తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నట్లుగా ఓ స్పష్టమైన నిర్ణయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వాన్ని రద్దు చేసే చాన్స్ వచ్చిందన్నట్లుగా గవర్నర్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయరని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు యాక్షన్‌లోకి వచ్చేశారు. ఇరవై నాలుగు గంటల క్రితమే మహిళాదర్బార్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుని.. బీజేపీ క్యాడర్‌ను పిలిపించుకుని మహళా దర్బార్ నిర్వహించారు. పైగా కేసీఆర్‌కు సందేశం పంపేందుకేనని నేరుగానే చెబుతున్నారు.
గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం చట్ట వ్యతిరేకమని టీఆర్ఎస్ వైపు నుంచి అనేక విమర్శలు వచ్చినప్పటికీ.. తమిళిసై ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపుగా మూడు వందల మంది మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. ఎక్కువ మంది తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించే వివరించారు. తెలంగాణ కోసమే పని చేస్తున్నానని, మహిళలకు అండగా ఉంటానని, తనని ఆపే శక్తి ఎవరికీ లేదని గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మహిళలు ఇబ్బంది పడితే తాను చూస్తూ ఉండలేనని, బాధిత మహిళలకు మధ్య వారధిగా ఉంటానని ప్రకటలు చేశారు. ఎవరు అడ్డుకున్నా తాను ఆగబోనన్నారు. రాజ్ భవన్‌కు ప్రజాదర్బార్ నిర్వహించడానికి అధికారం ఉందని స్పష్టం చేశారు. ముందు ముందు ఇంకా నిర్వహిస్తామన్నారు. తాను చేసే పనులకు ఎవరూ అడ్డు చెప్పినా పట్టించుకోననన్నారు. అయితే మొత్తంగా ఈ కార్యక్రమం బీజేపీ నేతలు ఆర్గనైజ్ చేసినట్లుగా ఉందని అందరికీ తెలిసిపోయింది. వచ్చిన వారంతా ప్రభుత్వంపై ఫిర్యాదులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక గవర్నర్ కు కేంద్రం డ్యూటీ అప్పగించినట్లేనని.. ఇక నుంచి తమిళిసై వైపు నుంచి మరింత దూకుడుగా నిర్ణయాలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఎన్టీఆర్‌ను అప్పటి గవర్నర్ కుముద్ బెన్ జోషి ఇబ్బంది పెట్టినట్లుగా ఇప్పుడు… కేసీఆర్‌ను తమిళిసై ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కుముద్ నిఖార్సయిన కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు. కేవలం NTR ని విసిగించేందుకే ఆమెని ఇక్కడికి పంపారు. ఆ పనిని చెప్పినట్లుగా కుముద్ చేసేశారు. కుముద్ బెన్ జోషి 23 జిల్లాల్లో 108 సార్లు పర్యటించారు. సమాంతర ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేశారు. ఆమెకు వ్యతిరేకంగా ఆనాటి ముఖ్యమంత్రి NTR అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని చేసి రాష్ట్రపతికి పంపారు. కేంద్రం సహాయం లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అభివృద్ధి సాధించలేదని ఎన్టీఆర్ అప్పట్లో తేల్చి చెప్పారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే ప్రసంగంలో కూడా వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ బంగళా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుగా మారిపోయిందని అప్పట్లో తెలుగు దేశం పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు తమిళిసై మహిళా దర్బారుకు శ్రీకారం చుట్టారు. త్వరలో ప్రజాదర్బార్ ఉంటుందని ప్రకటించారు. అప్పట్లో కుముద్ బెన్ జోషి రాజ్ భవన్‌లోనే జోగినిలకు వివాహాలు కూడా చేశారు. తరచూ మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేసేవారు. అయిదేళ్ళ పాటు అంటే 1990 ఫిబ్రవరి దాకా గవర్నర్ గా ఉన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా చిరాకు పెట్టాలో అన్నీ పెట్టారు. చివరికి అనుకున్నట్లుగా ఆ పార్టీని ఓడించడంలో కీలక పాత్ర పోషించి 1989 నవంబరులో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి చేత ప్రమాణ స్వీకారం చేయించే వరకూ పదవిలో ఉన్నారు.
ఇప్పుడు అదే పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. తమిళిసైకూ అదే టార్గెట్ బీజేపీ హైకమాండ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించి ఉన్నారు. ఆ దిశగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నియమించిన గవర్నర్ తమిళిసైతోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడి గవర్నర్లు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రభుత్వాలతో తలపడుతూ ఉంటారు. బెంగాల్, తమిళనాడుల్లో అదే జరుగుతోంది. గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రభుత్వానికి అనేక చికాకులు ఏర్పడతాయి. బెంగాల్‌లో అదే జరుగుతోంది. బీజేపీ గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తే గాల్లో ఇదే తరహా పరిస్థితులు ఇక్కడా కనిపించే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై కేంద్రం కుట్రలు ప్రారంభమైనట్లే చెప్పుకోవాలి.