ఫిఫా వరల్డ్ కప్ చాలా కాస్ట్ లీ గురూ
మూడు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిన ఖతార్
ఖతార్ వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. కోట్లాది మంది మ్యాచులను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 12ఏళ్ల క్రితం ఫిఫా వాల్డ్ కప్ నిర్వహణ కోసం బిడ్ గెలుచుకుంది ఖతారు. ఈ పన్నెండేళ్లలోనూ ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఖతార్ ప్రభుత్వం డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసింది. ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ కోసం కొత్త స్టేడియాల నిర్మాణం, వివిధ దేశాల నుండి తరలి వచ్చే ఆటగాళ్లు, క్రీడాభిమానులకోసం కొత్త కొత్త హోటళ్లు నిర్మించారు. మధ్య ప్రాచ్య దేశాల్లో మొట్ట మొదటి సారి ఫిఫా వాల్డ్ కప్ నిర్వహించే అవకాశం రావడంతో ప్రపంచ దేశాలకు దీటుగా టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని ఖతార్ ప్రభుత్వం భావించింది.ఈ టోర్నీ నిర్వహణ ద్వారా నిర్వాహకులకు 5.6 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుందన్నది అంచనా. 2018 లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ ద్వారా 3.6 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. టోర్నీకి రెండు నెలల ముందే అక్టోబరు లోనే 30 లక్షలకుపైగా టికెట్లను విక్రయించేశారు. మొత్తం మ్యాచులను 8 స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు.
ఇందులో ఒక్కటే పాత స్టేడియం కాగా దాన్ని ఈ మెగా టోర్నీ కోసం భారీగా ఆధునికీకరించారు. మరో 7 కొత్త స్టేడియాలను కళ్లు చెదిరేలా నిర్మించారు. వీటి నిర్మాణాల కోసమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. క్రీడాభిమానులను దృష్టిలో పెట్టుకుని ఒక లక్షా ముప్ఫై వేల హోటల్ రూమ్స్ ను సిద్దం చేయాలని అనుకున్నారు. ఇందుకోసం వందలాదిగా అపార్ట్ మెంట్లు నిర్మించారు. అయితే వాటిలో చాలా వరకు పూర్తి కాలేదు. దాంతో వేరే టెంపరరీ క్యాంప్స్ ను ఏర్పాటు చేశారు. వచ్చే వాళ్లకి ఒక్క దోహాలోనే ఏర్పాట్లు సరిపోవు కాబట్టి చుట్టు పక్కల నగరాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా 100 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. ఒకే రోజు వివిధ మ్యాచ్ లు వీక్షించాలంటే దూర దూరాన ఉన్న స్టేడియాలకు తరలి పోవాలి. ఇందుకోసం ప్రత్యేక మెట్రో రైల్ సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రజారవాణా సంస్థను బలోపేతం చేశారు. సరికొత్త మెట్రో వ్యవస్థ, అధునాతన షిప్పింగ్ పోర్ట్ టోర్నీ కోసమే విస్తరించిన మెయిన్ ఎయిర్ పోర్ట్, పక్కా ప్రణాళికతో దోహాకు ఉత్తరాన నిర్మించిన వ్యూహాత్మక నగరంతో దేశ రూపు రేఖలే మారిపోయాయి.
రెండు లక్షల మంది బస చేసేందుకు వీలుగా ఎడారి ప్రాంతంలో 45 బిలియన్ డాలర్ల వ్యయంతో లగ్జరీ వసతులు నిర్మించారు. అంటే 370 కోట్ల 50లక్షల 60వేల రూపాయలు ఖర్చు చేశారు. వేలాది కిలోమీటర్ల పొడవునా కొత్త రోడ్లు వేశారు.కళ్లు చెదిరే హైవేలను నిర్మించారు. మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మకమైన ప్రగతి కనిపిస్తోందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. ఇది ఖతార్ రూపు రేఖలను పూర్తిగా మార్చేస్తుందని వారంటున్నారు. ఆర్చి పెలాగో, లూసాయిల్ స్టేడియాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లూసాయిల్ లో నే డిసెంబరు 18న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లక్షల కోట్లు పెట్టి నిర్మించిన కొత్త స్టేడియాలు ఈ టోర్నీ తర్వాత ఏం చేసుకోవాలో ప్రభుత్వానికి తెలీదు. కాకపోతే ప్రపంచంలో ఖతారు ఖ్యాతి వెలిగిపోవాలన్న లక్ష్యంతోనే ఇంత పెద్ద టోర్నీని భుజాలకెత్తుకుంది ఖతార్. టోర్నీ నిర్వహణకే కాదు ఇందులో ఆడిన జట్లకు ఇచ్చే పారితోషికం కూడా మామలూలుగా లేదు. ఈ సారి వరల్డ్ కప్ ను గెలుచుకున్న జట్టుకు ఇవ్వబోయే పారితోషికం ఎంతో తెలుసా? మన భారత కరెన్సీలో చెప్పాల్సి వస్తే అక్షరాలా 344 కోట్ల రూపాయలు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 245 కోట్ల రూపాయలు ఇస్తారు. మూడో స్థానంలో నిలిచే జట్టుకు 220 కోట్లు, నాలుగో స్థానంలో ఉండే జట్టుకు 204 కోట్లు ఇస్తారు.
5 నుంచి 8వ స్థానం వరకు నిలిచే జట్లకు ఒక్కో జట్టుకు 138 కోట్ల రూపాయలు, 9 నుంచి 16వ స్థానంలో నిలిచే జట్టుకు 106 కోట్ల రూపాయలు 17 నుండి 32 వ స్థానం వరకు ఉండే జట్లకు ఒక్కో జట్టుకూ 74 కోట్ల రూపాయలు ఇస్తారు. 1982 వరల్డ్ కప్ లో విజేతకు 17.97 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. అది 40 ఏళ్లలో ఎన్నో రెట్లు పెరిగి 344 కోట్ల రూపాయలు అయ్యింది. లక్షల కోట్ల రూపాయలను విచ్చల విడిగా ఖర్చుచేసిన ఖతార్ కు ఏంటి లాభం? అంతర్జాతీయంగా తిరుగులేని ప్రతిష్ట పెరుగుతుంది. ఉన్న స్టేడియాల్లో భవిష్యత్ లో వేరే మెగా టోర్నీలు నిర్వహించే అవకాశమూ ఉంటుంది. దేశీయంగా ఈ పన్నెండేళ్లలో స్టేడియాలు, హోటళ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం చిన్నా చితకా వ్యాపార సంస్థలు రక రకాల సరుకులను అందించేందుకు కాంట్రాక్టులు పొంది ఆర్దికంగా లబ్ధి పొందాయి. దాంతో పన్నుల ఆదాయమూ పెరిగింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చిందని మేథావులు అంటున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశాల్లో ఒక్క బ్రెజిల్ తప్ప మిగతా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లూ ఆ తర్వాత పరుగులు పెట్టాయి. ఆదాయ సూచికలూ ఆశాజనకంగా పెరిగాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 21.8 శాతం మేరకు ఆదాయాలు పెరిగాయి. అంతర్జాతీయంగా మంచి పేరు రావడంతో పాటు మౌలిక సదుపాయాలు పెరిగిన ఖతార్ కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. 2019లో ఖతార్ కు ఏటా 21లక్షల మంది పర్యాటకులు వచ్చేవారు. ఇపుడీ ఫిఫా నిర్వహణ తో 2030 నాటికి వార్షిక పర్యాటకుల సంఖ్య 60 లక్షలకు పెరుగుతుందని అంటున్నారు.