కాంగ్రెస్ – బీజేపీ సంక్షేమం మధ్య తేడా “గ్యాస్ సబ్సిడీ” అంత !

By KTV Telugu On 9 May, 2022
image

పాలకులంటే ఎవరు ? పుస్తకాల్లో ఉండే విస్తృతార్థం ఏది ఉన్నా ప్రజల్ని బాగు చేయకపోయినా వారిని దోచుకోని వారు పాలకులు అని ప్రజలు అనుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు దోచుకోవడమే పాలకుల పని అయిపోతోంది. దానికి ధనిక .. పేదా తేడా లేదు. గ్యాస్ ధరలు.. వాటికి ప్రజలకు ఇస్తున్న సబ్సిడీనే సాక్ష్యం. గ్యాస్ ధరలను సామాన్యులు భరించలేనంతగా పెంచేసి.. ఇచ్చే సబ్సిడీని అవమానకరంగా తగ్గించేసి కేంద్రం పేదల్ని కూడా వదలకుండా లూటీ చేస్తోంది. ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అప్పట్లో కాంగ్రెస్ దేవుడి పాలన అనుకోక తప్పదు.

2014 లో రూ.410 – ఇప్పుడు రూ. 1100!

కేంద్ర ఇంధన శాఖ లోక్‌సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానం ప్రకారం 2014 మార్చి ఒకటవ తేదిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.410.50గా ఉండింది. ఇప్పుడు అది రూ. 1050కి చేరుకుంది. తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌కు ఏమీ ఇవ్వవొద్దని చెప్పినా ఇవ్వక తప్పదు. ఎలా చూసినా గృహ వినియోగదారులకు ఖర్చు పదకొండు వందలు అవుతోంది. అంటే ఆరేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ దోచుకుంటోందని నానా తిట్లు తిట్టి.. ఆ పార్టీని హఠావో చేసినప్పుడు నాలుగు వందలు ఉన్న రేటు ఇప్పుడు పదకొండు వందలు అయింది. అప్పుడు సబ్సిడీ ఎత్తేసి బ్యాంకులే వేస్తామని కాంగ్రెస్ వారు అంటే మోడీ చేసిన పోరాటం ఆకర్షించింది. ఆయన వస్తే రేట్లు పెరగవని అనుకున్నారు. కానీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ రేటు చూస్తే రూ. వెయ్యి అయింది. అంటే దాదాపుగా రెండింతలు అయింది. ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నట్లు ?

హవ్వ సబ్సిడీ రూ. నలభై రూపాయలా ?

నగదు బదిలీ ప్రారంభించిన కొత్తలో గ్యాస్ సబ్సిడీ రూ. నాలుగు వందల పైనే వచ్చేది. కానీ ఇప్పుడు ఎంత వస్తోంది.. రూ. నలభై రూపాయలు వస్తోంది. ఎంత రేట్లు పెంచిన అంతకంటే సబ్సిడీ పెరగడం లేదు. మధ్యలో గ్యాస్ సబ్సిడీ వదులుకోండని విస్తృత ప్రచారం చేశారు. పెరుగుతున్న ధరల భారంతో ఎవరూ గ్యాస్ సబ్సిడీని వదులుకోవడానికి సిద్ధపడలేదు. దాంతో అందర్నీ అవమానించేలా సబ‌్సిడీని కత్తించేసింది. చివరికి అది నలభై దగ్గర ఉంది. అది మాత్రం ఎందుకు అంటే.. ఇస్తున్నామని చెప్పడానికి. ఓ దశలో రూ. పదిహేను కూడా చేరింది. ఇంత కొంత మొత్తం ఇచ్చి అవమానించం కన్నా ఆపేయవచ్చు కదా అంటే.. రేపు ఎన్నికల్లో మిత్రోం.. గ్యాస్ రేట్లు పెంటినా మీకు సబ్సిడీ ఇస్తున్నాం కదా అని అరచి చెప్పడానికి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ఉపయోగపడతాయి.

గ్యాస్ వాడటం మానేస్తున్న పేదలు !

పెరుగుతున్న నిత్యావసర వస్తవుల ధరలతో తిండి గింజలే భారం అనుకుంటే గ్యాస్ కూడా రేటు పెరిగింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగం పూర్తి స్థాయిలో తగ్గిపోతోంది. సిటీల్లో కూడా తగ్గిపోతోంది. ఇది నమ్మశక్యం కాని నిజం. తాజా గణాంకాల ప్రకారం మార్చి నెలలో సిలిండర్‌ ధరలు పెంచిన తరువాత ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా వినియోగం తగ్గింది. మార్చితో పోల్చుకుంటే 9.1 శాతం సిలిండర్ల వాడకం తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వ ఇంధన వర్గాలు తెలిపాయి. ఆర్థిక రాజధాని ముంబైలో 21 శాతం కుటుంబాలు వంట గ్యాస్ వాడటం లేదని “ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్” సేకరించిన డేటాలో స్పష్టమయింది. వీరిలో అందరికీ కనెక్షన్లు ఉన్నాయి. కానీ అంత ధర పెట్టి కొనుగోలు చేయడం కష్టమవుతోంది. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా కట్టెల పొయ్యిలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్యాస్ అనేది లగ్జరీగా మారిందని అక్కడి జనం అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో కేంద్రం ఇచ్చే సబ్సిడీ కూడా పూర్తిగా తగ్గించేసింది. రూ. ఇరవై, ముప్ఫై కూడా సబ్సిడీ ఇవ్వడం లేదు. ఈ కారణంగా గ్యాస్ నుంచి కట్టెల పొయ్యి వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారు. గతంలో గ్యాస్ వాడిన వారు కూడా కట్టెల పొయ్యికే మొగ్గ చూపుతున్నారు.

లక్షల కోట్ల పన్నుల వసూళ్లు.. కానీ పేదలకు మాత్రం దుర్భరం!

నెలకు రూ. రెండు లక్షల కోట్ల జీఎస్టీ వసూలు దిశగా పయనం సాగిస్తున్నారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ఇతర పన్నులు లక్షల కోట్లలో వస్తున్నాయి. ఇన్ని వసూలు చేస్తున్నా పేదలకు కనీస అవసరాలకు సాయం మాత్రం చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో చెప్పి ప్రజల్ని నమ్మించారు.. కానీ వంచిస్తున్నారు. బతుకుల్ని దుర్భరం చేస్తున్నారు.