ట్విట‌ర్‌లో మ‌ళ్లీ ట్రంపు కంపు..ఇంకేమేం చూడాలో!

By KTV Telugu On 20 November, 2022
image

ఎలాన్ మ‌స్క్ ఎగిరెగిరి ప‌డుతున్నాడు..ఏమ‌వుద్దో

ఇదివ‌ర‌కు వీనుల‌విందుగా కూసిన పిట్ట ఇప్పుడు న‌డిరాత్రి తీతువులా మారిపోయింది. ఇంటాబ‌య‌టా ట్విట్ట‌ర్ విశ్వ‌స‌నీయ‌త కోల్పోతోంది. ఎలాన్‌మ‌స్క్ కొన‌బోతున్నాడు అన్న‌ప్పుడే ట్విట‌ర్ సిన్మా ఎలా ఉండ‌బోతోందో అంద‌రికీ అర్ధ‌మైపోయింది. అంచ‌నాల‌కు మించి అరాచ‌కం చేస్తున్నాడు ట్విట‌ర్ సింగిల్ ఓన‌ర్‌. తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లంటున్నాడు. తాను మెచ్చిందే రంభ అనుకుంటున్నాడు. త‌న తెంప‌రిత‌నంతో అగ్ర‌రాజ్యం ప‌రువు పోగొట్టిన ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మ‌ళ్లీ ఎర్ర‌తివాచీ ప‌రిచాడు ఎలాన్‌మ‌స్క్‌.

అధికారం కోల్పోతున్న స‌మ‌యంలో ట్రంప్ అస‌హ‌నంతో ఊగిపోయాడు. విద్వేషాన్ని, విధ్వంసాన్ని ప్రోత్స‌హించాడు. దీంతో అప్ప‌ట్లో ట్విట్ట‌ర్ ఆయ‌న ఖాతాను బ్యాన్ చేసింది. అప్ప‌టినుంచీ అమ‌ల్లో ఉన్న నిషేధాన్ని ఎలాన్‌మ‌స్క్ ఎకాఎకి ఎత్తేశాడు. దానికో ఓటింగ్ ప్ర‌హ‌స‌నం న‌డిపించాడు. ప్ర‌జామోదంతోనే మ‌ళ్లీ ట్రంప్ ఎకౌంట్ పున‌రుద్ధ‌రించామ‌ని బిల్డ‌ప్ ఇస్తున్నాడు. ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ఆయ‌న‌కు అనుకూలంగా ఓటేశార‌ట‌. దీంతో 22 నెలల తర్వాత మ‌ళ్లీ ట్రంప్ ఎకౌంట్‌ ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది.

ట్రంప్ ఖాతా పున‌రుద్ధ‌ర‌ణ‌తో ట్విట‌ర్‌లో ఇలాంటి విచిత్రాలు ఇంకా చాలానే జ‌ర‌గ‌బోతున్నాయి. ట్విట‌ర్ కొనుగోలు త‌ర్వాత చాలామంది ఉద్యోగుల‌పై మ‌స్క్ వేటు వేశాడు. బ్లూటిక్ పెయిడ్ వీడియో వంటి కొత్త ఫీచ‌ర్లతో ఆదాయం పెంచుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఎలాన్‌మ‌స్క్ బాస్ అయిన‌ప్ప‌టినుంచీ ట్విట‌ర్‌లో ప్ర‌తీ ఉద్యోగి అభ‌ద్ర‌తాభావంతో ఉన్నాడు. రోజుకు 12 గంట‌లు ప‌నిచేయాల‌న్న ఒత్తిడితో నువ్వొద్దు నీ ఉద్యోగం వ‌ద్దు అంటున్నారు ఉద్యోగులు. మ‌స్క్ డెడ్‌లైన్‌తో వంద‌ల‌మంది ఉద్యోగులు ట్విట‌ర్‌కి గుడ్‌బై చెబుతున్నారు. ఓవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే మ‌స్క్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. కానీ మెంట‌ల్ మ‌స్క్‌ని భ‌రించ‌లేమ‌ని మెజారిటీ ఉద్యోగులు భావిస్తుండ‌టంతో ట్విట‌ర్ మ‌రింత సంక్షోభంలో కూరుకుపోయేలా ఉంది