కొత్త కార్యవర్గంపై కసరత్తులు

By KTV Telugu On 14 August, 2023
image

KTV Telugu ;-

కొత్త నీరు వచ్చి పాత నీటిని తన్నేస్తుందని సామెత. ఏపీ బిజెపిలో ఇపుడు ఇదే జరగబోతోంది. పార్టీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలో సమూలంగా ప్రక్షాళన జరుగుతుందని ప్రచారం జరిగింది. కీలక పదవులన్నింటా మార్పులు చేర్పులు ఉంటాయని వినిపించింది. అయితే అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో పార్టీలో కీలక నేతలు తమ పదవులు ఉంటాయా ఊడతాయా అన్నది అర్ధం కాక డైలమాలో ఉన్నారు. తన వర్గం అంటూ ఒకటి బలంగా ఉంటేనే తన విధానాలను బలంగా అమలు చేయగలనన్నది పురంధేశ్వరి ఆలోచనగా చెబుతున్నారు.

కొత్త బాస్ రావడంతోనే కార్యవర్గంలోనూ మార్పులు జరగడం మామూలు విషయం. ఏ పార్టీలో అయినా ఏ కొత్త అధ్యక్షుడు వచ్చినా రాజకీయాల్లో ఇది అత్యంత సహజం. పురంధేశ్వరికి ముందు అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఇద్దరూ కూడా భిన్న ధృవాలు. ఇద్దరి ఆలోచనలు..అజెండాలూ కూడా వేర్వేరు. కన్నా కాంగ్రెస్ నుండి బిజెపిలోకి వెళ్లి అక్కడి నుండి జనసేనకు వెళ్దామనుకుని టిడిపిలో బేరసారాలాడి అక్కడ చేరిన నేత. సోము వీర్రాజు మాత్రం రాజకీయ కెరీర్ ఆరంభం నుంచి బిజెపిలోనే ఉన్నారు. బిజెపి సిద్దాంతాలపైనా పద్ధతులపైనా పూర్తి అవగాహన ఉన్న నేత సోము వీర్రాజు. ఈ ఇద్దరి హయాంలో కొందరు నేతలకు ప్రాధాన్యత ఉండింది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పురంధేశ్వరి సమావేశమై పక్షం రోజులు దాటింది. ఆ భేటీలోనే కొత్త కార్యవర్గం గురించి నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంత వరకు కొత్త జాబితా ఊసే లేదు. జాబితా ఎప్పుడు వస్తుందో తెలియక…ఎవరి పదవులు ఊడతాయో ఊహకందక నాయకుల్లో ఉత్కంఠ కొనసాగుతోందంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి కొత్త కార్యవర్గాన్ని నియమించడం లేదు ఎందుకని? పురంధేశ్వరి ఆలోచనలో ఏం ఉందన్నది అర్ధం కాక నేతలు అయోమయంలో ఉన్నారు.

ఎన్నికల టీమ్ సిద్దం చేసుకోవడానికి అనుమతి ‌ఇవ్వాలని బాధ్యతలు స్వీకరించడానికి ముందే జాతీయ నేతలను ఆమె కోరారు. రాష్ట్రంలోని నాలుగు జోన్ల సమావేశాలలో కూడా రాష్ట్ర కార్యవర్గంతోపాటు అనుబంధ విభాగాల మార్పులపైనా కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడు నడ్డా ముందు కొత్త జాబితా పెట్టిన పురంధేశ్వరి అనుమతి పొందినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్నందున పార్టీని సమూలంగా మార్చడానికి అనుమతి తీసుకున్నారట. అయితే ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెండు వారాలు దాటినా ఇప్పటికీ ఏపీ బీజేపీ కొత్త కార్యవర్గం ప్రకటన ఊసేలేదు.

ఈ నెల రెండవ తేదీన కొత్త కార్యవర్గ జాబితా విడుదల చేస్తారని మొదట మీడియాకి లీకులిచ్చారు. కానీ వారం దాటుతున్నా జాబితా బయటకు రాలేదు. కొత్త జాబితాలోని పేర్లు లీక్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారట. రాష్ట్ర కార్యవర్గంలో ఉండి సరిగ్గా పనిచేయని వారిపై వేటు వేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పురంధేశ్వరి ఎవరి పదవులకి ఎసరు పెడతారో తెలియని అయోమయ పరిస్ధితి బిజెపిలో కొనసాగుతోందట. రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో పది మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, పది మంది కార్యదర్సులు, ఒక కోశాధికారి, ఒక కార్యాలయ కార్యదర్శికి అవకాశం‌ ఉంది. ఇవి కాకుండా 90 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. ప్రధాన కార్యదర్శులలో కొందరికి అధికార ప్రతినిధులుగా, ఉపాధ్యక్షులుగా పదోన్నతి ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది.

పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఈ నెల 10న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సర్పంచ్ లకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకి పిలుపునిచ్చారు. ఇటువంటి సమయంలో కొత్త జాబితా ప్రకటిస్తే అసమ్మతి బయటపడి తాను పిలుపునిచ్చిన మొదటి ఆందోళనా కార్యక్రమంపై ప్రభావం పడుతుందనే భయంతోనే కొత్త కార్యవర్గాన్ని వాయిదా వేశారని తెలుస్తోంది. అందుకే పదవ తేదీ ఆందోళనా కార్యక్రమాల తర్వాతే కొత్త జాబితా ఉంటుందని టాక్ నడుస్తోంది. లేదంటే 17వ తేదీన జరిగే ఇంకో ఆందోళనా కార్యక్రమం తర్వాతే కొత్త కార్యవర్గం ప్రకటించవచ్చని తెలుస్తోంది. పార్టీలో పరువు పోకుండా పురంధేశ్వరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి