బిహార్ కంటే తెలంగాణ తీసిపోయిందా ద్రవ్యోల్పణంలో తెలంగాణ అగ్రభాగాన ఉండటానికి కారణం ఏమిటి పాలకుల తప్పిదమా.. దేశ వ్యాప్తంగా ఎదురైన సమస్యల ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందా..
తెలంగాణకు మరో సమస్య వచ్చి పడింది. వరుసగా రెండు నెలలు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. మే నెలలో 9 పాయింట్ నాలుగు ఏడు శాతం ఉన్న ద్రవ్యోల్బణం.. జూన్ నెలలో పది శాతానికి చేరింది. ఒకప్పుడు వెనుకబడి రాష్ట్రంగానూ, అరాచక రాష్ట్రంగానూ ఉన్న బిహార్లో కూడా జూన్ ద్రవ్యోల్బణం 4 పాయింట్ ఏడు శాతమే ఉంది. జూలై నెలలో కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న వార్తలు మినహా తెలంగాణ రాష్ట్రానికి వేరే ఉరట కనిపించడం లేదు.
నిజానికి అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్.. ఇలా చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య. పేద, ధనిక, అభివృద్ధి చెందిన – చెందుతున్న దేశాలనే తారతమ్యం లేకుండా ద్రవ్యోల్బణం దెబ్బకొడుతోంది. అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. అన్ని రకాల వస్తువులతో పాటు తినుబండారాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సగటు మనిషికి బతుకు భారమవుతోంది. తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తున్నా.. ఇతర రాష్ట్రాల కంటే పరిస్థితి కాస్త దారుణంగా ఉందని చెప్పడానికి సందేహించకూడదు. మరో ఆరు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే నియంత్రణ కూడా అసాధ్యమవుతుంది. తెలంగాణలో పదిశాతం ద్రవ్యోల్బణం ఉంటే మహారాష్ట్రలో 8 పాయింట్ ఐదు రెండు శాతం, ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది పాయింట్ రెండు ఏడు శాతం, జార్ఖండ్ లో ఏడు పాయింట్ ఐదు రెండు శాతం ద్రవ్యోల్పణం ఉంది..
ద్రవ్యోల్బణానికి, ధరలకు విడదీయరాని సంబంధం ఉంది. మే, జూన్ నెలల్లో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయి. కూరగాయలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఏ కూర చూసినా కిలో యాభై రూపాయల పైనే ఉండటంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. ఒక దశలో టమాట 80 రూపాయలకు చేరడం కూడా వినియోగదారుల జేబులకు చిల్లు పడటానికి కారణమైంది. అందుకే టమాట ధరలు తగ్గిన నేపథ్యంలో జూలైలో ద్రవ్యోల్బణం అదుపుకు వస్తుందని ఆర్థికవేత్తలంటున్నారు.
వినియోగదారుల సూచీ ప్రకారం కూడా తెలంగాణ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. అది 180 పాయింట్ల దరిదాపుల్లో ఉంది. 2012 లెక్కలతో పోల్చితే.. ప్రజల నెల వ్యయం 80 శాతం పెరిగింది. ఈ ఏడాది మే నెలతో పోల్చితే జూన్ లో మూడు శాతం పెరిగిందని చెప్పాలి. ముడి సరుకు ధరలు పెరగడం కారణంగా ఇన్ పుట్ కాస్ట్స్ పెరిగాయి. కోడి దాణా ధరలు అదుపులో లేని కారణంగా కోడిగుడ్డు, చికెన్ ధరలు పెరిగాయి. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాలి..
పరిపాలనా ఖర్చుపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోతోందా. గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వమే మార్కెట్లో కొనుగోలు చేసి మనిషికి రెండు కిలోల చొప్పున విక్రయించింది. ఈ సారి తెలంగాణ సర్కారు అలాంటి చర్యలేమీ చేపట్టలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టమాటాల విషయంలో అలా చేసి ఉండాలని కొందరంటున్నారు. పైగా మార్కెట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వ చర్యలు లేవు, వంట నూనెల ధరలు పెరిగాయి. కేంద్రం జోక్యంతో వంట నూనెలధరల తగ్గే అవకాశాలు వస్తున్నప్పటికీ…జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జనం జేబులు ఖాళీ అయి వారి అప్పులు పెరిగిపోయాయి. నిజానికి ప్రభుత్వం పూనుకుని డిమాండ్ తగ్గించేందుకు సప్లై పెంచాల్సిన అనివార్యత ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోగలిగితే.. అక్కడ వినియోగంపై వత్తిడి తగ్గి… సాధారణ ద్రవ్యోల్బణం అదుపుకు వచ్చే అవకాశం ఉంది…