– ఇస్లాం దేశమే రగిలిపోతుంటే మనం ఎందుకిలా?
– హిజాబ్ మీద సుప్రీం కూడా తేల్చుకోలేకపోతోందా?
హిజాబ్. కొన్నాళ్లుగా ఇరాన్ దీనిపైనే నిరసనలతో అట్టుడుకుతోంది. అంతకుముందు మన దేశంలో కర్నాటక రగిలిపోయింది. హిజాబ్‌తో ఎంట్రీకి కొన్ని స్కూళ్లు అనుమతి నిరాకరించటం వివాదాస్పదమైంది. కొందరు ముస్లిం యువతుల ప్రతిఘటనతో హిజాబ్ వ్యవహారం దేశమంతా చర్చనీయాంశం అయింది. అత్యున్నత న్యాయస్థానం దీనిపై స్పష్టత ఇస్తుందనుకుంటే అక్కడా సందిగ్ధతే. సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయటంతో తీర్పు త్రిశంకుస్వర్గంలో ఉంది.
విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్‌గుప్తా సమర్థించారు. విద్యార్థుల చదువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ సుధాంశు ధులియా అభిప్రాయపడ్డారు. భిన్న తీర్పులతో తుది తీర్పు కోసం సీజేఐ ధర్మాసనానికి ఈ కేసును సిఫార్సు చేశారు.
విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హిజాబ్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. స్కూళ్లు, కాలేజీలను ఉద్రిక్తతలతో మూసివేయాల్సి వచ్చింది. సంప్రదాయిక వస్త్రధారణను వ్యతిరేకించటాన్ని ముస్లిం సంఘాలు తప్పుపట్టాయి. కొందరు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించటంతో మతపరంగా తప్పనిసరి కాదంటూ తుది తీర్పు ఇచ్చింది. ఇప్పుడు సీజేఐ ధర్మాసనం దీనిపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో చూడాలి.
ఇస్లాం దేశమైన ఇరాన్ కొన్నాళ్లుగా హిజాబ్ మీద భగ్గుమంటోంది. హిజాబ్ ధరించలేదన్న కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళ మృతితో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. హిజాబ్‌లు మంటల్లో వేస్తూ, బహిరంగంగా జుట్టు కత్తిరించుకుంటూ మహిళలు రోడ్లెక్కారు. పరదాల చాటునుంచి వచ్చి స్వేచ్ఛకోసం పోరాడుతున్నారు. ఈ సమయంలో దేశంలో హిజాబ్ వివాదంపై సుప్రీం తీర్పు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలనే అంతా కోరుకుంటున్నారు.