ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవు కానీ.. అంతర్గత సహకారంతో ఓట్లు చీల్చడమో… కలపడమో చేస్తాయి. అందుకే తెలంగాణ రాజకీయం ప్రత్యక్షంగా.. పరోక్షంగా… కూడా భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు.