రాజ్యాంగమా? రాజకీయమా ? ఏపీ ఐఏఎస్‌లు తేల్చుకోవాల్సిందే !

By KTV Telugu On 6 May, 2022
image

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారులకు వరుసగా జైలు శిక్షలు పడుతున్నాయి. బతిమాలుకునో.. బామాలుకునో శిక్షలను వాయిదా వేయించుకోవడం … తర్వాత ఏదో విధంగా పిటిషన్ల ద్వారా శిక్ష దాకా వెళ్లకుండా చేసుకోవడం చేస్తున్నారు. కానీ వారికి శిక్షలయితే పడుతున్నాయి. ఈ శిక్షలు ఊరకనే పడటం లేదు. న్యాయస్థానాలను ధిక్కరించడం వల్లనే పడుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలు ధిక్కరించడం అంటే అడ్డగోలుగా వ్యవహరించడం… తాము ఏ రాజ్యాంగం ప్రకారం ఉద్యోగంలో ఉన్నారో ఆ రాజ్యాంగాన్ని లెక్క చేయకపోవడం. దీనంతటికి కారణం రాజకీయమే. కానీ ఆ రాజకీయాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. కానీ వారు ఆ రాజకీయానికి లొంగిపోయారు.

రూల్స్ గీల్స్ జాన్తా నై.. పాలకులు ఏది చెబితే అది చేస్తున్న అధికారులు !

ఏపీలో కొన్నాళ్లుగా రాజ్యాంగాన్ని నియమ నిబంధనలు.. చట్టాల్ని పాటించకుండా జీవోలు ఇచ్చి అమలు చేసుకోవచ్చన్న పాలనను కొనసాగిస్తున్న ఐఏఎస్ అధికారులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రతీ రోజూ హైకోర్టులో ఉన్నతాధికారులు కనిపించని సందర్భమే ఉండటం లేదు. ఇటీవల వరుసగా శిక్షలకూ గురవుతున్నారు. వారు ఎంత చట్ట వ్యతిరేక పాలన చేస్తున్నారో ఇదే సాక్ష్యం. ఈ పరిస్థితి ఇప్పుడు కాదు గత మూడేళ్ల నుంచి ఉంది. అయినా ఒక్కరంటే ఒక్క ఐఏఎస్ అధికారిలోనూ మార్పు రావడం లేదు. ఎందుకిలా జరుగుతోందంటే చెప్పడం కష్టం.

రాజ్యాంగం గురించి తెలుసుకునే వచ్చారు కదా !

ఐఏఎస్‌లు అంటే అత్యున్నత స్థాయిలో శిక్షణ పొందిన అధికారులు. రాజ్యాంగం పట్ల స్పష్టమైన అవగాహనతో విధులు నిర్వహించేవారు. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం… ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి ఎన్ని ఎజెండాలు ఉన్నా.. అధికారులు మాత్రం రాజ్యాంగపరంగానే నిర్ణయాలు తీసుకోవాలి. అమలు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే…చేయడం సాధ్యం కాదని నిర్మోహమాటంగా చెప్పాలి. అయినా చేయమని ఒత్తిడి తెస్తే … చేసేస్తే బలయ్యేది తామేనని ఐఎఎస్‌లు మాత్రమే. ప్రభుత్వానికి భయపడటమా.. విధేయత చూపడమో చేయడం రాజ్యాంగ విరుద్ధమే. అప్పుడు ఏపీ ఐఏఎస్‌లు అదే దారిలో ఉన్నారు

శిక్షలకు గురవుతున్నా మారరా !?

ఐదేళ్లకో సారి పాలకులు మారిపోతారు. కానీ అధికారులు ఎప్పుడూ ఉంటారు. వారు ఏం చేసినా ఐఏఎస్‌ల ద్వారానే బండి నడిపించుకోవాలి. ఐఏఎస్‌లు రూల్స్ ఎగ్గొట్టి.. పోస్టింగ్‌ల కోసం రాజకీయ నేతల ఆలోచనలకు తగ్గట్లుగా వ్యవహరించడం ప్రారంభిస్తే అంతిమంగా జరిగేది ప్రజలకు నష్టమే. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. అయ్యా… ఎస్‌ల దెబ్బకు రాష్ట్రం పరువు పోతోంది. మేలుకోకపోతే.. మొత్తం వ్యవస్థకే నష్టంజరుగుతుంది.