KTV Telugu ;- కొత్తగూడెం ఎమ్మెల్యే వ్యవహారంతో అధికార బీఆర్ఎస్ కు వచ్చిన తంటా ఏమిటి ? త్వరగా ఎన్నికలొస్తే బావుండని ఎమ్మెల్యేలు ఎందుకనుకుంటున్నారు. అందరూ ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారా. అందరి కేసులు సీరియస్ గా తీసుకునే టైమ్ కోర్టులకు ఉందా..
వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించడం బీఆర్ఎస్ కు నిజంగానే తలనొప్పిగా మారింది. విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్న తరుణంలోనే అధికార పార్టీకి పెద్ద సమస్య వచ్చిపడింది. ముందూ వెనుక చూసుకోకుండా లెక్కకోసం వనమా లాంటి వారిని చేర్చుకుంటే ఇప్పుడు మొదటికే మోసం వచ్చే దుస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు, కేసులు ఉన్నవారి లెక్క తీస్తే బీఆర్ఎస్ లో కనీసం 30 మంది ఉంటారని తేలింది. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య అయినప్పుడు వాటి నుంచి బయట పడటం కూడా కష్టమే అనిపిస్తోంది.
ముందూ వెనుకా చూసుకోకుండా ప్రజాబలం ఉన్నదని, సొంతంగా గెలవగల సత్తా ఉన్నదని అనిపించిన ప్రతి నాయకుడిని ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి ఫిరాయింపజేసి చేర్చుకుంటే, సొంత పార్టీలో ముసలం పుట్టడం తప్ప మరొక పర్యవసానం ఉండదు. ఈ సంగతి తెలంగాణలోని భారత రాష్ట్ర సమితికి కాస్త ఆలస్యంగానైనా అర్థమై ఉంటుంది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గులాబీ దళంలో ఒక ఆశ పుట్టింది. ఆ ఎన్నికల్లో తమ పార్టీ హవాకు ఎదురొడ్డి గెలిచిన వారందరూ ప్రజాబలం ఉన్న వారేననే అభిప్రాయం ఏర్పడింది. కాంగ్రెసులోని అలాంటి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఏకంగా 12 మందిని తమ జట్టులో కలిపేసుకుంది. ఈ లోపే జలగం వెంకట్రావు కేసు వేయడం ఆ కేసు కోర్టులో కొనసాగి ఇప్పుడు తీర్పు రావడం జరిగిపోయాయి. తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని జలగం వెంకట్రావు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఆ విషయం ఇంకా పెండింగ్ లో ఉంది. అదీ ఒక కోణం మాత్రమే మరి మిగతా 30 మంది పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న
ప్రస్తుతం 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2018 ఎన్నికల సమయంలో తమ అఫిడవిట్లలో గోల్ మాల్ చేశారని ఆరోపణలు వినిపించాయి. ఫిర్యాదులు వచ్చాయి. కేసులు నమోదయ్యాయి. అఫిడవిట్లో చేర్చకుండా కొన్ని విషయాలు దాచడం, ఎన్నికల సమయంలో భారీగా నగదు పంపిణీ చేయడం, కౌంటింగ్ కేంద్రాల్లోకి దూరి గందరగోళం సృష్టించడం లాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. 2018 ఎన్నికల తర్వాత 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 34 ఫిర్యాదులు ఈసీ వద్ద నమోదయ్యాయంటే వాస్తవానికి, అభ్యర్థులు దాఖలు చేసిన వివరాలకు ఎంత ఏడా ఉండో అర్థం చేసుకోవచ్చు. మహబూబ్ నగర్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో అయితే రెండేసి ఫిర్యాదులు ఉన్నాయి. ఇక జనగామ, కొడంగల్, మంచిర్యాల, కోదాడ, ఆలేర్, వేములవాడ, ధర్మపురి, నాగర్ కర్నూలు, హుస్నాబాద్, తుంగతుర్తి, వికారాబాద్, గద్వాల, పటాన్ చెరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై సీరియస్ ఆరోపణలే ఉన్నాయి. గెలిచిన అభ్యర్థుల ఎన్నిక చెల్లదని ప్రత్యర్తులు కోర్టులో కేసులు వేశారు. కేవలం 440 ఓట్ల మెజార్టీతో గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహారంపై ఒకటి రెండు వారాల్లో హైకోర్టు తీర్పు రావచ్చు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై పౌరసత్వ కేసు ఇంకా కొనసాగుతోంది. ఇవన్నీ ఒక వంతయితే సీఎం కేసీఆర్ పై నమోదైన కేసు మరో వంతు. గజ్వేల్ ఎన్నికల అఫిడవిట్లో సీఎం కేసీఆర్ పూర్తి వివరాలు సమర్పించలేదని, తనపై ఉన్న క్రిమినల్ కేసుల ప్రస్తావన చేయలేదని అదే ప్రాంతానికి చెందిన టీ. శ్రీనివాస్ ఆరోపించారు. సీఎం వెంటనే రాజీనామా చేయాలని కూడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2018 ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిపోయారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ గెలిచిన అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఆయన కేసు వేశారు. అది విచారణలోనే ఉంది. ఏదేమైనా డిసెంబర్ నాటికి తాజా ఎన్నికలు పూర్తయి కొత్త అసెంబ్లీ కొలువు దీరుతుంది. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారు మళ్లీ గెలవొచ్చు..గెలవకపోవచ్చు. కాకపోతే వారి నేరాలు రుజువైతే మాత్రం అభ్యర్థుల రాజకీయ జీవితంపైనా, పార్టీపైనా మాయని మచ్చ పడుతుంది. అందుకే ఇప్పుడో డిమాండ్ వినిపిస్తోంది. తప్పు చేసి పదవి కోల్పోయిన వారు జీవితంలో మరో సారి ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం ఉండాలన్నది కొందరి డిమాండ్. మరి అది సాధ్యమేనా
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి