అక్కడ కలుపు మొక్కలను ఏరివేయడమెలా… ?

By KTV Telugu On 11 October, 2022
image

ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోయిందా ? పోలీసు శాఖలో నేర ప్రవృత్తి రాజ్యమేలుతోందా ? అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్నారా ? నాగేశ్వరరావు తొలగింపు దేనికి సంకేతం ? ప్రభుత్వ కొలువు వస్తే మోనార్కులై పోతారా ? ఇంతటి అరాచకానికి కారణం వాళ్లేనా… జనంలో కూడా తప్పులున్నాయా….?

హైదరాబాద్ పోలీసు కమిషనర్ కఠిన నిర్ణయం
మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు సర్వీసు నుంచి తొలగింపు
విచారణ అవసరం లేదన్న కమిషనర్ కార్యాలయం
మాజీ నిందితుడి భార్యపై అత్యాచారంలో పోయిన కొలువు

వివాహితపై అత్యాచారం, కిడ్నాప్‌, బెదిరింపు కేసులో అరెస్టయి, బెయిల్ పొందిన మారేడ్‌పల్లి సీఐ కోరట్ల నాగేశ్వరరావుకు పోలీసు శాఖ గట్టి షాకిచ్చింది. నాగేశ్వరరావును పోలీస్‌ శాఖ సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.నాగేశ్వరరావుపై వచ్చిన అభియోగాలపై శాఖాపరమైన విచారణ నిర్వహించడం సాధ్యం కాదని కూడా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెల్చేశారు. ఒక నిందితుడి భార్యపై అత్యాచారం చేయడమే కాకుండా.. వారిని బంధించి తీసుకెళ్లే క్రమంలో నాగేశ్వరరావు బుక్కయిపోయాడు. గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు ఉండటంతో సర్వీసు నుంచి తొలగించారు…

పోలీసులపై వరుస ఆరోపణలు
55 మంది పోలీసులపై చర్యలు
లాలా గూడ మాజీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి డిస్మిస్
పోలీసులు, ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి
2021లో 83 అవినీతి కేసులు
ప్రతీ నాలుగు రోజులకు ఒక అక్రమార్కుడి అరెస్టు

 

గతేడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 55 మందిపై పోలీసు శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, అక్రమ సంబంధాలు, భార్యలను వేధించడం, హత్యలు, హత్యాయత్నాలు, డ్రగ్స్‌ ముఠాలతో సంబంధాలు, రోడ్డు ప్రమాదాలతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అందులో 17 మంది ఆఫీసర్ స్థాయి పోలీసు ఉద్యోగులున్నారు. మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన లాలాగూడ మాజీ ఇన్‌స్పెక్టర్‌ కే శ్రీనివాస్‌రెడ్డిని కూడా సర్వీసెస్‌ నుంచి తొలగించారు. వరకట్న వేధింపుల కేసులో ఆర్మడ్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్ ను డిస్మిస్ చేశారు. నేరప్రవృత్తి, అవినీతి ఇప్పుడు ప్రభుత్వోద్యోోగానికి అర్హతలుగా మారిపోయాయి. 2021 తెలంగాణ ఏసీబీ మొత్తం 83 మందిపై కేసులు పెట్టింది. అందులో 74 వరకు ఏసీబీ వలపన్ని పట్టుకున్న కేసులున్నాయ్.. ఈ ఏడాది సెప్టెంబరు 29న వికాబాదాబ్ జిల్లాలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్. మధును అవినీతి కేసులో అరెస్టు చేయడం ఒక ఉదాహరణ మాత్రమే.. గత మూడు సంవత్సరాలుగా 700 కు పైగా కేసులు పెండింగ్ లోఉన్నాయి…

అరెస్టయిన కొద్ది రోజులకే బెయిల్
నిందానంగా జరిగే విచారణలో నిందితుడికే అడ్వాంటేజ్
అనేక సందర్భాల్లో కోర్టులకు రాని సాక్షులు
ఉద్యోగికి అనుకూలంగా ఉంటే సర్వీసు నిబంధనలు
కేసులను కొట్టివేస్తున్న కోర్టులు

అవినీతి, క్రిమినల్ కేసులు ఎక్కువ కాలం నిలవడం లేదు. అరెస్టయిన కొద్ది రోజులకే నిందితుడిని బెయిల్ రావడంతో సాక్షులను ప్రభావితం చేయడం సులభమవుతోంది. దానితో సాక్షులు కోర్టుకు హాజరు కాకుండా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. భారత కోర్టుల్లో నిదానంగా జరిగే విచారణతో నిందితులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది. ఫిర్యాదు చేసినప్పుడు ఉన్నంత ఉత్సాహం… సంవత్సరాల తరబడి కేసు కొనసాగింపులో ఉండటం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చాలా జాగ్రత్తగా పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ వ్యక్తికి శిక్ష పడేలా చూడడం మరో ఎత్తు.నిబంధనల ప్రకారం ట్రాప్‌ కేసులో పట్టుబడ్డ వారిపై మూడు నెలల వ్యవధిలోనూ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆరు నెలల్లో ఏసీబీ నివేదికపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో నెలల తరబడి విచారణ సాగుతూనే ఉంటుంది.ఈ లోపు సర్వీసు నిబంధనల వంకతో ….ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. చివరకు కేసు మాఫీ చేసుకుంటున్నారు..

