టార్గెట్ ఇమ్రాన్.. ఆ కారణం నమ్మేలా లేదు!
ఇమ్రాన్ మర్డర్ ప్లాన్.. పొలిటికల్ మోటివ్ ఉందా!
పులిమీద స్వారీ చేసే పాకిస్తాన్‌లో మరోసారి కీలక నేత లక్ష్యంగా తూటాలు పేలాయి. ఈసారి టార్గెట్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. మాజీ క్రికెటర్‌గా కూడా పాపులారిటీ ఉండటంతో ఇమ్రాన్‌పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉండటంతో కాలిలో తూటా దిగి ప్రాణాలతో బయటపడ్డారు ఇమ్రాన్‌ఖాన్. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ అనుచరుడు ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. పాక్‌లో ముందస్తు ఎన్నికలకు డిమాండ్ చేస్తూ నిర్వహించిన ర్యాలీలో కాల్పులతో కలకలం రేగింది.
పాకిస్తాన్‌లో ముందస్తు ఎన్నికల డిమాండ్‌తో అక్టోబరు 28న ఇమ్రాన్‌ఖాన్ లాంగ్‌మార్చ్ ప్రారంభించారు. పంజాబ్ రాష్ట్రంలోని వజీరాబాద్ అల్లాహోచౌక్‌లో ఇమ్రాన్ కంటైనర్ ఎక్కి అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన పాతికేళ్ల నవేద్‌ని వెంటనే పట్టుకున్నారు. ఒకప్పుడు బెనజీర్ భుట్టో కూడా ఇలాగే ప్రచారంలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇమ్రాన్‌కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. లాంగ్‌మార్చ్ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అందుకే ఆయన్ని చంపాలనుకున్నానని వాంగ్మూలమిచ్చాడు నిందితుడు.
కాల్పులు జరిపిన యువకుడికి ఏ రాజకీయ పార్టీతో, ఉగ్రవాద సంస్థతో సంబంధాలు లేవు. నమాజ్‌కోసం ఆజాన్ వస్తున్నప్పుడే ఇమ్రాన్‌ఖాన్ కంటైనర్‌నుంచి పాటలు వినిపించటంతో నిందితుడు తుపాకీ ఎక్కుపెట్టాడు. తనవెనుక ఎవరూ లేరని నిందితుడు నవేద్ చెబుతున్నా ఇమ్రాన్‌ఖాన్ మాత్రం దీన్ని కుట్రగానే అనుమానిస్తున్నారు. హత్యాయత్నం వెనుక ప్రధాని షెహబాజ్, మంత్రి రానా సనయుల్లాఖాన్, ఆర్మీ మేజర్ జనరల్ ఫైసల్ నజీర్ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
ఇమ్రాన్‌ఖాన్‌పై ఆటోమేటిక్ ఆయుధంతో హత్యాయత్నం జరగటంతో ఇమ్రాన్‌పార్టీ నేతలు దీనివెనుక పెద్ద కుట్ర ఉందంటున్నారు. కాల్పులను ఖండించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తక్షణమే నివేదిక అందించాలని ఆదేశించారు. అనివార్యంగా ప్రధాని పదవినుంచి తప్పుకున్న ఇమ్రాన్‌ఖాన్ మళ్లీ పట్టుసాధించే ప్రయత్నాల్లో ఉండగా ఈ కాల్పులు జరగటం పాక్ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్‌లో ఆర్మీకూడా తెరవెనుక చక్రం తిప్పుతుంటుంది. అందుకే ఇమ్రాన్‌ని టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందని అంతా అనుమానిస్తున్నారు.