భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు.. అసలేంటీ జీ20?

By KTV Telugu On 17 December, 2022
image

జీ20 శిఖరాగ్ర సదస్సు-2023 నిర్వహణ బాధ్యతను భారత్‌ భుజాలకెత్తుకుంది. ఇండోనేసియానుంచి ఈ కీలక బాధ్యతను మన దేశం స్వీకరించింది. అధికారికంగా డిసెంబర్ 1 నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలను సభ్యదేశాలు భారత్‌కు అప్పగించాయి. మన దేశ అధ్యక్షతన జీ 20 మొదటి ఆర్థిక, సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం బెంగళూరులో 2022 డిసెంబర్ 13,14,15 తేదీల్లో జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మిగిలిన కీలక సమావేశాలు జరుగుతాయి. ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం 2023 ఫిబ్రవరి 23,24,25 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది.

1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం అనంతరం ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి ఓ వేదికగా ఏర్పడ్డాయి. 1999 బెర్లిన్‌లో తొలిసారి జీ20 సదస్సు నిర్వహించారు. UNO, WHOలా జీ20కి ప్రపంచంలో ప్రధాన కార్యాలయం అంటూ ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తే ఆ దేశమే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అన్ని ఏర్పాట్లు చూసుకుంటుంది. మన దేశం ప్రతిపాదించిన ఒక విశ్వం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు విధానం జీ20 ఫైనాన్స్ ట్రాక్ సమావేశంలో చర్చకొస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫైనాన్స్ ట్రాక్ సమావేశాలు జరుగుతాయి. చర్చకొచ్చే అంశాలను జీ20 అగ్రనాయకుల సంయుక్త ప్రకటనలో చేరుస్తారు.

ప్రపంచవ్యాప్తంగా పెనుసవాళ్లు ఎదురవుతున్న సమయంలో మన దేశం జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. కరోనా సవాళ్లు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సంక్షోభ పరిస్థితులు, ఆహారం, ఇంధన రంగంలో సమస్యలు, పెరుగుతున్న రుణభారం, ద్రవ్యోల్బణం, నిధుల కొరత లాంటి సవాళ్ల సమయంలో జీ20 అధ్యక్ష బాధ్యతలు తీసుకుంది. అన్ని సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి అనుసరించాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన వ్యూహాలకు రూపకల్పన చేసి సభ్య దేశాలకు జీ20 మార్గదర్శకంగా పనిచేస్తుంది. అర్జెంటీనా నుంచి యూరోపియన్ యూనియన్ దాకా ముఖ్య దేశాలకు జీ20లో సభ్యత్వం ఉంది. మనల్ని దొంగదెబ్బ తీయాలని చూసే చైనా వంటి దేశాలు కూడా ఈ కూటమిలో ఉన్నాయి. అయితే జీ20 గ్రూప్‌లో పాకిస్తాన్ లేకపోవడం ఊరటనిచ్చే అంశం. మన దేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, కెనెడా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్​, దక్షిణ కొరియా, రష్యా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, గ్రేట్​ బ్రిటన్, యూరోపియన్​ యూనియన్​జీ20లో సభ్యదేశాలుగా ఉన్నాయి. 2008 నుంచి ‌‌ శాశ్వత ఆహ్వానిత దేశంగా స్పెయిన్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచవ్యాప్త జీడీపీలో 85శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతం, పరిశోధనల ఖర్చులో 85 శాతం వాటా ఈ దేశాలదే. అంటే జీ20 ప్రపంచంలోని బలమైన ఆర్ధిక శక్తుల కూడలిగా చెప్పొచ్చు.

ఐక్యరాజ్యసమితి, వరల్డ్‌ బ్యాంక్‌, డబ్ల్యుహెచ్‌వో, ఐఎంఎఫ్‌, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూటీవో, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లు జీ20 సదస్సులో పాలుపంచుకుంటాయి. ప్రధానంగా విస్తృతమైన ఆర్థిక అంశాలతో కూడిన అజెండాను చర్చిస్తాయి. సమకాలీన అంశాలను కూడా చేరుస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ మార్కెట్లు, పన్నుల విధానాలు, ఆర్థిక విధానాలు, అవినీతిపై పోరాటం వంటి అంశాలపై జీ20 సదస్సు వేదికగా చర్చలు జరుగుతుంటాయి. పర్యావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటివి కూడా ఎజెండాలో ఉంటాయి. జీ20 అధ్యక్ష బాధ్యతలు రొటేషన్‌లో వచ్చిపోతుంటాయి. అయితే మనం బాధ్యత తీసుకున్నప్పుడు ఎంత సమర్ధంగా ప్రస్తావించామో, పరిష్కారమార్గం చూపించామో అన్నదే ముఖ్యం. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల కూటమిగా ఉన్న జీ20 సదస్సు అధ్యక్ష బాధ్యతలకు భారత్‌ న్యాయం చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.