స్వతంత్ర భారతంలో ‘వెనుకబాటు’ ఎన్నేళ్లు?
అణగారిన వర్గాలు, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు చేయూతనివ్వాల్సిందే. అందరితో సమానంగా ఎదిగేందుకు ప్రత్యేక సాయం చేయాల్సిందే. కానీ ఆ సాయం, సదుపాయం రాజకీయం అయితేనే కష్టం. రాజ్యాంగాన్ని రచించినప్పుడు తెరపైకి వచ్చిన రిజర్వేషన్లు దశాబ్దాలుగా కొత్త మార్పులు సంతరించుకుంటున్నాయి. కొన్నిచోట్ల వివాదాలకు తెరలేపుతున్నాయి. రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రభుత్వాలకు ఈ రిజర్వేషన్లు రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. ఈడబ్ల్యుఎస్‌లకు 10శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని అత్యున్నతన్యాయస్థానం సమర్థించింది. ఈ ప్రక్రియలో రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించలేదని తేల్చిచెప్పింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఈడబ్ల్యుఎస్‌లకు రిజర్వేషన్ కోటా ఒకటి. సుప్రీం సమర్ధించటంతో కేంద్ర నిర్ణయానికి పూర్తిమద్దతు లభించినట్లయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై 3:2తో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు రిజర్వేషన్లకు మద్దతు పలికితే, సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం వ్యతిరేకించారు.
ఈడబ్ల్యూఎస్‌లకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ సరైనదేనని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడటంతో మెజారిటీ మద్దతు లభించింది. కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 50శాతం పరిమితిని దాటాయి. తమ నిర్ణయాలకు చట్టపరమైన ఆమోదం కోసం కొన్ని ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య కూడా తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. సుప్రీం న్యాయమూర్తి కూడా రిజర్వేషన్ల కోటా 50శాతం దాటటాన్ని ఆక్షేపించారు. సుప్రీం చీఫ్ జస్టిస్ కూడా దీంతో ఏకీభవించారు. బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల నిర్ణయం 15మంది సభ్యుల బెంచ్ ఆమోదం పొందాల్సిందేనంటున్నారు. 2019 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీని రాజ్యాంగపరమైన చెల్లుబాటు గురించి సుప్రీంకోర్టులో 40దాకా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీంలో సుదీర్ఘ విచారణ జరిగింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. చివరికి ఈడబ్ల్యూఎస్ కోటాకు ఆమోదముద్రవేసినా దేశంలో రిజర్వేషన్ల రగడకు మాత్రం తెరపడేలా లేదు.