దేశంలో రాజకీయ పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పోటీపడి వాగ్దానాలు ఇస్తుంటాయి. అందులో భాగంగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గుప్పించే ఉచిత హామీల కట్టడి కోసం అత్యున్నత కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు కలగకుండా…ప్రధాని మోడీ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉచిత పథకాలపై చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలూ ప్రమాదకరమంటూ ఇటీవల ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఉచిత పథకాలను ప్రకటించడంపై సుప్రీంకోర్టు కూడా ఆవేదన వ్యక్తంచేసింది. ప్రజలను మభ్యపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అర్ధం లేని ఉచితాలు దేశ ఆర్ధిక వ్యవస్ధను భ్రష్టు పట్టిస్తాయని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్చ జరిపి చట్టంతో ముందుకు వచ్చేలా ఉచిత హామీలపై నిర్ణయాన్ని పార్లమెంట్‌కు విడిచిపెట్టాలని సీయర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ రోజుల్లో అందరికీ ఉచితాలు కావాలని, అన్ని పార్టీలూ వీటి నుంచి లబ్ధి పొందుతున్నాయని చీఫ్ జస్టిస్ NV రమణ అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పంపిణీ హామీలివ్వడం తీవ్ర ఆర్థిక అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హామీల నియంత్రణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. ఇందులో నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం, లా కమిషన్, ఆర్‌బీఐతో పాటు పాలక, ప్రతిపక్షాలు సభ్యులుగా ఉండాలని సూచించింది. పార్టీల ఉచిత హామీలను ఏ విధంగా నియంత్రించాలో ఈ కమిటీ నిర్మాణాత్మక సూచనలు చేయనుంది.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నా…ఏదో రకమైన ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయ్. ఎన్నికలకు ముందు ఓటర్లకు భారీ వాగ్దానాలు చేయడం దశాబ్దాలుగా దేశ రాజకీయ నేతలు పాటిస్తున్న ఆచారం. నగదు నుంచి మద్యం, గృహోపకరణాలు, స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు, ఆహార ధాన్యాల వరకు చాలా అంశాలు వాగ్దానాల్లో భాగమవుతాయి. సంక్షేమ పథకాలతో భాగంగా అల్పదాయ వర్గాలకు మేలు చేయాల్సిందే. అయితే కేవలం ఓట్ల కోసం ప్రకటించే అనుచిత వాగ్దానాలతోనే అసలు సమస్య. ఈ రెండింటికీ మధ్య సన్నటి విభజన రేఖ అంత ఈజీ కాదు. దేశంలో ప్రజలందరి ఆదాయం ఒకే రకంగా లేదు. సంపద పంపిణీ కూడా క్రమపద్ధతిలో లేదు. అలాంటప్పుడు మొత్తానికి…మొత్తం పథకాలు వద్దంటే.. పేదవాడు ఎలా బతకాలనే ప్రశ్నలున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఉచితాలపై తాము చేసేదేం లేదన్న కేంద్రం.. ఇప్పుడు పిల్ ను సమర్థించడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికే ఈ వాదన తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఉచిత పథకాల వల్ల ప్రజలకు ఒరిగేది లేదని, ఇది ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు కూడా. ఉచితాలపై చర్చించాలని తాజాగా రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ నోటీసులిచ్చారు. ఈ అంశంపై అదే పార్టీకి చెందిన వరుణ్ గాంధీ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకిచ్చే ఉచితాల గురించి చర్చించే ముందు ఎంపీల పెన్షన్లు, వారికి కల్పించే సౌకర్యాల గురించి చర్చించాలని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
చాలా ప్రాంతీయ పార్టీల మనుగడకు ఉచిత పథకాలే ఆధారమని గుర్తుచేస్తున్నారు విశ్లేషకులు. ప్రజల పన్నులతో, జాతీయ వనరులతో, ఇతర రాబడులతో నిండే ప్రజాఖజానాను ప్రభుత్వాలు ఇష్టానుసారం ఖర్చు చేయడం తరచూ వివాదాస్పదమౌతోంది. ఈ పరిస్థితి లోగడ లేదు. ఏదున్నా బడ్జెట్లో ప్రతిపాదించడం, చట్టసభలో చర్చించి ఆమోదించడం, ఆ మేర వ్యయం చేయడం వల్ల దానికో పవిత్రత ఉండేది. స్వల్ప మార్పులుంటే సవరించిన అంచనాలు వ్యయాలతో మళ్లీ సభానుమతి పొందడం జరిగేది. ప్రస్తుతం ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఏవేవో ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఓటరు కరుణించి అధికారం కట్టబెడితే, రాబడివ్యయం సమీకరణంతో నిమిత్తం లేకుండా తెగించి ఉచితాలు, రాయితీలతో ప్రజా ఖజానా ఖాళీ చేయడానికీ వెనుకాడటం లేదు. దాంతో, ఆర్థిక పరిస్థితి అతలాకుతలమౌతోంది. ప్రజా ఖజానా అడ్డదిడ్డంగా ఖర్చు చేయడమేమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయ్.