డ్రాగన్ కంట్రీ వాస్తవాధీన రేఖను అతిక్రమిస్తోంది. చైనా బలగాలు తరచూ అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొచ్చుకొస్తున్నాయి. ఉన్నతస్థాయి సమీక్షలు జరుగుతున్నా రెండు దేశాల సరిహద్దులో తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పాకిస్తాన్‌కంటే ప్రమాదకరంగా మారింది చైనా. దీంతో చైనా సరిహద్దులపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. చైనాతో మనదేశానికి 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. చైనా సరిహద్దుల్లోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో లడఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో మౌలిక సదుపాయాలను పెంచడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై భారత్ దృష్టి సారించింది. మనకు స్నేహపూర్వక పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. మయన్మార్లకు అనుసంధానించే ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోంది.
చైనాతో భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చని భారత్ ఊహిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా బార్డర్లో వేగంగా మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. 2014లో చుమర్‌లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కయ్యానికి కాలుదువ్వింది. 2017లో డోక్లాంలో చైనా సైన్యం సరిహద్దు వెంట బలగాలను మోహరించినప్పటినుంచి రెండు దేశాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. 2020 ఏప్రిల్ నుంచి నియంత్రణరేఖలో రెండుదేశాల మధ్య ప్రతిష్ఠంభన ఉంది. 45 ఏళ్ల తర్వాత గాల్వాన్‌లో హింసాత్మక సంఘటనతో చైనా సరిహద్దుల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందేనని భారత్ నిర్ణయించుకుంది. అందుకే భారీగా మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది.
రోడ్లు, వంతెనలు, సొరంగాల ద్వారా కనెక్టివిటీని మెరుగుపరచబోతోంది భారత్. హైవేలు, వంతెనలు, అంతర్గత జలమార్గాలు, రైలు మార్గాలు, విద్యుత్ లైన్లు, ఇంధన పైపులైన్లతో పొరుగు దేశాలకు క్రాస్ బోర్డర్ కనెక్టివిటీని మెరుగుపరచాలన్నది మన దేశ వ్యూహం. అన్ని సరిహద్దు క్రాసింగ్‌ల దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల నిర్మాణంతో పాటు పొరుగు దేశాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడమే కాకుండా స్వయంగా కొన్ని నిర్మాణాలను మన దేశం చేపడుతోంది. 2014 నుంచి 2022 వరకు చైనా సరిహద్దు ప్రాంతాలలో గతంకంటే రెట్టింపు రోడ్లను నిర్మించడం సరిహద్దు భద్రతావ్యూహంలో భాగమే.
నేపాల్, బంగ్లాదేశ్‌లకు రైల్వే లింక్‌లు, మహాకాళి మోటరబుల్ వంతెన, త్రిపుర- బంగ్లాదేశ్ మధ్య మైత్రి సేతు, కలదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ వంటి ప్రాజెక్టులు ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. 158 కిలోమీటర్ల జలమార్గం, సిట్వే పోర్ట్ ప్రాజెక్ట్. మిజోరాంకు రహదారి వీటిలో కీలకమైనవి. భారత్‌లోని మోతీహరి- నేపాల్ అమ్లేఖ్గంజ్ మధ్య దక్షిణాసియాలో మొదటి క్రాస్-బోర్డర్ పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్ నిర్మితమవుతోంది. బంగ్లాదేశ్‌తో హైస్పీడ్ డీజిల్ పైప్‌లైన్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని పసాఖాలోని భూటాన్ డ్రై పోర్ట్ కూడా చైనా సరిహద్దుల బలోపేతంలో భాగమేనంటోంది భారత్. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో విద్యుత్, మయన్మార్, శ్రీలంక దేశాల్లో ఓడరేవులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై భారత్ చర్చలు జరుపుతోంది. చైనాపై ఓకన్నేసి ఉంచుతూనే దాని చుట్టుపక్కల ఉన్న దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నది భారత్ వ్యూహం.