డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయా ? అమెరికా ఉద్యోగాలు ఎండమావులవుతున్నాయా ? టెకీలంతా ఇంటి దారి పడుతున్నారా ? మళ్లీ విమానం ఎక్కడం అంత సులభం కాదా ? ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది ?
వాచ్ దిస్ కేటీవీ స్పెషల్.
చెదిరిపోతున్న డాలర్ డ్రీమ్స్.
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు.
2020లో 60 వేల ఉద్యోగాలు ఫట్.
ఇంటర్నెట్ వాడకంలో తగ్గుదల కూడా కారణమే.
ఆర్థిక మాంద్య భయంతో ఉద్యోగాల్లో కోత.
ఖర్చులు తగ్గించుకుంటున్న కంపెనీలు.
హెచ్1బీ వీసాదారులకు తప్పని ఇక్కట్లు.
60 రోజుల్లో ఉద్యోగం వెదుక్కోకపోతే రిటర్న్.
ఇండియా వచ్చేస్తే వెళ్లడం కష్టం.
వీసా ఇంటర్వ్యూకు ఏడాది నిరీక్షణ.
పెళ్లిళ్లు కాక నానా అవస్థలు.
పిల్లనిచ్చేందుకు ముందుకు రాని తల్లిదండ్రులు.
ఆర్థిక మాంద్యం అవస్థలకు కారణమవుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీలు వెనుకడటం లేదు. అంతవరకు అంకితభావంతో పనిచేసిన వారి పట్ల కూడా ఉదారభావం ప్రదర్శించడం లేదు. ఇంతకాలం మనతోనే ఉన్నాడన్న కనికరం కనిపించడం లేదు. అమెరికాలో భారతీయ ఉద్యోగులకు యాజమాన్యాలు ఎగ్జిట్ డోరు చూపిస్తున్నాయి. మీ సేవలు మాకు అవసరం లేదని చెప్పేస్తున్నాయి. ఈ క్యాలెండర్ సంవత్సరం తొలి అర్థభాగంలో 22 వేల ఉద్యోగాలు పోయాయి. నెట్ ఫ్లిక్స్, రాబిన్ హుడ్ తో పాటు పలు క్రిప్టో కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. అడిగితే వ్యవస్థను హేతుబద్ధీకరించామని చెబుతున్నాయి. కాయిన్ బేస్, వాల్డ్, బైబిట్, బిట్ పాండా లాంటి సంస్థలు పూర్తిగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.
డిసెంబరు ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగాలు కల్పోయిన భారతీయుల సంఖ్య 60 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2008 నాటి ఆర్థిక మాంద్యం తర్వాత ఇంతటి దుస్థితిని చూడలేదని కంపెనీలే అంగీకరిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, మెజాన్, మెటా, స్ట్రైప్, ట్విటర్ సంస్థలు ఉద్యోగులను తొలగించడమే పనిగా పెట్టుకున్నాయి. ట్విటర్ ను టేకోవర్ చేయకముందే ఎలెన్ మస్క్ తమ కంపెనీల్లో పది శాతం వర్క్ ఫోర్స్ ని తగ్గించారు. ఇప్పుడు ట్విటర్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని పంపించేసే ప్రయత్నంలో ఉన్నారు. నెట్ ఫిక్స్ ఇప్పుడు సెకెండ్ రౌండ్ జాబ్ కట్స్ ను మొదలెట్టింది. మరో రెండు నెలల కాలంలో 10 నుంచి 12 వేల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతారని అమెరికన్ గణాంకాలు చెబుతున్నాయి.
నిజానికి కరోనా కాలంలోనే ఉద్యోగాలు పెరిగాయి. 2020లో మెటా సంస్థలో 58 వేల మంది పనిచేసేవారు. కొవిడ్ కాలంలో అది 87 వేలకు పెరిగింది. టెక్నాలజీలో దూసుకుపోయిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థల్లో కూడా ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. ఇంటర్నెట్ వినియోగం పెరగడమే సంస్థల్లో ఉద్యోగులు పెరిగడానికి కారణమైంది. ఇంటర్నెట్ ఆధారిత సేవల కోసం ఉద్యోగులను నియమించారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గిపోవడం రోజువారీ ఇంటర్నెట్ వాడకంలో తగ్గుదల కనిపించడంతో ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. కంపెనీల ఆర్థిక వృద్ధి రేటుపై ప్రభావం చూపడంతో వారు ఉద్యోగులకు టాటా చెప్పేస్తున్నారు. ఈ- కామర్స్ వృద్ధి రేటు కొనసాగుతుందని అంచనా వేసి భంగపడ్డామని మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. తప్పులో కాలేసినట్లు అంగీకరించారు.
