దారి తప్పుతున్న దర్యాప్తు సంస్థలు

By KTV Telugu On 4 December, 2022
image

పంజరాల్లో చిలుకలు పాలకుల అమ్ములపొదిలో అస్త్రాలు
దారి తప్పుతున్న దర్యాప్తు సంస్థలు రాజకీయ కక్షసాధింపుకు దారులు

“దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలకి అస్త్రాలుగా మారిపోతున్నాయా? నీ దగ్గర ఈడీ,సీబీఐ ఉంటే నా దగ్గర ఏసీబీ ,సిఐడీ ఉన్నాయని సవాళ్లు విసురుకునే వైఖరి దేనికి సంకేతం? రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవలసిన దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు వాడుకుంటున్నారా?
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో అసలేం జరుగుతోంది?”

పౌరాణిక సినిమాల్లో రకరకాల అస్త్రాలు సంధించడం చూస్తూ ఉంటాం. ఇప్పుడంటే పౌరాణిక సినిమాలు ఎక్కువగా రావడం లేదు కానీ ఎనభైలకు ముందు వరకు పౌరాణికాలు రాజ్యమేలేవి. అందులో వైరి వర్గాల మధ్య చిత్ర విచిత్ర అస్త్రాలు ఉండేవి. ఒకళ్లు నాగాస్త్రం సంధిస్తే ప్రత్యర్ధి గరుడాస్త్రంతో దానికి అడ్డుకట్ట వేస్తాడు. ఒకరు ఆగ్నేయాస్త్రం సంధిస్తే మరొకడు వరుణాస్త్రంతో దాన్ని తిప్పికొడతాడు. అన్నింటిలోకీ పవర్ ఫుల్ అయినది బ్రహ్మాస్త్రం. పురాణాల్లో మనం చదివిన అస్త్రాలన్నీ కూడా కాల్పనిక అస్త్రాలే. వాటిని ఎవరూ చూసింది లేదు. సంధించింది లేదు. అది వ్యాసుడి అద్భుత కాల్పనిక శక్తికి నిదర్శనాలు.

సరే అసలు విషయానికి వస్తే పురాణకాలంనాటి అస్త్రాల మాట దేవుడెరుగు కానీ మన రాజకీయ వ్యవస్థలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల దగ్గర కూడా కొన్ని అస్త్రాలు ఉంటాయి. వాటిని తమ ప్రత్యర్దులపై సంధిస్తారు. ఆ ప్రత్యర్ధులు గిల గిలా కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే ఈ అస్త్రాలను ప్రయోగించడం మొదలు పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ ను తిట్టిపోసిన బిజెపి ఇపుడు అవే అస్త్రాలను కాంగ్రెస్ కన్నా పకడ్బందీగా ప్రయోగించి రాజకీయ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు పెరిగిపోయాక రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరా కొన్ని అస్త్రాలు ఉన్నాయని గుర్తించారు. తాజాగా తెలంగాణాలో జరుగుతోన్న ఓ కేసు యావద్దేశాన్నీ ఆకర్షిస్తోంది.

అదే ఎమ్మెల్యేలకు ఎర కేసు. నలుగురు టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి తరపున ముగ్గురు దూతలు వచ్చి వంద కోట్లకు బేరసారాలాడారన్నది గులాబీ పార్టీ ఆరోపణ. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే ఫిర్యాదు ఇవ్వడంతోనే గులాబీ ఎమ్మెల్యే ఫాం హౌస్ లో బిజెపి దూతలుగా చెబుతోన్న ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బిజెపి నేతలు మండి పడ్డారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బిజెపిని దెబ్బతీయడానికే టి.ఆర్.ఎస్. డ్రామాలాడుతోందని బిజెపి ఆరోపించింది. ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ అంటే అది రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుంది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఓ అస్త్రంగా మారుతుందని గమనించిన నిందితులు ఈ కేసును సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని సిట్ పై తమకి నమ్మకం లేదని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అయితే దానికి హైకోర్టు అంగీకరించలేదు.

మొత్తానికి సిట్ పోలీసులే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనిపై సిబిఐ దర్యాప్తు అనగానే టి.ఆర్.ఎస్. నేతలు తమకి సిబిఐ అంటే నమ్మకం లేదన్నారు. సిబిఐ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుంది కాబట్టి దాన్ని నమ్మం గాక నమ్మం అన్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితను విచారణకు హాజరు కావలసిందిగా సిబిఐ నుండి నోటీసులు వచ్చాయి. త్వరలోనే ఈడీ నోటీసులూ వస్తాయంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ రావడానికి ముందు ఈడీ రావడం చాలా రాష్ట్రాల్లో చూశామని గులాబీ నేతలు ఆరోపించారు.

