గంటాకు గ్రీన్ సిగ్నల్

By KTV Telugu On 30 November, 2022
image

తోకజాడిస్తే కట్‌.. గంటాకు కండిషన్స్‌ అప్లై!

విజయసాయిరెడ్డికి ఇష్టంలేదు. ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్యులకు ఆయనంటే పడదు. అయినా ఆయన వస్తున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ చివరికి వైసీపీ అధినేత కూడా తలుపుతెరిచారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు డిసెంబరులో కండువా మార్చడం ఖాయం. ఆయనొస్తే అన్నిట్లో వేలెడతాడని వైసీపీ నేతలకు డౌట్‌ కొడుతున్నా, గంటాకు షరతులు వర్తిస్తాయనే భరోసా ఇస్తోంది అధినాయకత్వం. గంటా శ్రీనివాసరావు రాజకీయమే వేరు. అందుకే వైసీపీ ఆయన గురించి ఇన్నాళ్లు తటపటాయించింది. వచ్చి జరిగే మేలు కన్నా అనర్థాలగురించే ఎక్కువ ఆలోచించింది. కానీ చివరికి కొన్ని సమీకరణాల దృష్ట్యా సానుకూల సంకేతాలిచ్చింది.

ఏ ఎండకాగొడుగు పట్టటంలో గంటాని మించిన లీడర్‌ ఉండరనే చెప్పాలి. ఇప్పటిదాకా ఆయన మూడుపార్టీలు మారారు. పార్టీ ఏదయినా ఆయన పదవి మాత్రం పదిలం. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవటంతో గంటా డీలాపడ్డారు. వైసీపీలో చేరేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి నాలుగోపార్టీలోకి అడుగుపెడుతున్నారు. టీడీపీకి ఉత్తరాంధ్రలో బలం ఉంది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ హవా నడిచినా విశాఖ నగరంలో సైకిల్‌పార్టీ తన బలాన్ని నిరూపించుకుంది. దీంతో ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బ కొట్టాలన్న టార్గెట్‌ పెట్టుకుంది వైసీపీ. అందుకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్రతీసారీ గెలిచిన గంటా చేరికకు పచ్చజెండా ఊపింది.

జనవరి నెలాఖరులోగానే ఉత్తరాంధ్రలో టీడీపీ నుంచి చేరికలను వేగవంతం చేయాలన్న కార్యాచరణతో వైసీపీ ముందుకెళ్తోంది. విశాఖ, అనకాపల్లి జిల్లాలనుంచి మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరబోతున్నా టికెట్‌ హామీ మాత్రం గంటాతో పాటు మరో మాజీ ఎమ్మెల్యేకే ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కీలక నాయకులను టీడీపీ నుంచి తీసుకురావాలని వైసీపీ నాయకత్వం గంటాకు షరతులు పెట్టిందని సమాచారం. మరోవైపు వైసీపీలో తన సహజశైలి రాజకీయాలు నడపకుండా గంటాకు వైసీపీ చెక్‌ పెట్టబోతోంది. ఏమాత్రం తోక జాడించినా అధినేత చేతుల్లో కత్తెర రెడీగా ఉంటుంది. గంటా వచ్చినా ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఉండదన్న విషయం నేతల మాటల్లోనే తెలిసిపోతోంది.