ఇతర పార్టీల నుంచి చేరికలు సంతోషాన్నివ్వాలి. మన పార్టీ బలోపేతమవుతుందన్న ఆనందాన్ని పంచాలి. అందరం కలిసి అధికారం దిశగా నడుద్దామన్న నినాదంతో పనిచేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నేతలు వస్తున్నారంటే వణుకు, భయం, ఆందోళన, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. మరి అలా ఎందుకు జరుగుతోంది. అసలు కారణం ఏమిటి…..
ఎన్నికలు రాకపోయినా తెలంగాణలో ముందస్తు చర్చ జరుగుతోంది. దీంతో ఎక్కడ ఎవరు పోటీ చేస్తారన్న చర్చ ఊపందుకుంది. ప్రస్తుతమున్నపార్టీలో టికెట్లు దక్కుతాయని నమ్మకం లేని వాళ్లు…పక్క చూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో జంప్ జిలానీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత ఎన్నికల తర్వాత అధికార టీఆర్ఎస్ లో చేరిపోయిన వాళ్లు కూడా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడంతో వారిలో ఆశలు చిగురించాయి. కాంగ్రెస్ నామినేషన్ దక్కితే అసెంబ్లీలో ప్లేస్ ఖాయమన్న విశ్వాసంతో గాంధీ భవన్ దగ్గర క్యూ కడుతున్నారు. ఇదే ఇప్పుడు హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది…
టీఆర్ఎస్ లో ప్రతీ నియోజకవర్గానికి లీడర్లు ఎక్కువై పోయారు. కేసీఆర్ చల్లని చూపు ఎవరి మీద పడుతుందో… ఎవరికి మొండి చేయి చూపిస్తారో అర్థం కావడం లేదు. దానితో నేతలు వలసల బాట పట్టారు.
టీఆర్‌ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, జడ్పీ ఛైర్‌పర్సన్ అయిన తన భార్య భాగ్యలక్ష్మితో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచే హస్తం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సైతం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లో పీజేఆర్ తనయ విజయారెడ్డి వచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడానికి అనేక కారణాలున్నాయి. కాంగ్రెస్ లో చేరడం, మళ్లీ చేరడం చాలా సులభం. బీజేపీలో నాయకత్వంతో సర్దుకుపోవడం కష్టం. అందుకే బీజేపీ కంటే కాంగ్రెస్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు..
పార్టీ టికెట్ ఇస్తామన్న హామీతో కొందర్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్న చర్చ మొదలైంది. ఈ పరిణామం ఇప్పుడున్న ఆశావహులకు ఆగ్రహం తెప్పిస్తోంది. విజయారెడ్డి చేరిక తరువాత ఖైరతాబాద్ టికెట్ వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ సీటు నుంచి గతంలో పోటీ చేసిన దాసోజు శ్రవణ్ మరోసారి ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సీటు ఈసారి తనకు దక్కుతుందని రోహన్ రెడ్డి అనే కాంగ్రెస్ నేత సైతం భావిస్తున్నారు. అలాంటిది ఉన్నట్టుండి విజయారెడ్డి పార్టీలోకి రావడంతో.. వీరిద్దరూ అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ దక్కడం కష్టమని గ్రహించిన తాటి వెంకటేశ్వర్లు.. కాంగ్రెస్ లో చేరిపోయారు. దీనిపై ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన సీనియర్ నేత భట్టి విక్రమార్క నొచ్చుకున్నారు. తనకు మాట మాత్రమైనా చెప్పకుంటా చేర్చుకున్నారని పలువురి దగ్గర వాపోయారట. ఎన్నికల నాటికి ఈ అసంతృప్తి ఎటు దారి తీస్తుందో చూడాలి. తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ వడ్డేపల్లి రవి కాంగ్రెస్‌లో చేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కానీ రవి చేరికను తుంగతుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ అద్దంకి దయాకర్ వ్యతిరేకిస్తున్నారు. 2018 ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసిన డాక్టర్ రవిని కాంగ్రెస్ ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. అన్నీ మరిచిపోయి చేర్చుకోవడమేంటని దయాకర్ ప్రశ్నిస్తున్నారు.
హుస్నాబాద్ లో అలిగిరి ప్రవీణ్ రెడ్డి.. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓడిపోయారు. తర్వాత గులాబీ గూటికి చేరుకున్నారు ప్రవీణ్‌రెడ్డి. అయితే రెండు దఫాలుగా హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ నుంచి వొడితల సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. దీంతో అధికారపార్టీలో టికెట్ రాదనుకుని ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సహా పలువురు నేతలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. మీటింగులు పెట్టుకుని మరీ తీర్మానాలు చేయడం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్థన్ తో ఆయనకు అసలు పడటం లేదు. సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం జూపల్లి డామినేషన్ భరించలేమని ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ రాధ ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి…. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఈ విషయం స్థానిక నేత, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మాట మాత్రమైనా చెప్పలేదట. మీడియాలో ఈ వార్తను చూసిన జీవన్ రెడ్డి అవాక్కయ్యారని తెలుస్తోంది. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని నేతలను ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి నిలదీశారు.
రేవంత్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా టీఆర్ఎస్ వర్గాలను పార్టీలో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా గతంలో పార్టీని నిండా ముంచేసి… గాలికొదిలేసి వెళ్లిన వారిని ఎన్నికల సమయంలో ఆహ్వానించడమేంటని కొందరి ప్రశ్న. వచ్చిన వారు డబుల్ గేమ్ ఆడే ప్రమాదముందని, గెలిచిన తర్వాత మళ్లీ జారిపోరన్న నమ్మకమేంటని కొందరు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం రావడం లేదు. అసంతృప్తి స్వరాలు గట్టిగా వినిపించినా… వారిని బుజ్డగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించడం లేదు. రేవంత్ వర్గం, కోమటి రెడ్డి వర్గం అంటూ గ్రూపులు కడుతున్నారే తప్ప అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నించడం లేదు..