విశాఖ వైసీపీలో భూ రగడ

By KTV Telugu On 13 October, 2022
image

విశాఖలో భూదందా దుమారం
దసపల్లా భూదోపిడీపై వివాదం
వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్
ప్రభుత్వంపై విపక్ష నేతల ఆగ్రహం
భూ ఆక్రమణలపై విచారణకు డిమాండ్

విశాఖ కేంద్రంగా సాగుతున్న భూదందా వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన దసపల్లా భూములపై వివాదం నడుస్తోంది. అధికార వైసీపీ నేతలు రాబంధుల్లా మారి నగరంలోని భూములను మింగేస్తున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దసపల్లా భూములను తన బిడ్డ, అల్లుడికి దోచిపెట్టారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. దసపల్లా భూ వివాదంపై వివరణ ఇచ్చే క్రమంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో లుకలుకల్ని బయటపెట్టింది. సొంత పార్టీలోని నేతలే తనకు వ్యతిరేకంగా ఈ విధమైన దుష్ర్పచారం చేస్తున్నారంటూ…. విశాఖ ఎంపీ ఎంవీవీ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు.

విశాఖలోని కూర్మన్నపాలెంలో భూమి యజమానికి ఒక శాతం ఇచ్చి, ప్రాజెక్టు డెవలపర్‌ 99శాతం తీసుకున్నారని, ప్రపంచంలో ఎక్కడాలేనిది ఇక్కడే చూస్తున్నామంటూ….వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు స్థానిక వైసీపీ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణది. అంతేకాదు హయగ్రీవ ప్రాజెక్టుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలు, ఆధిపత్యపోరుకి సాయిరెడ్డి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖలో పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ పై…. అధినాయకత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

దసపల్లా భూముల వ్యవహారంలో భూ యజమానులుగా చెప్పుకునే వారు.. తమ భూముల్ని డెవలప్ మెంట్ కు ఇచ్చి.. 29 శాతం భూ యజమానులు.. 71 శాతం డెవలపర్ తీసుకునేలా ఒప్పందం తీసుకోవటం పెను సంచలనంగా మారింది. ఇదే ఇలా ఉంటే..అంతకు మించి అన్నట్లుగా కూర్మన్నపాలెం డీల్ గురించి విజయసాయి చెప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయసాయిరెడ్డి, ఎంవీవీ టార్గెట్ గా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నగరంలో భూదోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. భూ ఆక్రమణలపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.