బీజీపీ లో ఈటల పరిస్థితి ఎలా ఉంది?

By KTV Telugu On 23 September, 2022
image

రాజకీయాల్లో ఈటల సక్సెసా… ఫెయిల్యూరా.. ఆయన బీజేపీలో ఎందుకు చేరారు ? కమలం పార్టీలో ఆయన దూసుకుపోతున్నారా.. డీలా పడ్డారా… ఆయన లక్ష్యమేంటి.. ఆ దిశగా అడుగులు వేసేందుకు ఆయన చేయాల్సిందేమిటి ?
ఈటల రాజేందర్ అత్యున్నత పదవిని ఆశిస్తున్నారా ? బీజేపీలో ఆయన స్టేటస్ ఏమిటి ?
హుజురాబాద్ విజయం ఒక్కటే సక్సెస్..
రాజేందర్ ఆకాంక్షలకు.. టీఆర్ఎస్ లో మనుగడుకు పొంతన కుదరలేదు. గులాజీ పార్టీలో నెంబరు టూ కావాలనుకుంటే.. కేసీఆర్ కుటుంబం అందుకు ఒప్పుకోదని రాజేందర్ కు అర్థమైంది. అందుకే గిల్లికజ్జాలను పెద్దవి చేసుకుని… ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. బీజేపీలో చేరి మళ్లీ హుజురాబాద్ లో గెలిచారు. ఛాలెంజ్ చేసి టీఆర్ఎస్ పై గెలిచానన్న సంతృప్తి మినహా ఈటల సాధించిందేమీ లేదు. మెజార్టీ కూడా సగానికి తగ్గిపోయింది. తర్వాత భూజం మీద చేతులు వేయడం తప్ప.. బీజేపీ ఆయనకు ఒనగూర్చిందేమీ లేదు.
అమిత్ షా అప్పగించిన పనిలో ఫెయిల్యూర్..
రాజేందర్ గెలిస్తే తెలంగాణ రాజకీయం మొత్తం తమ వైపే ఉంటుందని బీజేపీ భావించింది. ఇతర పార్టీల నుంచి భారీగా తమ వైపుకు వలసలు ఉంటాయని ఎదురుచూసింది. ఎన్ని రోజులైనా ఆ పని జరగలేదు. నేతలను తీసుకొచ్చే బాధ్యత అమిత్ షా…. ఈటలకు అప్పగించారు. ఈటల తన పరపతిలోనూ, వాక్చాతుర్యంతో జనాన్ని పట్టుకొచ్చేస్తారనుకున్నారు. గ్రౌండ్ రియాల్టీ మాత్రం అందుకు భిన్నంగా తయారైంది . ఈటల ఒక పెద్ద నాయకుడిని కూడా తీసుకురాలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా వచ్చి చేరారని మరిచిపోకూడదు.
సంజయ్ దూకుడును తట్టుకోలేని ఈటల..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీరు చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. రోజుకో ప్రకటన చేస్తూ, నిత్యం సీఎం కేసీఆర్ ను తిడుతూ మీడియా స్పేస్ మొత్తం ఆయనే ఆక్రమిచేస్తున్నారు. యాత్రలు చేస్తూ సామాన్య జనంలో ఉంటున్నారు. పైగా బండి మొదటి నుంచి ఉన్న నాయకుడు. రాజేందర్ వలస వచ్చిన నేత. రాజేందర్ ఒక స్టేచర్ ఉన్న నాయకుడైనప్పటికీ సంజయ్ ఆయన్ను పార్టీలో ఎదగనివ్వడం లేదు.
బీజేపీలో సొంత గ్రూపులేని రాజేందర్..
సీఎం కావాలన్న కోరిక ఉంటే చాలా. కార్యాచరణ అవసరం లేదా..పవర్ ఫుల్ డైలాగ్స్ వదిలితే సరిపోతుందా… నిజానికి ఈటల మంచి స్పీకరే. ఆయన మాట్లాడితే జనం నిలబడి వింటారు. అయినా ఏమి ప్రయోజనం ..బీజేపీలో చేరి ఏడాది దాటినా, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సీనియర్ నాయకుడైనా.. బీసీ నేతగా పేరు సంపాదించినా.. తనకంటూ ఒక గ్రూపును ఏర్పాటు చేసుకోలేకపోయారు. సంజయ్ నీడనే ఉండి పోయే పరిస్థితి తెచ్చుకున్నారు.
కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రేలాపన
ఈటల తప్పటడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఆయనలో ఫ్రస్టేషన్ తెలుస్తోంది. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. పైగా దమ్ముంటే హుజురాబాద్ వచ్చి పోటీ చేయాలంటూ కేసీయార్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చర్యలను బీజేపీ అధిష్టానం ప్రోత్సహిస్తుందని కూడా చెప్పలేం.
మారాల్సిన తరుణం..
ఈటల రాజేందర్ ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. తొలుత బీజేపీలో బండి సంజయ్ తో సమానమైన నాయకుడిగా ఎదగాలి. అందు కోసం అందరితోనూ కలిసిపోతూ.. కలుపుకుపోతూ ముందుకు సాగాలి. అప్పుడే తనకంటూ ఒక కేడర్ డెవలప్ అవుతుంది.
ప్రగతి భవన్లోసెటిలవ్వాలన్న కోరిక ఈటలకు ఉండొచ్చు. ఆ దిశగా అడుగులు వేయాలంటే సంయమనం అవసరం, రాజకీయ చతురత అనివార్యం. తప్పులు చేయడం మానుకోవాలి. మరి రాజేందర్ కు ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయో.