జీవో నెం 111 రద్దు అయినట్లేనా ?

By KTV Telugu On 15 April, 2022
image

హైదరాబాద్‌లో ఓ వైపు రియల్ ఎస్టేట్‌ అభివృద్ధికి ప్రతి బంధకంగా ఉన్న జీవో నెంబర్ 111ను రద్దు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అనేకానేక సందేహాలు… వ్యక్తమవుతున్నాయి. కేబినెట్‌కు ఆ అధికారం ఉందా అని కొందరు విశ్లేషిస్తూంటే.. ఘోరమైన తప్పిదం చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఈ జీవో నెంబర్ 111 వల్ల వచ్చిన నష్టమేంటి ? జీవో రద్దుతో లాభం కలుగుతుందా ?

జంట జలాశయాల రక్షణ కోసం జీవో నెంబర్ 111

గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 111ని జారీ చేశారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. మొత్తం 84 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు.

జంట జలాశయాల నీటి వాడకం ఇప్పుడు లేదు !

ఒకప్పుడు హైదరాబాద్‌కు గండిపేట , హిమాయత్ సాగర్ జలాలే కీలకం. అందుకే వాటి పరిరక్షణకు జీవో తెచ్చారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై ఆధారపడడం తగ్గింది. అందువల్ల జీవో 111ని ఎత్తివేయాలని కోరుతున్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ ఆంక్షల కారణంగా.. ఆ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి జరగడం లేదు. మిగతా ప్రాంతాలతో పోల్చితే భూముల ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. 111 జీవోను రద్దు చేస్తే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. భూముల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది.

జీవో ఎత్తివేతను కోర్టులు అంగీకరిస్తాయా !?

జీవో నెంబర్ 111 పరిధిలోని గ్రామాల పాలకవర్గాలు జీవోను రద్దు చేయాలని కోరుతూ.. గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. అదే సమయంలో జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. గతేడాది సెప్టెంబరులో సీఎం కేసీఆర్ అధికారులతో జీవో 111పై ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ పొందించాలని ఆదేశించారు. గతంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నుంచి నివేదిక ఇవ్వలేదు. కానీ కేసీఆర్ మాత్రం జీవోను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై కోర్టులలో పిటిషన్లు పడితే ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పర్యావరణానికి హానీ.. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఊతం

ఈ జీవో పరిధిలో దాదాపు 538 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఈ జీవో తీసేస్తే దాదాపు లక్షా 32 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని ఒక అంచనా. ఈ భూమిలో ప్రభుత్వానికి చెందినదే 18 వేల ఎకరాలకు పైగా ఉంది. దీంతో హైదరాబాద్ విస్తరణ అవకాశం బాగా పెరుగుతుంది. ఇక ప్రైవేటు భూముల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ పర్యావరణ పరంగా ఆ రెండు జలాశయాలు అత్యంత కీలకమైనవి. మూసీ ప్రవాహం వరద నియంత్రణ పరంగా, తాగునీటి సరఫరా పరంగా, భూగర్భ జల కాలుష్యం పరంగా వీటిని సరిగ్గా నిర్వహించలేకపోతే.. మొదటికే మోసం వస్తుందని పర్యావరమ వేత్తలంటున్నారు. ఈ వివాదం అలా మరికొన్నాళ్లు సాగే అవకాశం ఉంది .