కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా మంజూరు చేయలేదు : హరిశ్‌రావు

By KTV Telugu On 3 October, 2022
image

* ప్రస్తుతం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి
* త్వరలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం

దేశవ్యాప్తంగా 190 వరకు మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఒక్కటి కేటాయించలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం నిధులిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
నిజంగా కేంద్రం నిధులు ఇచ్చినట్లయితే ఆ వివరాలు చెప్పాలన్నారు. మెడికల్‌ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేసినా గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించామని హరీశ్​రావు అన్నారు. ఈ ఒక్క సంవత్సరమే 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 850 మెడికల్‌ సీట్లు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు వాటి సంఖ్య 2052 సీట్లకు పెరిగిందని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల ద్వారా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎంబీబీఎస్​లో 6500 సీట్లు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విభాగంలో పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను 613 నుంచి 1249కి పెంచామని వివరించారు హరిశ్‌రావు. రాష్ట్రంలోనే సరిపడినన్ని సీట్లు ఉంటే విద్యార్థులు చైనా, రష్యా, యుక్రెయిన్, మలేషియా లాంటి దేశాలకు వెళ్లే అవసరం రాదన్నారు. సమైక్య రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్,ఆదిలాబాద్‌లలో మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కలిపి 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.