విమాన ప్రయాణికులకు ఇకపై బాదుడే బాదుడు ఖాయమా. క్రమం తప్పకుండా రేట్లు పెంచేందుకు అనుమతివ్వాలని ఎయిర్ లైన్స్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయా. ఉడాన్ స్కీము సరైన ఫలితాలివ్వలేని స్థితిలో ప్రభుత్వం చేయాల్సిందేమిటి. విమానయాన రంగంలో వాస్తవ పరిస్థితులేమిటి. ఓ సారి చూద్దాం…
విమానయాన సంస్థలు ప్రయాణికులను వీరబాదుడు బాదుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. విమానయాన సంస్థలు 10 నుంచి 15 శాతం పెంచామని చెబుతున్నాయి. వాస్తవ స్థితిగతులను చూస్తే మాత్రం కొన్ని రూట్లలో యాభై శాతం వరకు పెరిగాయి.. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన ఒక ప్రయాణికుడు పక్షం రోజుల ముందు టికెట్ తీసుకుంటే 8 వేల 576 రూపాయలవుతోంది. జనవరిలో అది 5 వేల 675 రూపాయలుంది. అంటే టికెట్ ధర 51 శాతం పెరిగినట్లయ్యింది. అలాగే ముంబై నుంచి వారణాసి వెళ్తున్న ప్రయాణికులు పక్షం రోజుల తర్వాత ప్రయాణానికి ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే దాని ధర 8 వేల 565 రూపాయలుంది. అదే జనవరిలో బుక్ చేసుకుని అప్పుడు ప్రయాణించి ఉంటే 5 వేల 810 రూపాయలకే వచ్చేది. అంటే టికెట్ రేటు 47 శాతం పెరిగిందన్నమాట.
దేశంలో డొమెస్టిక్, చార్టర్డ్ సహా నాలుగు రంగాలకు కలిపి 39 విమానయాన సంస్థలున్నాయి. సంపూర్ణ పోటీ మార్కెట్లోనూ ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. అందులో విమాన ఇందనం.. అంటే ఏటీఎఫ్ ధరల పెరుగుదల ఆయా సంస్థలకు తలనొప్పిగా మారింది. విమానయాన సంస్థల నిర్వహణా వ్యయంలో 40 నుంచి 45 శాతం వరకు ఇంధన ఖాతాకే పోతోంది. రూపాయి విలువ తగ్గిపోవడం కూడా విమానయాన సంస్థలకు ఇబ్బందిగా మారుతోంది. ఇంధన కొనుగోలుకు ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తోంది. దేశంలో 50 శాతం సర్వీసులు నడిపే ఇండిగో సంస్థ బుద్ధి పూర్వకంగా రేట్లు తగ్గించి ఉంచడంతో ఇతర విమానయాన సంస్థలకు బుకింగ్స్ తగ్గిపోయి తీవ్ర నష్టాలపాలవుతున్నాయి. అందుకే అందరమూ కలిసి రేట్లు పెంచుతామని బేరం పెడుతున్నాయి. పైగా విమానయాన సంస్థలో ఉద్యోగావకాశాలు పెరగడంతో పైలట్లు, సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇతర నిర్వహణా ఖర్చులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయని యజమానులు గగ్గోలు పెడుతున్నారు…
ఒక పక్క విమానయాన సంస్థలు భారీగా ధరలు పెంచేస్తున్న తరుణంలో ఉడాన్ స్కీమ్ మనుగడ కూడా చర్చనీయాంశమైంది. 2017లో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ ను 19 నగరాల్లో ప్రవేశపెట్టింది. తర్వాత దాన్ని 70 నగరాలకు విస్తరించింది. టీయర్ టూ, టీయర్ త్రీ గా పిలిచే చిన్న నగరాల్లో విమానయానాన్ని ప్రోత్సహించేందుకు ఉడాన్ స్కీమ్ ను ప్రవేశపెట్టగా.. ఏపీ , తెలంగాణ రాష్ట్రాలు కూడా అందులో చేరాయి. కడప విమానాశ్రయం అందులో ముఖ్యమైనదిగా చెప్పాలి. ఐదారు ఏయిర్ లైన్స్ అందులో భాగస్వాములు కాగా… విమానంలో ఉన్న సగం సీట్లు ఉడాన్ స్కీము కింద విక్రయించాలి. 500 కిలోమీటర్ల లోపు దూరాన్ని ఉడాన్ స్కీమ్ కిందకు తీసుకురాగా.. విమానంలోని యాభై శాతం టికెట్లను 2 వేల 500 రూపాయల కంటే తక్కువ రేటుకు విక్రయించాల్సి ఉంటుంది. 70 నుంచి 80 సీటర్ విమానాలు వెళ్తున్న ఈ మార్గాల్లో తక్కువ రేటుకు టికెట్లు విక్రయించడం వల్ల భారీగా నష్టపోతున్నామని విమనయాన సంస్థలు చాలా రోజులు వాపోయాయి.
సామాన్యుడికి సైతం విమానయాన సౌకర్యాన్ని కల్పించిన ఉడాన్ స్కీమ్… రెండు సంవత్సరాల్లోనే తీవ్ర బాలారిష్టాలను ఎదుర్కొంది. సక్సెస్ రేటు 20 శాతం దాటలేకపోయింది. 14 విమానయాన సంస్థలు 440 రూట్లలో విమానాలు నడపాలనుకున్నా… 60 రూట్లకు మించి నడపలేకపోయారు. ట్రూ జెట్ లాంటి చిన్న సంస్థలు నిర్వహణా సమస్యలను ఎదుర్కోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. సాంకేతిక, ఆర్థికపరమైన సమస్యలతో ఈ స్కీమ్ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, రాష్ట్రాలు కల్పించిన వసతులు కూడా ఉడాన్ స్కీమ్ కింద విమానాలు నడిపేందుకు సరిపోలేదు.. చిన్న విమానాల కంటే ఏయిర్ బస్ ఏ 320 లాంటి వాటికే ఈ స్కీము ఉపయోగపడింది. చిన్న నగరాలకు వాటిని నడపటం కష్టమని విమానయాన సంస్థలు నిర్ణయానికి వచ్చాయి..
కొన్ని ఎయిర్ లైన్స్ పోటీ పడి ధరలు తగ్గిస్తున్నాయి. దానితో ఇప్పుడు ఇతర సంస్థల పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయలా తయారైంది. అందుకే అటువంటి ప్రతికూలపోటీకి అడ్డుకట్ట వేసి ధరలు పెంచుకునేందుకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి. విమాన ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తే పన్నులు స్థిరంగా ఉంటాయని వాదిస్తున్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ కనిపించకుండా చూస్తేనా వాళ్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే విమానాశ్రయాలను విస్తరించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ప్రయాణికుల రద్దీ బాగా తగ్గింది. 60 శాతం వరకు పడిపోయింది. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 37 శాతం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా టికెట్ రేట్లు పెంచకుండా మనుగడ సాధించడం కుదరదని విమానాయన సంస్థలు కుండబద్దలు కొడుతున్నాయి…