లంచగొండి అధికారులను విడిచిపెట్టొద్దన్న సుప్రీంకోర్టు

By KTV Telugu On 16 December, 2022
image

మనదేశంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే చేతులు తడపాల్సిందే. అటెండర్ దగ్గరినుంచి ఆఫీసర్లవరకు లంచాలు తీసుకోవడం తమ జన్మహక్కుగా భావిస్తారు. అవినీతి నిరోధక చట్టాలు ఉన్నా లంచాలు తీసుకునేవారు ఏమాత్రం భపడడం లేదు. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక ఎస్‌ఐ లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడ్డారు. వారిని చూడగానే అతను తన చేతుల్లో ఉన్న కరెన్నీ నోట్లను మింగడానికి ప్రయత్నించారు. నోట్లే లేకపోతే తాను లంచం తీసుకున్నాడనడానికి ఆధారాలు ఉండవని ఆ ఎస్‌ఐ ఉద్దేశం. అయితే అతని పన్నాగం పసిగట్టిన అధికారులు అయితే అతని నోట్లో నుంచి ఆ కరెన్సీ నోట్లను బలవంతంగా కక్కించారు. సాక్షాలు, ఆధారాలు లేకుండా లంచం తీసుకుంటే ఎవరూ పట్టుకోలేరని భావించే లంచగొండి అధికారులను వదలకూడదని సుప్రీంకోర్టు మరో కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ప్రజలకు సేవ చేసేందుకు నియమించిన అధికారులు అక్రమార్జన కోసం ఆ ప్రజలనే వేధిస్తుంటే వారిపై దయ చూపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పింది. సరైన సాక్ష్యం లేదనే కారణంతో అవినీతిపరులను వదిలేయొద్దని కింది కోర్టులకు సూచించింది. లంచం అడిగినట్లు, తీసుకున్నట్లు నిరూపించేందుకు ప్రత్యక్ష సాక్ష్యం తప్పనిసరి కాదని పేర్కొంది. ప్రత్యక్ష సాక్ష్యంలేకున్నా, పరోక్ష సాక్ష్యంతోనైనా అవినీతి అధికారులను శిక్షించవచ్చని తేల్చిచెప్పింది. ఈమేరకు జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుచెప్పింది. అవినీతి కేన్సర్ లాంటిదని ఇది ప్రభుత్వంతోపాటూ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారిందని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అవినీతి అధికారులపై సుప్రీంకోర్టు కొరడా జలిపించడం బాగానే ఉన్నా అవినీతికి అలవాటు పడిన అధికారులు లంచం తీసుకోకుండా పనిచేయరు అనేది సామాన్య ప్రజల అభిప్రాయం.