గుజరాత్ లో మళ్లీ కాషాయ జెండా?

By KTV Telugu On 6 December, 2022
image

హిమాచల ప్రదేశ్ లో టఫ్ ఫైట్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో కేజ్రీవాల్ హవా

గుజరాత్, హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. గుజరాత్ లో మరో దఫా బిజెపి ప్రభుత్వమే కొలువు తీరనుందని అన్ని సర్వేలూ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. హిమాచల ప్రదేశ్ లో కొన్ని సర్వేలు హోరా హోరీ తప్పదని తేలిస్తే ఒకటి రెండు సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని  అంచనా వేశాయి.

గుజరాత్ విషయాన్ని తీసుకుంటే  గత అసెంబ్లీ ఎన్నికల్లో 182 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో బిజెపి 99 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకుని గట్టి పోటీని ఇచ్చింది. ఈ సారి కాంగ్రెస్ మరింత గట్టి పోటీని ఇస్తుందనుకుంటే ఎగ్జిట్ పోల్స్ సరళిని చూస్తే కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోక తప్పదని అనిపిస్తోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారిగా గుజరాత్ లో బోణీ తెరవబోతోందని సర్వేలు చెబుతున్నాయి.
జన్ కీ బాత్, న్యూస్ ఎక్స్ సర్వేల్లో బిజెపికి 117 నుండి 140 స్థానాలు కాంగ్రెస్ కు 34 నుండి 51 స్థానాలు దక్కుతాయని  అంచనా వేయగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు నుండి 13 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని అంచనా వేశారు.

బిజెపి అనుకూల మీడియాగా పేరొందిన రిపబ్లిక్ టీవీ సర్వేలో అయితే బిజెపికి 128 నుండి 149 స్థానాలు కాంగ్రెస్ కు 30 నుండి 42 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు నుండి 10 స్థానాలు వస్తాయని తేలింది. పీపుల్స్ పల్స్ సర్వేలో బిజెపికి 125 నుండి 143 స్థానాలు కాంగ్రెస్ కు 30 నుండి 48 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి 3నుండి ఏడు స్థానాలు వస్తాయని అంచనా.
ఆత్మసాక్షి సర్వేలో మాత్రం కాంగ్రెస్ కు కొంచెం గౌరవ ప్రదమైన స్కోర్ దక్కింది. ఈ సర్వేలో బిజెపికి 98 నుండి 110 స్థానాలు కాంగ్రెస్ కు 66 నుండి 71 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి 9నుండి 14 స్థానాలు వస్తాయని తేల్చారు.
మొత్తం మీద సర్వేలన్నీ కూడా బిజెపి ప్రభుత్వమే వచ్చి తీరుతుందని తేల్చాయి.

నిజానికి గుజరాత్ లో పాతికేళ్లకు పైగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకతే కనపడింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. విద్యుత్ ఛార్జీలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువగా ఉన్నది గుజరాత్ లోనే. విద్య, వైద్య రంగాలు చాలా రాష్ట్రాలకన్నా కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. గుజరాత్ లో ఏమన్నా బాగుందీ అన్నది ఉందీ అంటే అది ఒక్క కార్పొరేట్ రంగమే. మధ్యతరగతి, పేద ప్రజల్లో మాత్రం విపరీతమైన అసంతృప్తి ఉంది. అది ఎన్నికల్లో బిజెపి కొంపలు ముంచుతుందని భావించారు. అయితే ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్  ఘోరంగా విఫలమై ఉండచ్చా అన్నది ఈ నెల 8న  ఓట్ల లెక్కింపు తర్వాతనే చెప్పగలం. అయితే ఎగ్జిట్ పోల్స్ లో  కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా బలహీనంగా  కనపడ్డానికి కారణాలు ఏమై ఉంటాయన్నది  ఆసక్తి కరంగా మారింది.