అంటే తమ ప్రత్యర్ధులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని తమ చెప్పుచేతల్లో ఉండే ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను పంపించి దాడులు చేయించడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అలవాటే అంటున్నారు గులాబీ బాసులు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని రాజకీయంగా ఎదుర్కోలేక ఆమె పార్టీ నేతలను ఈడీ, సీబిఐ దాడులతోనే బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం ఇలా తమపై దాడులకు సిద్ధమవుతుందని ముందుగానే ఊహించిన కేసీఆర్ కొద్ది నెలల క్రితమే తెలంగాణా రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే తెలంగాణాలో సిబిఐ దర్యాప్తుకు రావడానికి వీల్లేదన్నమాట. 2018లో ఎన్డీయే నుండి బయటకు వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే చేశారు. ఏపీలో సిబిఐ ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ అనేది కేంద్రం అస్త్రం కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న అధికారాన్నే అస్త్రంగా మలుచుకున్నారన్నమాట.

రాష్ట్ర పోలీసుల దర్యాప్తును నమ్మలేమని కేంద్రంలో ఉన్న వాళ్లు అన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలని తాము నమ్మలేమని రాష్ట్రాల్లో ఉన్న వాళ్లు అన్నా కూడా అర్ధం ఒకటే. ఇద్దరూ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్ధులపై దాడులకోసం అస్త్రాలుగా వాడుకుంటున్నారని ఇద్దరూ చెప్పకనే చెబుతున్నారు. అంతెందుకు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే చంద్రబాబు ఏం చేశారు. నా ఫోన్ ట్యాప్ చేస్తారా అంటూ ఒంటికాలిపై లేచి నిలబడ్డారు. ఆ అధికారం మీకెవరిచ్చారని మండిపోయారు. అంతే కానీ తాను తప్పు చేయలేదని ఒక్క ముక్క కూడా అనలేదు చంద్రబాబు. పైపెచ్చు తనని ట్రాప్ చేసిన తెలంగాణ ఏసీబీ పోలీసులను ఉద్దేశించి కేసీఆర్ కే సవాల్ విసిరారు చంద్రబాబు. ” మీకూ ఏసీబీ ఉంది మాకూ ఏసీబీ ఉంది. మీకూ పోలీసులున్నారు. మాకూ పోలీసులున్నారు? అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. అంటే మీరు ఏపీలోకి వస్తే మా పోలీసులు ఏదో ఒక కేసు పెట్టి లోపలకి తోస్తారు ఖబడ్దార్ అంటూ పరోక్షంగా హెచ్చరించారన్నమాట.

ఎంత దారుణమైన ఆలోచన ఇది.? దర్యాప్తు సంస్థలు తమ ఆయుధాలని ప్రభుత్వాలు బాహాటంగా వ్యాఖ్యానాలు చేసే దాకా రావడం అంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్దం చేసుకోవచ్చు. నిజానికి దర్యాప్తు సంస్థలనేవి రాజ్యాంగ బద్ధ సంస్థలు. అవి వాటి పనిని అవి సమర్ధవంతంగా చేస్తాయి. కాకపోతే వాటి పనిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటేనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలా అప్పుడప్పుడూ కేంద్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలను దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లే వాడేసుకుంటే ఇక వాటి విశ్వసనీయతకే దెబ్బ అవుతుంది. బహుశా అందుకే కావచ్చు ఓ సందర్భంలో దేశంలోని సర్వోన్నత న్యాయస్థానమే సిబిఐ, ఈడీలను ఉద్దేశించి పంజరంలోని చిలుకలు అని అభివర్ణించింది.

చిత్రం ఏంటంటే ప్రాంతీయ పార్టీల నేతలు కూడా తాము అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే మరోలాగ వ్యవహరిస్తూ ఉంటారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐని ఏపీలో అడుగు పెట్టనివ్వనన్నారు చంద్రబాబు. సిబిఐ కన్నా ఏపీ పోలీసులు ఎక్కువ సమర్ధవంతంగా పనిచేస్తారని కొనియాడారు. తీరా ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్రతీదానికీ సిబిఐ దర్యాప్తు కావాలని కోరుతున్నారు. ఏతావాతా చెప్పొచ్చేద్దేంటంటే దర్యాప్తు సంస్థలను కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ కూడా అప్పుడప్పుడూ దుర్వినియోగం చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు రాజ్యాంగ , న్యాయ రంగ నిపుణులు.