ఏది తినేటట్టు లేదు. ఏది కొనేటట్టు లేదు.. అనేది ఒక సినిమా పాట. నాటి నుంచి నేటి వరకు సామాన్యుడి నెత్తిన ధరల భారం ఎలా స్వైరవిహారం చేస్తుందో చెప్పేందుకు ఈ పాట చాలనిపిస్తోంది. ప్రపంచం విస్తరించి ఆదాయాలు పెరిగాయని సంతోషించే లోపే.. ధరలు ఆకాశాన్ని అందుకుని… సామాన్యుడి ఆర్థిక స్థితిని పాతాళానికి నెట్టేస్తున్నాయి. కొనే స్తోమత లేక నడ్డివిరిగిన జనం మూలుగుతూ ముక్కుతూ కాలం వెళ్లదీస్తున్నారు….
యాభై రూపాయలు లేనిదే కిలో బియ్యం రావడం లేదు. వంట నూనెలు కిలో రూ.200 టచ్ అయ్యింది. రూ. 80 ఇస్తేనే కిలో టమాట వస్తోంది. పచ్చి మిర్చీ పావు కిలో ఇవ్వాలంటే ముందు పాతిక కొట్టు అని వ్యాపారులు అంటున్నారు. పెట్రోల్ లీటర్ 120 దాటింది. డీజీల్ కూడా శరవేగంగా పరుగులు తీస్తోంది. చమురు ధరల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పరోక్షంగా పడుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఏప్రిల్లో 7.79% ద్రవ్యోల్బణం
దేశంలో ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరింది. ఈ దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆందోళన నిజమైందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. గత ఎనిమిది సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం ఇంత స్థాయిలో ఎన్నడూ పెరగలేదు. 2014 మే నెలలో 8.33 శాతంగా ఉండేది. నిజానికి ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉంటే ధరలను అదుపు చేసే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంకు పలుమార్లు సూచించినా… ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇక రిటైల్స్థాయిలో ధరల స్థాయిని సూచించే వినిమయ ధరల సూచీ …సీపీఐ…ఈ ఏప్రిల్లో కొత్త రికార్డుస్థాయి 170.1 పాయింట్ల వద్దకు చేరడంతో ఆర్థిక నిపుణుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
ధాన్యాగారానికి ఏమైంది ?
నిజానికి ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి రష్యా కేవలం ఉక్రెయిన్ మీదే యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పరోక్షంగా అన్ని దేశాలపై ఆర్థిక యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ నుంచి సరఫరాలు బయటకు రాకుండా అడ్డుకోవడం ద్వారా ఇతర దేశాలను ఇరకాటంలో పెడుతోంది. అసలే కరోనాతో అల్లాడుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా యుద్ధం రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. పుండు మీద కారం చల్లినట్లుగా పరిస్తితి తయారైంది. ఉక్రెయిన్, రష్యా రెండు దేశాలను ప్రపంచ ధాన్యాగారంగా పిలుస్తారు. అక్కడ నుంచి ఆహార ధాన్యాల సరఫరా ఆగిపోయింది. ఈ రెండు దేశాలు కలిపి ప్రపంచానికి 30 శాతం గోధుమను సరఫరా చేస్తున్నాయి. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు 25 శాతం మేర పెరిగినట్లు అధికార అంచనాలు చెబుతున్నాయి. .అయితే ధరల్లో 35 శాతం పెరుగుదల ఉండి ఉండొచ్చని అనధికార వర్గాల సమాచారం.
సుదీర్ఘ యుద్ధం సాగితే..
ఉక్రెయిన్, రష్యా యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే.. ప్రపంచం అన్ని రకాలుగా సంక్షోభంలో పడిపోయే ప్రమాదాలే ఎక్కువగా ఉంది. ఇప్పటికే గోధుమ, మొక్కజొన్న, వంటనూనెల సరఫరా నిలిచిపోయింది. తూర్పు ఐరోపాకు ఎగుమతులతో పాటు, అక్కడ నుంచి దిగుమతులు ఆగిపోయి..ప్రపంచ దేశాలకు పేమెంట్స్ ప్లాబ్లమ్ వస్తోంది. ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితులు అనేక ప్రపంచ దేశాల్లో కనిపించే ప్రమాదం ఉంది. ఆసియా, ఆఫ్రికాలోని పేద దేశాలకు గడ్డుకాలం తప్పకపోవచ్చు. ప్రపంచంలో 69 కోట్ల మంది తిండికి లేక అలమటిస్తున్నారని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. మరో పక్క ఇతర దేశాలు కూడా యుద్ధంలోకి దిగాల్సిన అనివార్యత ఏర్పడితే… పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదమూ ఉంది. యుద్ధంతో దేశాల ఆర్థిక స్థితిగుతులు పూర్తిగా దెబ్బతింటాయి.
ఇబ్బందుల్లో భారత్
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా భారత్ కూడా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. ద్రవ్యోల్బణం పరుగులు పెట్టగా.. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. గడచిన వారం మొత్తం మార్కెట్లు నెగిటివ్ గానే ముగిశాయి. ఐదు ట్రేడింగ్ సెషన్స్ లో మదుపర్ల 19 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఉన్న షేర్లను వదిలించుకునేందుకే జనం మొగ్గుచూపుతున్నారు. సంస్ఘాత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లపై ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల ఆర్థిక స్థితి కూడా దిగజారిపోయింది. లాభాల్లో ఉన్న జాతీయ బ్యాంకులు ఇప్పుడు త్రైమాసిన నష్టాలను చవిచూస్తున్నాయి….