యాత్రా స్పెషల్స్ కు కరోనా బ్రేక్ !

By KTV Telugu On 22 December, 2022
image

కరోనా మళ్లీ విజృభిస్తోంది. చైనాను వణికిస్తున్న ఓమైక్రాన్ బీఎఫ్ -7 వేరియింట్ ఇండియాలోనూ ఎంట్రీ ఇచ్చింది. అది వేగంగా విస్తరిస్తున్న తరుణంలో జనం కొవిడ్ -19 నిబంధనలు పాటిస్తే మంచిదని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి చర్యలతో కరోనాకు దూరంగా ఉండే వీలుంటుందని చెబుతోంది. అయితే రాజకీయంగానూ బీఎఫ్ -7 భయం పట్టుకుందని చెప్పక తప్పదు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యాఖ్యలతో కరోనాకు రాజకీయ రంగు అద్దినట్లయ్యింది. కొవిడ్ విజృంభించే అవకాశం ఉన్నందున రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. యాత్రను కొనసాగించాలంటే తక్కువ మందితో సామాజిక దూరం పాటించాలని అందులో పాల్గొనే వారంతా టీకా బూస్టర్ డోస్ కూడా వేయించుకుని ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కేంద్రం అంటోంది ఈ నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం చెందింది. రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక యాత్రను ఆపాలని ప్రయత్నిస్తున్నట్లు హస్తం పార్టీ ఆరోపిస్తోంది. మోదీ గుజరాత్ ప్రచారానికి లేని ఆంక్షలు రాహుల్ యాత్రకు ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కాకపోతే కరోనా విస్తరణ వేగం పుంజుకుంటే మాత్రం రాహుల్ యాత్రను ఆపాల్సిన అనివార్యత ఏర్పడే ప్రమాదం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో యాత్రలపై కరోనా ప్రభావం ఉండొచ్చన్న చర్చ మొదలైంది. వచ్చే నెల ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా బస్సు యాత్ర చేపడతారు. ఇప్పటికే ఆయన వాహనం వారాహి సిద్దమై తుది మెరుగులు దిద్దుకుంటోంది. రెండు పార్టీలకు బాగా ప్రజాదరణ ఉన్నందున యాత్రలు ఎక్కడకి చేరుకున్నా భారీ సంఖ్యలో జనం రావడం ఖాయమవుతుంది. నేతలను చూసేందుకు జనం ఎగబడి గుంపులు పోగవుతాయి. అప్పుడు కొవిడ్ ప్రోటోకాల్ అన్న మాటకే అర్థం ఉండదు. ఒకవేళ ఆ లోపే కొవిడ్ విజృంభించి ఆంక్షలు అమలులోకి వస్తే మాత్రం యాత్రలను ప్రారంభించే అవకాశమే ఉండదు.

తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. షర్మిల పాదయాత్ర ఇంకా పూర్తి కాలేదు. కోర్టు కేసుల కారణంగా ఆగిన తుది దశ పాదయాత్రను వైఎస్సార్టీపీ నాయకురాలు ఎప్పుడైనా ప్రారంభించే వీలుంది. కేఎ పాల్, తీన్మార్ మల్లన్న యాత్రలు కొనసాగుతున్నాయి. టీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. జనవరి 26న ఇంద్రవెల్లిలో యాత్ర మొదలువుతుందని అనధికార సమాచారం. అంటే రేవంత్ యాత్రకు ఇంకా నెల రోజులు టైమ్ ఉంది. అప్పటికి కరోనా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఎంత ప్రయత్నించినా యాత్రలో వచ్చే నేతలకు చూసేందుకు తరలే జనాన్ని నియంత్రించడం అంత సులభం కాదు. అందుకే ఇప్పుడు అన్ని యాత్రల కొనసాగింపు ప్రశ్నార్థకమే అవుతుంది. అదే జరిగితే అధికార పార్టీలకు ప్రయోజనమన్న చర్చ కూడా జరుగుతోంది. విపక్ష నేతలు జనంలో లేకపోతే వారికి మైలేజ్ రావడం కష్టమంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.