రాజకీయ జోక్యంతో బయట పడుతున్న నిందితులు
ఫిర్యాదు చేసి తర్వాత పట్టించుకోని జనం
చేతులు తడిపి పనులు చేయించుకునే తత్వం
స్వయం ప్రతిపత్తి లేని దర్యాప్తు సంస్థలు

అవినీతి కేసులు, క్రిమినల్ నేరాల నుంచి బయట పడేందుకు రాజకీయ నాయకులు సాయం పొందడం పరిపాటి అవుతోంది. ఫలానా నాయకుడు చెప్పాడని కేసును నిదానించడం లేదా నిర్వీర్యం చేయడం సాధారణ విషయమైపోయింది. ఫిర్యాదు చేసి నిందితుడిని పట్టిచ్చే బాధితులు.. తర్వాతి కాలంలో ఈ కేసుపై ఆసక్తిని వదులుకోవడంతో దర్యాప్తు సంస్థలకు కూడా పట్టు తగ్గిపోతోంది. ఫిర్యాదుదారుడే పట్టించుకోనప్పుడు వాళ్లు మాత్రం ఏమీ చేయలేరు కదా… అధికారులకు మరోసారి లంచం ఇచ్చి తప్పించుకునే కేసులు కోకొల్లుగా ఉంటున్నాయి. ఇక ఎన్నికల సంఘం తరహాలో ఏసీబీకి కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చినప్పుడే ప్రభుత్వోద్యోగులను దారికి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏసీబీ నియామకాల తీరుపై కూడా అనుమానాలున్నాయి. అవినీతి పరుడు కాదని నమ్మకం కలిగిన అధికారులనే ఏసీబీలో నియమించాలి. కాకపోతే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చెబుతున్నారు….

లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందుతున్న జనం
వంద రెట్లు సంపాదించాలన్న తపన
ప్రభుత్వోద్యోగమంటే గడీల పాలన అన్న అభిప్రాయం
జనమే లంచాలు అలవాటు చేస్తున్న వైనం
సీఐ నాగేశ్వరరావు కేసు ఏమమవుతుందో ?
జనం ఆలోచన మారాలి కదా….

ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి, నేరాలు పెరిగిపోవడానికి మన వ్యవస్థలో లోపాలతో పాటు, ప్రజల ఆలోచనా విధానం కూడా కారణం అవుతోంది. లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందే వారే ఎక్కువగా ఉండటంతో డ్యూటీలో చేరిన మొదటి రోజు నుంచే చేతులు జాపడం మొదలు పెడతారు. చేతినిండా డబ్బు వచ్చిన తర్వాత నేరప్రవృత్తి కూడా అలవాటవుతోంది అకస్మాత్తుగా వచ్చిన సంపదను చూసుకుని.. సమాజంలో తనకు తిరుగులేదన్న విశ్వాసం పెరుగుతుంది. పైగా ప్రభుత్వోద్యోగమంటేనే తిరుగులేని అధికారం వచ్చినట్లుగా భావించడం మొదలైంది. ఇందులో జనం తప్పుకూడా ఉందనుకోండి. వెంటబడి డబ్బులిచ్చి, బతిమలాడి, భంగపడి పనులు చేయించుకోవడంతో …..తమ గొప్పదనాన్ని గుర్తించి జనం సలాం కొడుతున్నారన్న ఫీలింగ్ ఉద్యోగుల్లో పెరిగిపోయింది. తప్పు చేస్తూ చిక్కినా కోర్టులో చూసుకోవచ్చులే అన్న నమ్మకం పెరిగింది. ఇప్పుడు సీఐ నాగేశ్వరరావు కేసు కూడా అలాంటిదే కావచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. డిస్మిస్ అయినప్పటికే కోర్టులో స్టే తెచ్చుకుంటే సంవత్సరాల తరబడి అతను హ్యాపీగా ఉండొచ్చు. అందుకే నేరాలు, అవినీతి పోవాలంటే చట్టాలు కఠినంగా ఉండాలి. జనం ఆలోచన కూడా మారాలి. ప్రభుత్వోద్యోగులను మోనార్కులుగా చూడటం మానేసి.. వారిని మన సేవకులుగా పరిగణించాలి… అలా ఎప్పుడు జరుగుతుందో చూడాలి