దేశాన్ని దోచేస్తున్న చైనా కంపెనీలు

By KTV Telugu On 30 July, 2022
image

చైనా అంటేనే అవినీతికి అడ్డదారులకు పర్యాయపదంగా మారిపోయిందా.. డ్రాగన్ కంట్రీ ఎక్కడ అడుగు పెట్టినా… స్వాహా స్వామ్యానికి తెర తీస్తోంది.. భారత్ లోనూ చైనా కంపెనీలు తమ ఆగడాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నాయా.. పన్నులు ఎగవేస్తూ నిధులను స్వదేశానికి తరలిస్తున్నాయా.. ఎన్ఫోర్స్ మెంటు దాడుల్లో బయటపడిన అంశాలేమిటి…

చైనా అన్ని రకాలుగా భారత్ ను ఇబ్బంది పెడుతోంది. సరిహద్దుల్లో డోక్లాం తరహా పరిస్థితులను సృష్టించి నిత్యం డిఫెన్స్ లో పడేస్తున్న డ్రాగన్ దేశం.. ఆర్థిక రంగంలోని ఇండియాను దెబ్బతీస్తోంది. చైనీస్ మొబైల్ కంపెనీలపై ఈడీ దాడుల సందర్భంగా అనేక కీలకాంశాలు వెలుగు చూశాయి. దేశంలో మొబైల్ ఫోన్ల రంగం వేగం పుంజుకుంటున్న తరుణంలో అక్కడే ఎక్కువ పిండెయ్యాలని చైనా నిర్ణయించుకుని ఇప్పుటికే వేల కోట్లు సరిహద్దులు దాటించింది. వివో ఇండియా, హువే, షామీ కంపెనీలకు భారత మొబైల్‌ ఫోన్ల మార్కెట్లో  గట్టి పట్టును పెంచుకుని మార్కెట్ షేర్లో అగ్రగామిగా ఉన్నాయి. వివో ఇండియా సంస్థ మన దేశంలో ఇప్పటి వరకు లక్షా 25 వేల కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జించగా… నాలుగేళ్ల కాలంలో 62 వేల కోట్లు చైనాకు తరలించింది. పైగా నష్టాలు చూపి పన్నులు ఎగవేసినట్లు ఈడీ నిర్థారించింది. ఈ క్రమంలో 50 శాతం సొమ్మును తరలించినట్లయ్యింది.

వివో మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా అదే తీరున నడుస్తున్నాయ్. హువే ఇండియా కూడా తన మాతృ సంస్థకు అక్రమంగా 750 కోట్ల మొత్తాన్ని మళ్లించినట్లు భారత ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. భారత్లో ఆదాయం తగ్గినట్లు చూపించడం.. వాటిని బినామీ లావాదేవీలతో చైనాకు తరలించడం నిత్యకృత్యమైంది. షామీ సంస్థ కూడా 5 వేల కోట్ల రూపాయలను చైనాలోని మాతృ సంస్థలు తరలించింది. దీనితో బ్యాంక్ ఖాతాలను సీజ్ చేస్తే…. భారత్లోని చైనా రాయబారికి కోపమొచ్చింది. దాడులు న్యాయపరంగా సాగుతాయని నమ్ముతున్నట్లు సన్నాయి నొక్కులు నొక్కారు. ఇంకా చాలా చైనా కంపెనీలు, వాటికి అనుబంధంగా నడిచే భారత ఏజెన్సీలు కూడా నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించి నల్లధనాన్ని పోగు చేసుకుంటున్నాయి. జంప్ మంకీ లాంటి సంస్థలు ఇలాంటి కార్యక్రమాలకు తెరతీశాయి.

ఈడీ దాడులు జరుగుతాయని ముందే కనిపెట్టిన చైనా కంపెనీల పెద్దలు పలాయనమయ్యారు. వివో, హువే లాంటి కంపెనీలు విలీనాలను చూపిస్తే అంకెల గారడీని ప్రదర్శిస్తోంది. వ్యాపార లెక్కలు మార్చేస్తున్న చైనా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు .. తమ నిధులను లోన్ యాప్ కంపెనీలకు మళ్లిస్తున్నాయి. ట్రూతై ఫైనాన్స్, గోరూపీ ఇన్ఫిటెక్, బైనేస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి లోన్ యాప్స్ నేరుగా చైనా కనుసన్నల్లో నడుస్తున్నాయి. లోన్ యాప్ ఆగడాలకు  తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో జనం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చైనీయుల వ్యాపారాలు బయటపడకుండా ఉండేందుకు భారత సిమ్ కార్డులనే వాడుతున్నారు. ఇటీవలి కాలంలో ఫేక్ నేమ్స్ తో వెయ్యి సిమ్ కార్డులు పొంది వాటిని చైనా తరలించినట్లు గుర్తించారు. వాటితో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం వల్ల నిందితులను పట్టుకోవడం దుర్లభమవుతోంది. మరో 1500 సిమ్ కార్డులను చైనా తరలించే క్రమంలో సంబంధిత వ్యక్తులు ఈడీ అధికారులకు చిక్కారు.

చైనా అమ్మాయిలను ఎరగా వేసి భారత అధికారులను లోబరుచుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తాయి. చైనాలో అందాల పోటీల్లో గెలిచిన అమ్మాయిలను అధికారులకు ఆన్ లైన్లో పరిచయం చేయడం, వారితో వాట్సాప్ ముచ్చట్లు పెట్టించడం యథాలాపంగా జరిగిపోతోంది. తర్వాత అధికారులను బ్లాక్ మెయిల్ చేసి కావాల్సిన సమాచారాన్ని అందుకుంటున్నారు. అగ్రగామి విద్యా సంస్థలైన ఐఐటీల్లో పరిశోధనా కార్యక్రమాలకు చైనా కంపెనీలు ఫండింగ్ చేస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్ కొంతకాలం క్రితం హువేతో  ఒప్పందం చేసుకుంది. ఐఐటీ బోంబే, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఢిల్లీ కూడా ఈ దిశగా అడుగులు వేశాయి. ప్రజల్లోకి త్వరగా చేరే సోషల్ మీడియా సంస్థలకు నిధులు సమకూర్చి తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నాయి. పైగా లోన్ యాప్ సంస్థల కబంద హస్తాల్లో చిక్కుకున్న వారి వ్యక్తిగత సమాచారం మొత్తం చైనీయుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దీనితో రాండమ్ గా కూడా మరికొంత సమాచారం చేరే అవకాశం ఉందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు….

భారత వ్యతిరేక ప్రచారానికి కూడా చైనా వెనుకాడటం లేదు. ఇండియా ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిందని చైనా రేడియో కథనాలు వండి వార్చుతోంది. ఇలాంటి చర్యలను భారత ప్రభుత్వమూ, ప్రజలు తిప్పికొట్టకపోతే అనర్థం తప్పదు….