మీరు అప్పు ఎక్కువ చేస్తున్నారని రాష్ట్రాలను కేంద్రం నిలదీస్తోంది. మీరేమైనా తక్కువ చేస్తున్నారా? అని కేంద్రాన్ని రాష్ట్రాలు నిలదీస్తున్నాయి. అయితే రాష్ట్రాలు.. కేంద్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు రుణాలు ఊబిలో చిక్కుకున్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఇవి అప్పులు చేయడం మాత్రమే కాదు తీర్చలేని స్థితిలోకి వెళ్తున్నాయని ఫలితంగా ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచ దేశాల అప్పు రూ. 23,100 లక్షల కోట్లు!
సంపాదనకు తగ్గట్లుగా అప్పు చేస్తే సమస్య ఉండదు. కానీ ప్రభుత్వాలు సంపాదనను పట్టించుకోకుండా అప్పులు చేస్తున్నాయి. ఇది ప్రమాదకర స్థితికి చేరిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరించింది. చేసిన రణాలకు సంబంధించి వాయిదాల చెల్లింపుల కోసం ఆయా దేశాల్లో కీలకమైన ప్రభుత్వ సేవలకు కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొన్నది. దాదాపు 100కు పైగా దేశాలు రుణ వాయిదాల చెల్లింపు కోసం కీలకమైన ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యంపై వ్యయాన్ని తగ్గించుకోనున్నాయని ప్రకటించారు. ప్రపంచ దేశాల మొత్తం రుణాలు 2021 నాటికి 303 ట్రిలియన్ డాలర్ల సుమారుగా రూ.23100 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంత క్రితం గ్లోబల్ డెట్ 226 ట్రిలియన్ డాలర్లుగాఉంది. రుణాలు ఒక్క ఏడాదిలో రికార్డ్‌స్థాయిలో మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈస్థాయిలో అప్పులు ఎప్పుడూ పెరగలేదని ఐఎంఎఫ్ చెబుతోంది
అప్పుల ఊబిలో కేంద్రం, రాష్ట్రాలు !
దేశంపై రుణభారం అధికంగా ఉంది. రాష్ట్రాలు కూడా తక్కువ తేవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లెక్కల ప్రకారం 2021 మార్చ్ చివరికల్లా కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం అప్పు రూ. 106,36,983.95 కోట్లు ఉంటుంది. మార్చ్ 2014 చివరికల్లా భారత దేశం యొక్క మొత్తం అప్పు రూ. 55,87,149.33గా ఉండేది. స్వల్పకాలంలోనే రెట్టింపు అప్పు చేశారన్నమాట. ఇక తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుల పరిమితి వాడేసి.. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్‌డిఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్‌డ్రాఫ్ట్ వంటివి నెలలో ఇరవై రోజులు వాడుకోవాల్సిన దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం రోజువారీ అవసరాలకు సరిపోనప్పుడు ఇవి ఆర్‌బీఐ వద్ద స్వల్పకాలానికి ఈ మూడింటిలో ఏదైనా ఒక సౌకర్యం ద్వారా అప్పుచేస్తుంటాయి. ఈ సౌకర్యాలను అత్యధిక రోజులు ఉపయోగించుకున్న రాష్ట్రాలు వడ్డీ రూపంలో ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. అంటే దివాలాకు దగ్గరగా ఉండటం అన్నమాట. ఏపీ దీనికి తగ్గరగా ఉంది.
మాంద్యం ముంగిట ప్రపంచం !
కోవిడ్‌కు ముందే గ్లోబల్ డెట్ పెద్ద మొత్తంలో ఉంది. కానీ కోవిడ్ తర్వాత అది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మూడో ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలపై రుణ ప్రభావం తీవ్రస్థాయిలో ఉండబోతోందని ప్రపంచ బ్యాంక్ పరిశోధన కూడా తెలిపింది. భారీ స్థాయిలో ఉన్న రుణాల చెల్లింపు కోసం 100కుపైగా దేశాలు విద్య, వైద్యం, సామాజిక భద్రత.. మొదలైనవాటిపై కోతలు విధించాల్సిన పరిస్థితి వచ్చిందని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. అల్పాదాయ దేశాల్లో 60శాతం రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి. సమస్యను ఉక్రెయిన్ సంక్షోభం మరింత పెంచింది. గ్లోబల్ డెట్‌లో తక్కువ ఆదాయమున్న దేశాలు చేసిన అప్పులు, కుటుంబ రుణాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అంటే.. ప్రపంచం మాంద్యం ముంగిట ఉంది. ఎప్పుడు విరుచుకుపడుతుందో చెప్పడం కష్టమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.