ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము విజయం మరింత సునాయాసమైందా ?రోజుకో పార్టీ ఆమెకు మద్దతిస్తుందా ? ఆమెను బరిలోకి దించడం ద్వారా ప్రధాని మోదీ… ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టారా ? విపక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలే సొంత పార్టీ నేతల మాట వినే పరిస్థితి లేదా ? వార్ వన్ సైడ్ అయినట్లేనా… ?
రాష్ట్రపతి ఎన్నికలో కాక రేగింది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై సింపుల్ మెజార్టీతో గెలుస్తారనుకుంటే.. ఇప్పుడు భారీ విజయం దిశగా ఆమె దూసుకెళ్తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ముర్ముకు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ వ్యూహకమిటీ తీర్మానించింది. సామాజిక కోణంలో ఆమెకు మద్దతిస్తున్నట్లు, టీడీపీ నిత్యం వెనుకబడిన, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. శివసేన ఏంపీలు కూడా ఇప్పుడు ముర్ము వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమెకు ఓటేసేందుకు అనుమతించాలని 18 మంది ఎంపీలు తమ నేత ఉద్ధవ్ ఠాక్రేకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ ఉండదు కనుక.. ఠాక్రే మొండి పట్టు పట్టినా ప్రయజనం ఉండదు. ఇక ఉత్తర ప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ చిన్నాన్న ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ కూడా ముర్ముకే మద్దతిస్తున్నారు.
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. ఓటింగ్ బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది.ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 776 ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉంటే.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీయేకి 49%, యూపీయేకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. ఎలక్టోరల్ కాలేజ్ మొత్తం ఓట్ల విలువ దాదాపు 10.86లక్షలుంటే, అందులో బిజెపికి లక్షదాకా మెజారిటీ ఉంటుందనే అంచనాలున్నాయి. బిజెపికి 5.42లక్షల ఓట్లు వస్తాయని భావిస్తుంటే, విపక్షాలకు 4.49 లక్షల ఓట్లుంటాయని భావిస్తున్నారు.ఎంపీ ఓటు విలువ 700ఉంటే, ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రానికి ఒకలా ఉంటుంది.
ఎలక్టోరల్ కాలేజీలో అన్ని ఓట్లు పోలైతే, గెలవాల్సిన అభ్యర్థికి 5లక్షల 49 వేల 452 ఓట్ల విలువ రావాల్సి ఉంటుంది. అయితే 13 పార్లమెంట్ స్థానాలు ఖాళీగా ఉంటే, రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏ ప్రత్యర్థి పార్టీలకు ఎమ్మెల్యే ఓట్లు 2.77లక్షలున్నాయి. అటు ఎన్డీఏ పార్టీలకున్న ఎమ్మెల్యేల ఓటు విలువ 2.22లక్షలు మాత్రమే. అయితే పార్లమెంట్ లో మాత్రం ఎన్డీఏకి 3.20 లక్షల ఓట్ల విలువ ఉంది. విపక్షాలకు 1.72 లక్షల ఓట్ల విలువ మాత్రమే ఉంది. ఎంపీల ఓటు విలువ అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంది. కానీ, రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంది. రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించి, వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ. దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగనణలోకి తీసుకుంటారు. దీనిప్రకారం ఏపీలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ159. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 27,825. ఇటు తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఓట్ల విలువ 15,708గా తేల్చారు..
ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ద్వారా మోదీ… తన ప్రత్యర్థులందరినీ దెబ్బకొట్టారనే చెప్పాలి. ఆదివాసీ మహిళను నిలబెట్టి తూర్పు రాష్ట్రాల్లో ఆమెకు మద్దతు కూడగడ్డారు ముర్ము ఒడిశా వాసి కావడంతో నవీన్ పట్నాయక్ వెంటనే ఆమెకు మద్దతివ్వాల్సి వచ్చింది. పైగా ఒడిశాలో ఆదివాసీలు ఎక్కువ. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తాను తప్పులో కాలేశానని ఒప్పుకున్నారు. ఎన్డీయే అభ్యర్థిని కాస్త ముందే ప్రకటించి ఉంటే… సమీకరణాలు వేరుగా ఉండేవని ఆమె అనడం.. ముర్ముకు మద్దతిచ్చేవారమన్న అర్థాన్ని ధ్వనించింది. ఇప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ లో క్రాస్ ఓటింగ్ జరగదని చెప్పలేం.