రా..రా…బంగారం నువ్వొస్తేనే బతుకుతాం బ్యాటింగ్ సింగారం…

By KTV Telugu On 22 April, 2022
image

నువ్వే రావాలి.. నువ్వే కావాలి.. నువ్వే లేకుంటే మేము లేము.. నువ్వు రాకుంటే క్రికెట్ చూడలేము.. మా బతుకు ఇడ్లీ సాంబార్ లేని తమిళుడిలా..హలీం లేని రంజాన్ నెలలా, ఆవకాయ దొరకని ఆంధ్రుడిలా.. డోక్లా తినని గుజరాతీలా తయారైంది. ఇకనైనా ఆదుకో.. నిలబడు.. నిలబెట్టు.. లేకపోతే మా బతుకు వేస్తు.. మాకళ్లకు చత్వారం వస్తేనే బెస్టు… అని పలు రకాలుగా జనం వేడుకుంటున్నారు.. ఇంతకీ అభిమాని జనం అయన్ను ఏం కోరుతున్నారు.. అందుకు ఆయన ఒప్పుకుంటారా.. ఓ సారి చూద్దాం…..

ఆయన తమిళుడు కాదు. అయినా నిన్నటి కాదా చెన్నై టీమ్ కు సారథి. ఈ సారి మాత్రం ఆర్డినరీ ప్లేయర్. ఆ టీమ్ కు ఒక కెప్టెన్ ఉన్నాడు. చెప్పకునేందుకు పెద్ద పెద్ద ప్లేయర్లే ఉన్నాయి. అందరూ వృద్ధ జంబుకాల్లా మారినట్లున్నారు. ఆడలేక వరుస పరాజయాలకు కారణమవుతున్నారు. ఈ సారి ఐపీఎల్లో ఆడిన ఆరు మ్యాచుల్లో గెలిచిందొక్కటే.. గురువారం ముంబైతో ఏడో మ్యాచ్ జరిగింది. దొందుదొందే కదా… మ్యాచ్ చూసేదేముంది… అని కొందరు టీవీ కట్టేశారు. మరికొందరు చానెల్ మార్చేశారు. మహీ అభిమానులు మాత్రం ఆశగా మొత్తం చూశారు. వారి ఆశలు అడియాశలు కాలేదు. ఇక పరాజయమే మిగిలిందనుకున్న తరుణంలో ఒంటి చేత్తో జార్ఖండ్ డైనమేట్ గెలిపించాడు.. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా… మహేంద్రుడు ఒక్కడే 16 పరుగులు చేసి విజయ తీరాలకు చేర్చారు. ఆఖరి బంతికి బౌండరీ బాది గెలిపించాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు కన్నీళ్లు తెప్పించాడు. ధోనీ వీరోచిత బ్యాటింగ్ తో ఇప్పుడు చెన్నై అభిమానుల్లో కొత్త డిమాండ్ వినిపిస్తోంది….

ధోనీ ఉంటేనే సాధ్యం…

ఇండియన్ క్రికెట్ కు ధోనీ స్పెషల్. వికెట్ కీపర్ కెప్టెన్ గా మహేంద్రుడు అన్ని రికార్డులను అధిగమించాడు. తొలి టీ – 20 ప్రపంచ కప్ ను ఒంటి చేత్తో భారత్ కు అందించాడు. చానాళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ గెలిపించాడు. మ్యాచ్ మ్యాచ్ కు వ్యూహం మార్చే సత్తా ఉన్న లెజండరీ క్రికెటర్ ధోనీ. ఇప్పుడు చెన్నై అభిమానులు, ధోనీ వీరాభిమానులు కోరుకుంటున్నదొక్కటే. జరిగిందేదో జరిగిపోయింది.. మళ్లీ చెన్నై టీమ్ సారథ్య బాధ్యతలు తీసుకోవాలని ధోనీ అభిమానులు వేడుకుంటున్నారు.. ప్రస్తుత కెప్టెన్ జడేజా.. జట్టును నడిపించలేకపోతున్నారన్న వాదన రోజురోజుకు బలపడుతోంది.

చెన్నై టీమ్ ఆడిన ఏడు మ్యాచుల్లో రెండు మాత్రమే గెలిచింది. మిగిలిన మ్యాచుల్లో ఒకటి రెండు మినహా… మిగతావి ఘనవిజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. ఆ పని జరగాలంటే… ధోనీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జడేజా కూడా అర్థం చేసుకుని సహకరిస్తాడని ధోనీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ముంబై మ్యాచ్ లో ధోనీ ఆడిన తీరును చూస్తే ఫుల్ ఫార్మ్ లోకి వచ్చినట్లేనని చెప్పాలి. నాయకుడు ఫార్మ్ లో ఉంటే జట్టులోని మిగతా వారికి కొండంత అండగా ఉంటుంది. మరి అభిమానుల కోరికను ధోనీ తీరుస్తాడో లేదో చూడాలి..