సాఫ్ట్ వేర్, టెక్నాలజీ రంగంలో పనిచేసిన వారికి ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగాలు వెదుక్కోవడం కుదరడం లేదు. భారతీయులు నానా తంటాలు పడుతున్నారని బ్లూమ్ బర్గ్ నివేదిక నిగ్గు తేల్చింది. హెచ్ వన్ బీ వీసాతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి నరకం కనిపించడం ఖాయమంటున్నారు. అమేజాన్, మెటా, ట్విటర్, సేల్స్ ఫోర్స్ లాంటి కంపెనీలు గత మూడేళ్లుగా 45 వేల మందిని హెచ్ వన్ బీ వీసా కోసం స్పాన్సర్ చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేక చేతులెత్తేశాయి. దానితో వారంతా అమెరికాలో ఉండిపోవడం కుదరని పని అవుతోంది.
హెచ్ వన్ బీ వీసాదారుడు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కోవాలి. లేని పక్షంలో అమెరికా వదిలేసి వెళ్లిపోవాలి. ఒక్కసారి ఇండియా వచ్చేస్తే మళ్లీ అమెరికా ఫ్లైట్ ఎక్కడం అంత సులభం కాదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా అమెరికా వీసా ఇంటర్వ్యూకు ఏడాది పడుతోంది. అంటే ఏడాది తర్వాత వీసా తీసుకుని అమెరికా వెళ్లాల్సి ఉంటుంది. ఇంతలో పుణ్యకాలం గడిచిపోతుందని యువత గగ్గోలు పెడుతోంది. అమెరికా నుంచి తిరిగొచ్చిన వారికి ఇండియాలో ఉద్యోగం దొరకడం కూడా కష్టమవుతోంది. ఆమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందన్నభయంతో భారతీయ ఐటీ కంపెనీలు కూడా నియామకాలను నిలిపేయడం లేదా బాగా తగ్గించుకోవడం ప్రారంభించాయి. అమెరికాలోనే ఉంటూ 60 రోజుల్లో ఉద్యోగం వెదుక్కునే ప్రయత్నంలో చాలా మంది విఫలమవుతున్నారు. ఇంటర్వ్యూలకు పిలిచే కంపెనీలు తర్వాత ఉద్యోగాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయని బ్లూమ్ బర్గ్ సర్వే నిగ్గు తేల్చింది. పైగా పెద్ద కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లేందుకు కొంతకాలం సాధన అవసరం ఇంతలోనే చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి జనం భికారీలుగా మారుతున్నారు.
ఆర్థిక మాంద్య భయం కుటుంబాల మీద కూడా ప్రభావం చూపుతోంది. యువతకు పెళ్లిళ్లు కావడం లేదు. కొంతకాలం ఆగి చేసుకుందాములే అన్నకున్న వారికి ఇప్పుడు ఎవరూ పిల్లనివ్వడం లేదు. లక్షల డాలర్లలో జీతం ఉందంటూ పిల్లనిచ్చేందుకు ఎగబడిన వాళ్లు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. కోట్ల ఆస్తి ఇస్తామని వెంటబడిన వాళ్లు ఇప్పుడు ఏమీ వద్దు పెళ్లి ఖర్చుకు కూడా మేమే పెట్టుకుంటామని మగపెళ్లి వారు చెప్పినా పిల్లనిచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మంచి ఉద్యోగం, చేతి నిండా డబ్బు ఉంది, జాబ్ గ్యారెంటీ ఉందని చెప్పినా విశ్వసించడం లేదు. దానితో పెళ్లిళ్లను 2024 వరకు వాయిదా వేసుకోవాలని పెళ్లికాని ప్రసాదులు, వాళ్ల తల్లిదండ్రులు డిసైడ్ అవుతున్నారు. పెళ్లిళ్ల వైబ్ సైట్లలో నమోదు చేసుకున్నా స్పందించిన వాళ్లు లేరని అమెరికా పేరు చెబితేనే భయపడుతున్నారని పెళ్లీడు దాటి పోతున్న యువకులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతానికి చేయగలిగింది కూడా ఏమి లేదంటున్నారు.