గోషా మహల్ రాష్ట్ర రాజధానిలో హైఓల్జేజీ నియోజకవర్గం. హైదరాబాద్ లోక సభ నియోజకవర్గాల్లో కీలకమైన అసెంబ్లీ స్థానం గోషామహల్. ఈనియోజకవర్గం పేరు చెబితే గుర్తొచ్చేది రాజాసింగే. సిట్టింగ్ ఎమ్మెల్యే మూచ్చటగా మూడోసారి గెలుస్తారా.. లేదా లోకేషన్ చేంజ్ అంటారా… బీజేపీ అడ్డాలో కారు షికారు చేస్తుందా..?
బీజేపీ RRRలో ఒకరైన రాజాసింగ్ మంచి ఉన్న ఫాలోయింగ్ లీడర్. గోషామహల్ పేరు చెప్పగానే గుర్తొచ్చే నేతగా ఒక ముద్ర వేసుకున్నారు. హిందుత్వమే తన అజెండా అని బాహాటంగా చెబుతూ ముందుకెళ్తున్న నేత. వీలున్నప్పడల్లా ఎంఐఎంపై విమర్శల దాడితో చెలరేగిపోతుంటారు. రాజధాని నగరంలోని కీలక ప్రాంతమైన గోషామహల్ బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతం. రాజాసింగ్ మాటలే కాదు చేతల్లోను దూకూడుగానే ఉంటారు. రెండుసార్లు ఇదే స్థానం నుంచి గెలిచిన రాజాసింగ్ నియోజకవర్గంలో చురుగ్గానే కనిపిస్తుంటారు. పార్టీ కార్యక్రమాల్ని పక్కాగా అమలుచేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. స్థానిక సమస్యలకి అధికారపార్టీ టీఆర్ఎస్ నిర్లక్ష్యమే కారణమని ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. నియోజకవర్గానికి భారీగా నిధులు ఇస్తే రాజీనామాకి సిద్ధమంటూ ఛాలెంజ్ చేశారు. దళితబంధు విషయంలోను ఇలాంటే సవాల్ విసిరారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా నియోజకవర్గంలో తనదైన ముద్రవేశారు.
ముచ్చటగా మూడోసారి రాజాసింగ్ గోషామహల్ నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా ఈసారి ఒక ట్విస్టు ఉంటుందంటున్నారు.. రాజాసింగ్ గోషామహల్ వదలి వేరే చోట పోటీకి సన్నద్ధమవుతున్నట్లు పార్టీలో టాక్. లోక్ సభ ఎంపీగా పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈమధ్య తరచూ జహీరాబాద్ లో పర్యటనలు చేస్తూ కేడర్ ను కలుస్తూ నియోజకవర్గంపై రాజాసింగ్ ఫోకస్ పెట్టారు. టీఆర్ఎస్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్, నందకిషోర్ వ్యాస్ పోటీ పడుతున్నారు. ప్రేమ్ సింగ్ ఈ నియోజకవర్గాన్నే చాన్నాళ్లుగా అంటిపెట్టుకుని ఉన్నారు. 2018ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచారు. అటు గోషామహల్ టికెట్ ఆశిస్తున్న నందకిషోర్ వ్యాస్… సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు మంచి పట్టున్న గోషా మహల్ పై కాంగ్రెస్ పట్టు తగ్గింది. వచ్చే ఎన్నికల్లో ముఖేష్ గౌడ్ లేదా ఆయన కొడుకు బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.
స్థానిక సమస్యల కంటే పొలిటికల్ మూడే ఇక్కడ అభ్యర్ధుల గెలుపోటముల్ని నిర్దేశిస్తుంది. రాజధాని నగరంలోని నియోజకవర్గం కావడంతో గోషామహల్ లో ఓటర్ల మనోగతం పసిగట్టడం కష్టమే. వరుసగా రెండుసార్లు బీజేపీని గెలిపించిన ఓటర్లు అంతకుముందు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. వలస వచ్చిన వాళ్లతోపాటు స్థానికంగా స్థిరపడిన వారు ఈ ప్రాంతంలో ఎక్కువ. అర్బన్ పాలిటిక్స్ స్థానిక సమస్యల్ని డామినేట్ చేస్తుంటాయి. నగరంలో కాషాయ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గోషామహల్ నియోజకవర్గం ఒకటి.
హైదరాబాద్ లోక్ సభ పరిధిలోకి వచ్చే గోషామహల్ లో ఎన్నిలు జరిగిన ప్రతీసారి బీజేపీ ఓటింగ్ పెరుగుతూనే వస్తోంది. రాజధానిలో టీఆర్ఎస్ కు పెద్దగా పట్టు లేదనే అభిప్రాయం పూర్తిగా తొలగిపోలేదు. హిందూత్వ సిద్ధాంతాన్ని గట్టిగా వినిపించే రాజాసింగ్ బలమైన నేతగా ఉన్నారు. ఒకప్పుడు రాజధానిలో బలంగా ఉన్న కాంగ్రెస్ బలహీనంగా మారడంతో ప్రత్యర్ధులకు కలిసివచ్చింది. రేవంత్ రెడ్డి రాకతో ఆ పరిస్థితి మారుతుందని నమ్ముతున్నారు. పార్టీ నేతలు కలిసి కట్టుగా పోరాడితే విజయం వరిస్తుందని ఆశతో ఉన్నారు
ఈసారి కూడా వచ్చే ఎన్నికల్లో మళ్లీ త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ సై అంటోంది. ఆఖరి పోరాటంగా భావిస్తున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. బీజేపీ తమ గెలుపు ఖాయమని బలంగా నమ్ముతోంది. ప్రజాదర్బార్, హిందీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయిస్తానన్న హామీలు ఇంకా రాజాసింగ్ నెరవేర్చలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీతారాంబాగ్ నుంచి కిస్తీ చమాన్ రహదారిలో డ్రైనేజీ సమస్య అలాగే ఉందని గుర్తుచేస్తున్నాయి. టీడీపీతో మొదలైన రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం రాజాసింగ్ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు అంచెలంచెలుగా ఎదిగారు. ఉత్తరాది నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పచుకున్న రాజాసింగ్ తన వాగ్దాటితో ఓటర్లను ఆకట్టుకోవడంలో దిట్ట. ప్రత్యర్ధులకు ఖచ్చితమైన పోటీ ఇవ్వడం అయితే ఖాయం.