పెళ్లికి ముందు శృంగారం ఆ దేశంలో నేరం. దీన్ని అనైతికచర్యగా భావిస్తూ ఇండోనేషియా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. పెళ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా చట్టాన్ని ఆమోదించింది. పెళ్లికి ముందే శృంగారం విషయంలో ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇండోనేషియాలో కొత్త చట్టంతో దాన్నిక నేరపూరిత చర్యగానే పరిగణిస్తారు.
భర్త లేదా భార్య కాని వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఇండోనేషియాలో దాన్ని వ్యభిచారంగానే పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్ఠంగా సంవత్సరం జైలు శిక్ష లేదా గరిష్ఠ జరిమానా విధిస్తారు. భర్త లేదా భార్య లేదా వారి పిల్లల నుంచి ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తారు. ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభంకాకముందే ఫిర్యాదులను ఉపసంహరించుకునే అవకాశం కూడా కల్పించారు. గతంలోనే ఇండోనేషియా ఈ విధానాన్ని తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆందోళనలకు దిగటంతో అప్పుడు వెనక్కితగ్గిన ఇండోనేషియా ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు కొత్త బిల్లును తీసుకొచ్చింది.
ఇండోనేషియా విలువలను కాపాడేందుకే ఈ క్రిమినల్ కోడ్ అమల్లోకి తెచ్చామంటోంది అక్కడి ప్రభుత్వం. ఇండోనేషియా పౌరులతో పాటు దేశంలోని విదేశీయులకు కూడా ఇది వర్తిస్తుంది. అతి పెద్ద ముస్లిందేశం ఇండోనేషియాకు షరియా చట్టాలను కఠినంగా అమలు చేయని ఉదారవాద దేశంగా పేరుంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఛాందసవాదం పెరుగుతోంది. వివాహానికి ముందు సెక్స్‌ని నిషేధించే ఈ కొత్త చట్టానికి అతివాద గ్రూపులు మద్దతిస్తున్నాయి. మహిళలు, స్వలింగ సంపర్కులపై ఇప్పటికే ఇండోనేషియా ఎన్నో ఆంక్షలు విధించింది.
కొత్త చట్టం వివాహేతర సెక్స్‌తో పాటు అవివాహిత జంటల సహజీవనాన్ని కూడా నేరంగానే పరిగణిస్తుంది. ఇండోనేషియా కొత్త చట్టంపై అప్పుడే నిరసనలు మొదలయ్యాయి. ఇరాన్‌లో ప్రజాందోళనకు తలొగ్గి అక్కడి పాలకులు మోరల్ పోలీసింగ్‌ని వెనక్కి తీసుకున్న సమయంలోనే ఇండోనేషియా ఛాందసవాద చట్టంతో కొరడా ఝళిపించింది.