మంత్రి అప్పలరాజుకు మావోయిస్టుల వార్నింగ్
పేదల భూములను కబ్జాచేసే అనుచరులను..
అదుపులో ఉంచుకోవాలంటూ హెచ్చరిక లేఖ
బాబు, ఎర్రన్నాయుడు, మాధవరెడ్డిల ప్రస్తావన
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మావోయిస్టుల వార్నింగ్ లేఖ ఉత్తరాంధ్రలో కలకలం రేపుతోంది. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ…. నిషేధిత విప్లవ సంస్థ నుంచి అప్పలరాజుకు హెచ్చరికలు వెళ్లాయి. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలంటూ..మావోలు ఓ లేఖ విడుదల చేయడం అలజడి రేపుతోంది. కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భూకబ్జాలపై ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ మావోయిస్టు కమిటీ పేరుతో ఇటీవల లేఖ విడుదలైంది. దీనిపై మంత్రి తీవ్రంగా స్పందించారు. పార్టీ విడుదల చేసిన లేఖను ప్రచారం చేసిన వారిపై చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ, మరో లేఖ విడుదలైంది. అయితే, ఈసారి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ వైవియస్ కార్యదర్శి అశోక్ పేరుతో రిలీజ్ అయింది.
మావోయిస్టు పార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రికి…ఆయన వత్తాసు పలుకుతున్న వారికి ప్రజలే బుద్ది చెబుతారంటూ లేఖలో అన్నలు హెచ్చరించినట్లుగా ఉంది. ఇక, అదేసమయంలో ఎర్రన్నాయుడుపైనా, అలిపిరిలో చంద్రబాబుపై దాడి విషయం, మంత్రి మాధవరెడ్డిని అంతమొందించిన విషయం తెలిసే మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా అంటూ గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నవారు ఏ రాజకీయ పార్టీ అయినా మావోయిస్టు పార్టీ ముందు ఒకటేనని గుర్తుంచుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా శత్రువులకు పట్టిన గతే మీకు కూడా పడుతుందంటూ హాట్ కామెంట్స్ చేసారు. మావోయిస్టు ప్రజాసంఘాల నాయకులుగా చెలామణి అవుతున్న దుష్ట చతుష్టయం… మంత్రికి లోపాయికారిగా ఇస్తున్న సలహాలు, సూచనలు, సహకారాలు మానుకోవాలని హితవు పలికారు.
వృత్తిరీత్యా డాక్టర్ అయిన అప్పలరాజు……శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతిపక్షంపై విమర్శలు చేయడం ద్వారా జగన్ దృష్టిని ఆకర్షించారు. మంత్రివర్గంలో చోటు సంపాదించారు. తన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోచాలా మందిని తప్పించిన జగన్…అప్పలరాజును మంత్రి కొనసాగించారు. ఇటీవల అప్పలరాజు వ్యవహారంపై విపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు ఎదురు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మావోయిస్టు లేఖలోని అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి చెబుతున్నారు. ఒక అసమ్మతి నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.