ఎవరు ఔనన్నా కాదన్నా  గుజరాత్ ఎన్నికల్లో  బిజెపి కి దీటుగా ప్రచారం సాగించింది కొత్త పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీనే. మోదీ-అమిత్ షాలకు  తగ్గట్లుగా కౌంటర్లు ఇస్తూ ప్రచారాన్ని పరుగులు పెట్టించిన కేజ్రీవాల్ బిజెపికే సొంతం అనుకున్న హిందుత్వను కూడా సొంతం చేసుకున్నారు. కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు ఉంచాలంటూ ఆయన చేసిన డిమాండ్ వెనుక హిందుత్వ మీ ఒక్కరి పేటెంట్ కాదని బిజెపికి సవాల్ విసరడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆప్ ఎంట్రీకి తోడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లతో పాటు బిజెపి వ్యతిరేక ఓట్లను ఆప్ పెద్ద మొత్తంలో చీల్చి ఉండవచ్చని అంటున్నారు. ఇంతవరకు గుజరాత్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఆప్ ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే పది స్థానాలకు పైనే సొంతం చేసుకోవచ్చునని తేలింది. కచ్చితంగా ఈ నియోజక వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినవే అయి ఉంటాయి. ఇవి కాకుండా పాతిక నుండి నలభై నియోజక వర్గాల్లో బిజెపి వ్యతిరేక ఓటును ఆప్ ఎక్కువగా చీల్చడం వల్ల  కాంగ్రెస్ నష్టపోయి బిజెపికి లాభం చేకూరి ఉండచ్చంటున్నారు రాజకీయ పండితులు.

నిజానికి గుజరాత్ లో  బిజెపి ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే 2024 ఎన్నికల్లో సాధారణ ఎన్నికలపై దాని ప్రభావం ఉండేది. అప్పుడు ప్రతిపక్షాలు ఉత్సాహంగా కదం తొక్కే వీలుండేది. కానీ బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం అది బిజెపికి అడ్వాంటేజ్ గా మారే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష శిబిరంలో ఉత్సాహం నింపాలంటే ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులై డిసెంబరు ఎనిమిదిన జరిగే ఓట్ల లెక్కింపు రోజున బిజెపి ఓడిపోవాలి. అయితే అది జరిగేలా కనపడ్డం లేదంటున్నారు రాజకీయ పండితులు.ఈ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ లో నిరాశ నిస్పృహలు తారాస్థాయికి చేరే  అవకాశాలుంటాయి. కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారధ్యంలోని తొలి ఎన్నికల్లోనే పార్టీ ఓడిపోవడం ఖర్గేకూ కాస్త ఇబ్బందికలిగించేదే అంటున్నారు  విశ్లేషకులు.

ఇక హిమాచల ప్రదేశ్ లో ఆనవాయితీ ప్రకారం ఈ సారి కాంగ్రెస్ గెలవాలి. ఇంచుమించు అన్ని సర్వేలూ హోరా హోరీ తప్పదనే తేల్చాయి. ఒకటి రెండు సర్వేల్లో మాత్రం కాంగ్రెస్ కు 40 స్థానాల దాకా రావచ్చునని తేల్చాయి. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చునని సూచించాయి. ఇక ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపికి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 15ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను పరిపాలిస్తోన్న బిజెపిని ఈ సారి చీపురు కట్ట పుచ్చుకుని ఊడ్చిపారేయడం ఖాయమని సర్వేలు అంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం బిజెపిని చావు దెబ్బ కొట్టడం ఖాయమని తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 149 నుండి 171 స్థానాలు దక్కడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. బిజెపికి 69 నుండి 94 సీట్ల వరకు వస్తాయని అంచనా. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ 10 స్థానాలకే పరిమితం అవుతుందని తేలింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బిజెపిలను చావు దెబ్బ కొట్టి ఘనవిజయంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రానికి విస్తరించి అక్కడా అధికారంలోకి వచ్చింది. ఈ సారి గుజరాత్ ఎన్నికల్లోనూ ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంది. సర్వేలన్నీ ఆప్ కు పది స్థానాలకు పైనే వస్తాయని తేల్చాయి. అంటే అది కేజ్రీవాల్ పార్టీకి అతి పెద్ద విజయమే అవుతుంది. ఎందుకంటే ఈసారి వచ్చిన ఓట్లతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో కాంగ్రెస్ ను పూర్తిగా వెనక్కి నెట్టి అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయని రాజకీయ పండితులు జోస్యాలు చెబుతున్నారు. మొత్తానికి గుజరాత్ ఎన్నికలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజాలైతే కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డుకాలం దాపురించిందని చెప్పక తప్పదంటున్నారు మేథావులు.