మునుగోడు నియోజకవర్గంలో రెండు నెలల్లో ఓటు హక్కు కోసం 25వేల దరఖాస్తులు ఎలా వచ్చాయని తెలంగాణ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దరఖాస్తుల వివరాలు, ఓటర్ల జాబితా తమకు సమర్పించాలని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై గురువారం విచారణ మొదలయ్యింది. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది రచనారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని వాదించారు. ఫారం 6 ప్రకారం కొత్తగా 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారు. పలు మండలాల్లో భారీగా ఓటర్ల నమోదు జరిగింది. ఇప్పటికే ఉప ఎన్నిక షెడ్యూల్ విడులైందని, నవంబర్ 3న ఎన్నిక జరగబోతోందని ఆమె వాదించారు. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. మునుగోడు నియోజకవర్గంలో జనవరి 2021 వరకు 2 లక్షల 22 వేల ఓట్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 2లక్షల 38 వేలకు చేరిందన్నారు. కొత్తగా నమోదైన 25 వేల ఓట్లలో ఏడు వేల ఓట్లు తొలగించామని వివరించారు. తుది ఓటర్ల జాబితా ఇంకా ఈసీ ప్రకటించలేదని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు
ఓటర్ల దరఖాస్లులు, ఓటర్ల జాబితా తమకు సమర్పించాలని ఈసీని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.