గుజరాత్‌లో కేబుల్‌బ్రిడ్జి కూలడం ఎవరి వైఫల్యం?

By KTV Telugu On 31 October, 2022
image

భావోద్వేగాలు కాదు.. బాధ్యత వహించేందెవరు?

ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. కేంద్రహోంమంత్రి కూడా దుర్ఘటన సమయంలో అదే రాష్ట్రంలో ఉన్నారు. పరిహారాలు, పరామర్శలతో పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా. బీజేపీ పాలిత గుజరాత్‌లో జరిగిన ఘోర దుర్ఘటన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. మచ్చు నదిపై మోర్బీ తీగలవంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 140దాటింది. దాదాపు వందమంది ఆచూకీ దొరక్కపోవటంతో మృతుల సంఖ్య పెరగబోతోంది. వారాంతంలో విహారానికి వచ్చినవారి జీవితాలు నీళ్లలో కలిశాయి. రిపేర్లకోసం ఆర్నెల్ల క్రితం మూసేసిన కేబుల్‌బ్రిడ్జి మళ్లీ తెరిచిన ఐదురోజులకే ఇలా పుటుక్కున తెగిపోయింది. బ్రిటిష్‌ హయాంలో నిర్మించాక 140ఏళ్లు అందరినీ అలరించిన బ్రిడ్జి మనవాళ్లు చెయ్యిపడ్డాక పేకమేడలా కూలిపోయిందంటే లోపం ఎవరిది? కాంట్రాక్టర్లను అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ కేసులు పెడితే దారితప్పిన వ్యవస్థ బాగుపడుతుందా? నాణ్యతాలోపంతో ఇలాంటి మరో దుర్ఘటన జరగదన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? వందా నూటాయాభైమంది బరువును మోసే సామర్థ్యం ఉన్న బ్రిడ్జిమీదికి 500మందిని ఎలా అనుమతించారు.

అధికారుల నిర్లక్ష్యం అమాయక జనం ప్రాణాలు తీసింది, ఛట్‌ పూజ నేపథ్యంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కేబుల్‌ బ్రిడ్జిమీద విజిటర్స్‌ ప్రవాహంలా వచ్చేశారు. నదీ ప్రవాహంలో కలిసిపోయారు. రిపేర్ల తర్వాత బ్రిడ్జి పటిష్టతమీద సరైన తనిఖీ జరగలేదు. మళ్లీ తెరవటానికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదంటున్నారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే మళ్లీ తెరిస్తే అధికారయంత్రాంగం ఏం చేస్తున్నట్లు? 1879నాటి బ్రిడ్జి 2022లో కూలడానికి అధికారగణం బాధ్యతారాహిత్యం కారణంకాదా? ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిన పన్లేదా? రూ.2 కోట్లతో 7 నెలలపాటు పనులు జరిగాయి. ఈ బ్రిడ్జి ఎంతవరకు సురక్షితమన్న అంశం గుజరాత్‌ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తంచేసినా అంతా బాగుందని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంతా బాగుంటే ఇలా ఎందుకు జరిగింది?
పొరపాటున ఓ ప్రభుత్వ లావాదేవీని పర్సనల్‌ మెయిల్‌నుంచి నిర్వహించినందుకు విదేశాల్లో మంత్రి రాజీనామా చేశారు. అంత నైతికత మన నేతలదగ్గర ఎక్కడేడ్చింది?!