సెక్స్ వర్కర్లకూ హక్కులుంటాయ్ ..

By KTV Telugu On 27 July, 2022
image

వ్యభిచార వృత్తిపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలేంటి.. వ్యభిచారాన్ని ప్రభుత్వాలు చట్టబద్ధం చేయకపోవడానికి కారణాలేమిటి.. మన  దేశంలోనూ, హైదరాబాద్లో ఉన్న పరిస్థితులేమిటి… ఓ సారి చూద్దాం…

వ్యభిచారం చట్టబద్ధమైన వృత్తేనని సుప్రీం కోర్టు కుండబద్దలు కొట్టింది.  గౌరవంతోపాటు, చట్టం కింద సమాన రక్షణ పొందడానికి సెక్స్‌ వర్కర్లు అర్హులేనని తెలిపింది. సెక్స్‌ వర్కర్ల హక్కులను పరిరక్షిస్తూ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పలు సూచనలు చేసింది. చట్ట ప్రకారం సమాన రక్షణ పొందడానికి సెక్స్‌ వర్కర్లకు అర్హత ఉంది. సెక్స్‌ వర్కర్‌ మేజర్‌ అయి ఉండి, ఇష్టపూర్వకంగా వృత్తి నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు జోక్యం చేసుకోకూడదు. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకూడదు. బ్రోతల్‌ హౌస్‌లో ఇష్టపూర్వకంగా జరిపే సెక్స్‌ వర్క్‌ చట్ట వ్యతిరేకమేమీ కాదు. అందువల్ల బ్రోతల్‌ హౌస్‌పై రైడ్‌ చేసినప్పుడు సెక్స్‌ వర్కర్ల అరెస్టులు, జరిమానా విధించడం, వేధించడం, ఇతరత్రా చర్యలు చేపట్టకూడదు. బ్రోతల్‌ హౌస్‌ను నడపడం మాత్రం చట్టవ్యతిరేకమే. నిర్వాహకులను అరెస్టు చేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. తల్లి సెక్స్‌ వర్క్‌ చేస్తోందన్న కారణం చూపి బిడ్డను ఆమె నుంచి వేరు చేయకూడదు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహా నగరంలో సెక్స్ వర్కర్లు పెరిగిపోతున్నారని పోలీసు వర్గాలే ధృవీకరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్, సాఫ్ట్ వేర్ రంగాలు అభివృద్ది చెందడం.. జనం చేతిలో నగదు పెరగడంతో పక్కచూపులు చూడడమే వ్యభిచార పరిశ్రమ విస్తరించడానికి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు… తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి సెక్స్ వర్కర్లు హైదరాబాద్ తరలి వస్తున్నారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ అమ్మాయిలు కూడా హైదరాబాద్ వచ్చి వ్యభిచార వృత్తిలో స్థిరపడుతున్నారు. హైదరాబాద్ లో పది వేల మంది వరకు సెక్స్ వర్కర్లు ఉండవచ్చని ఒక అంచనా. మరో పక్క దేశంలో ఆరున్నర లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని మహిళా కమిషన్ 2016లో నిగ్గు తేల్చింది. అయితే ఆ వృత్తిలో మూడు కోట్ల మంది వరకు ఉంటారని అనధికార వర్గాలు తేల్చాయి. పైగా విదేశాల నుంచి కొందరు పర్యాటకులు సెక్స్ వర్కర్ల కోసమే ఇండియా వస్తున్నారట. దానితో మన దేశం సెక్స్ టూరిజానికి కేంద్రంగా మారుతోందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి..

నిజానికి ఈ భూ ప్రపంచం మీద వ్యభిచారం అత్యంత పురాతన వృత్తిగా చెప్పాలి. విజయనగర సామ్రాజ్యకాలంలోనే వ్యభిచార గృహాలుండేవని చరిత్రకారులు చెబుతారు. అందుకే వ్యభిచారాన్ని వృత్తిగా చేపట్టిన వారికి తగిన సంరక్షణలు కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వ్యభిచారాన్ని చట్టబద్దం చేసిన పక్షంలో సెక్స్ వర్కర్లకు అన్ని హక్కులు వస్తాయి. వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. సెక్స్ వర్కర్ల పిల్లలకు ప్రభుత్వం విద్యా, వైద్య సదుపాయం లాంటివి కల్పించాలి. సెక్స్‌ వర్కర్లు ఇచ్చే ఫిర్యాదులపై పోలీసులు వివక్ష చూపకూడదు. ముఖ్యంగా తమపై లైంగికపరమైన దాడి జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మెడికో-లీగల్‌ రక్షణ సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. జీవనోపాధి కోల్పోయిన వేశ్యలకు ప్రభుత్వం పెన్షన్ లాంటి సౌకర్యాలు కల్పించాలి.

భారతీయ శిక్షా స్మృతి ప్రకారం బహిరంగ ప్రదేశాలకు 200 మీటర్ల దూరంలో సెక్స్ వర్క్ చేస్తున్నా, విటులను ఆకర్షిస్తున్నట్లు చూసినా వారిని వెంటనే అదుపులోకి తీసుకోవచ్చు. నిజానికి అమెరికాలో కూడా దాదాపు అన్ని చోట్ల వ్యభిచారాన్ని నిషేధించారు. ఒక్క నెవెడా రాష్ట్రంలోని 9 కౌంటీల్లో మాత్రం సెక్స్ వర్క్ చేసుకోవచ్చు. అయినా అమెరికా మొత్తం అందరూ చూస్తుండగానే సెక్స్ వర్కర్లు బహిరంగంగా తిరుగుతుంటారని, విటులను ఆహ్వానిస్తుంటారని చెబుతుంటారు. మసాజ్ సెంటర్ల పేరుతోనూ, కాజినోల మాటున అక్కడ వ్యభిచారం జరుగుతుంది. ఇక జర్మనీ, ఆస్ట్రియా సహా ఎనిమిది ఐరోపా దేశాల్లో  సెక్స్ వర్క్ చట్టబద్దమే.. సెక్స్ వర్క్ క్రిమినల్ చర్య కాదని ఈ  ఏడాది జూన్ 1న బెల్జియం ప్రభుత్వం చట్టం చేసింది. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్డామ్ ను సెక్స్ టూరిజం కేంద్రంగా పరిగణిస్తున్నారు. ఐరోపా దేశాల్లో సెక్స్ వర్కర్లు క్రెడిట్ కార్డు పేమెంట్ కూడా తీసుకుంటున్నారంటే ఎంత అత్యాధునికంగా ఉంటున్నారో చూడొచ్చు.. వాళ్ల ఇళ్లలో ఫ్రంట్ ఆఫీసులు  కూడా ఉంటాయి. ప్రభుత్వం వారికి అన్ని హక్కులు కల్పిస్తోంది. కొన్ని ఐరోపా దేశాలు ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నాయి..

రష్యా దండయాత్ర కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పేదరికం పెరిగిపోయింది. దానితో అక్కడ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లుగా మారారు. పేదరికం మనిషిని వ్యభిచారం వైపుకు తీసుకెళ్తుందనేందుకు ఉక్రెయిన్ ను తాజా ఉదాహరణగా తీసుకోవచ్చు. అందుకే గత్యంతరం లేక ఆ వృత్తిలోకి దిగుతున్న వారిని చట్టం అన్ని విధాలుగా ఆదుకోవాలి. వేరు పునరావాసం కల్పించడం మరీ మంచిది..