ఉచిత పథకాలకు గుడ్ బై చెప్పే తరుణం వచ్చిందా.. సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చిందా…. ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా కుదేలు కాకముందే రాష్ట్రాలు మెల్కొంటాయా… అత్యున్నత న్యాయస్థానం అడిగిందేమిటి… తెలుగు రాష్ట్రాల పరిస్తితి ఏమిటి….
ఉచిత పథకాల పేరుతో ఓటర్లను ప్రలోభ పెడుతున్న రాజకీయ పార్టీలను కట్టడి చేయాల్సిన సమయం ఆసన్నమైందనే అనుకోవాలి. ఉచిత హామీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఇలాంటి చర్యలను ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోవడం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసం నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరి పాటిస్తోందని అత్యున్నత న్యాయ స్థానం తప్పుపట్టింది. పరిస్థితి మారాలని తన మాటగా చెప్పింది…
ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ప్రకటించి ఓట్లు పొందాలనుకునే పార్టీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని బీజేపీ నేత అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మరో కేసులో విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్‌ను ఈ విషయంలో సూచనలు అడిగింది. ‘‘మీరు సీనియర్ పార్లమెంటేరియన్ కదా! దీనిపై మీ అభిప్రాయమేమిటి?’’ అని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సిబల్ తేల్చేశారు. ఉచిత హామీలు రాష్ట్రాల నుంచి వస్తున్నాయని దానితో
అప్పులు, ఉచితాలకు పెడుతున్న ఖర్చును ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకోవాలని సిబల్ సూచించారు. కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని ఆశించలేమన్నారు. దీనితో స్పష్టత వచ్చినట్లు భావించిన ధర్మాసనం…. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆర్థిక సంఘాన్ని అడగాలంటూ అదనపు సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్ ను కోరింది. ఓటర్లకు ఉచిత హామీలు కూడా లంచం లాంటివేనని కోర్టు అభిప్రాయపడ్డారు.. అయినా ఇది ఎవరి పరిధిలోకి వచ్చే అంశమన్నది మాత్రం తేల్చాల్సి ఉంది…
ఇటీవల ఒక కార్యక్రమంలో ఉచిత పథకాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని పార్టీ ఎన్నికల హామీలను పండుగలకు ప్రకటించే రేవడి అనే స్వీట్ గా ప్రకటిస్తున్నాయని ఆయన అన్నారు. అధికార దాహంతో కొన్ని పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నందున దేశ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలవుతోందని మోదీ అన్నారు. ఉచిత పథకాలతో ఇప్పుడు రాష్ట్రాలపై తీప్ర భారం పడుతోంది. అప్పులు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏపీ అప్పులు 8 లక్షల కోట్లు కాగా… తెలంగాణ అప్పులు ఐదు లక్షల కోట్లకు చేరింది కొత్త అప్పుల కోసం కేంద్రానికి అర్జీలు పెట్టుకోవాల్సి వస్తోంది. కొన్ని రాష్ట్రాలు శ్రీలంకలా మారాయని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఉచితాలపై పునరాలోచించాల్సి వస్తోంది….
సంక్షేమం పేరుతో రాజకీయ పార్టీలు దేశాన్ని క్షామం దిశగా తీసుకెళ్తున్నాయి. రాజధాని రాష్ట్రం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉచిత విద్యుత్, పంపు నీళ్లు అందిస్తోంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో అనేక పార్టీలు హామీలిచ్చాయి. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి మహిళకు వెయ్యి ఇస్తామని హామీ ఇవ్వగా తాము 2 వేల చొప్పున ఇస్తామని శిరోమణి అకాళీదళ్ చెప్పింది. దీనికి పోటీగా కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు 2 వేలు, 8 గ్యాస్ సిలిండర్లు, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఒక స్కూటీ, ఇంటర్ పాసైతే 20 వేలు, పదో తరగతి పాసైతే 15 వేలు, 8వ తరగతి గట్టెక్కితే 10 వేలు, ఐదో తరగతి పాసైతే 5 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. డిసెంబరులో జరిగే గుజరాత్ ఎన్నికల్లో గెలిస్తే ప్రతీ ఇంటికి 300 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ అమలు జరిపిన రైతుల ఉచిత విద్యుత్ నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఫ్రీ స్కీములున్నాయి. జగన్ ప్రభుత్వం… బడి పిల్లలకు వేల రూపాయలు అందిస్తోేంది. పుట్టినప్పటి నుంచి పెళ్లి దాకా… ఆపై జీవనం సాగించేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలను అమలు చేస్తున్నాయి…
పూర్తిగా నష్టం జరిగిపోయిందని కూడా చెప్పలేం. ఇప్పటికైనా పార్టీలు పరిస్థితి చేసుకుని ఉచిత హామీలివ్వడం మానెయ్యాలి. జనాన్ని కూర్చోబెట్టి మేపే కంటే… వారికి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే చర్యలు చేపట్టాలి. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, స్వయం ఉపాధి వెదుక్కునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఈ దిశగా కొంత ధైర్యాన్ని ప్రదర్శించి దశలవారీగా ఉచిత పథకాలను ఉపసంహరించాలి. తొలినాళ్లలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదమున్నప్పటికీ తర్వాతి కాలంలో అది సమసిపోయే అవకాశాలున్నాయి. అప్పుడే సుప్రీం కోర్టు చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం ఉంటుంది…